రవీంద్ర ప్రోద్బలంతోనే మోకా హత్య

ABN , First Publish Date - 2020-07-05T09:20:09+05:30 IST

మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ప్రోద్బలంతోనే వైసీపీ నేత మోకా భాస్కరరావు(57) హత్య జరిగిందని కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు తెలిపారు. ప్రత్యక్ష సాక్షులు,

రవీంద్ర ప్రోద్బలంతోనే మోకా హత్య

  • నిందితులు ఆయనతో చర్చించారు
  • ఆయన అభయం ఇచ్చాకే రంగంలోకి
  • ఆధారాలు సేకరించాకే మాజీ మంత్రి అరెస్ట్ట్‌
  • 20 రోజులుగా కొల్లు ఇంట్లోనే చర్చలు
  • కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్‌ వెల్లడి


మచిలీపట్నం, జూలై 4(ఆంద్రజ్యోతి): మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ప్రోద్బలంతోనే వైసీపీ నేత మోకా భాస్కరరావు(57) హత్య జరిగిందని కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు తెలిపారు. ప్రత్యక్ష సాక్షులు, నిందితుల నుంచి రాబట్టిన వివరాలు, సాంకేతిక అంశాల ఆధారంగా మాజీ మంత్రి రవీంద్రను అరెస్టు చేసినట్టు చెప్పారు. శనివారం ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ, ‘‘మచిలీపట్నం 24వ వార్డులో వైసీపీ అభ్యర్థి మోకా భాస్కరరావుకు, టీడీపీ అభ్య ర్థి చింతా నాంచారయ్య(చిన్ని)కు మధ్య ఆధిపత్యపోరు ఉంది. గత ఏడెనిమిదేళ్లుగా భాస్కరరావును అంతం చేయాలని చిన్ని ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో చిన్ని, చింతా నాంచారయ్య(పులి), మరో యువకుడితో కలిసి 20 రోజుల కిందట కొల్లు రవీంద్రతో ఆయన ఇంట్లోనే భేటీ అయ్యారు. ‘మీరు అనుమతిస్తే మోకాను చంపేస్తాం’ అని ప్రతిపాదించారు. దీనికి కొల్లు రవీంద్ర ‘ఇప్పుడు సమయం కాదు, కొంతకాలం వేచి చూడాలని’ చెప్పారు. అనంతరం పెద ఉల్లింగిపాలెంలో వివాదం జరిగి మోకా భాస్కరరావుకు, చింతా చిన్నికి మధ్య విభేదాలు మరింతగా పెరిగాయి. మోకా హత్యకు ఐదు రోజుల ముందు చింతా చిన్ని తన బంధువులతో కలిసి మరోసారి కొల్లు రవీంద్రతో భేటీ అయ్యారు. 


తన డివిజన్‌లో మోకా రాజకీయంగా, సామాజికంగా ఆధిపత్యాన్ని పెంచుకుంటున్నాడని, అతణ్ని అడ్డు తొలగించకపోతే తన మనుగడకే ప్రమాదమని చెప్పాడు. దీంతో కొల్లు రవీంద్ర ‘నా పేరు బయటకు రాకుండా మోకాను అడ్డుతొలగించాలి’ అని అభయమిచ్చారు. ఇకపై తనకు నేరుగా ఫోన్‌ చేయకుండా తన పీఏకు ఫోన్‌ చేయాలని కొల్లు రవీంద్ర చిన్నికి సూచించారు’’ అని ఎస్పీ వివరించారు. హత్య చేసిన తర్వాత  కొల్లు రవీంద్ర పీఏ రిజ్వాన్‌కు చింతా చిన్ని ఫోన్‌ చేయగా,ఫోన్‌ను రవీంద్రకు ఇచ్చారన్నారు. ‘పని అయిపోయింది’ అని చిన్ని చెప్పగా, ‘అంతా ఓకే కదా, జాగ్రత్తగా ఉండాలి. నాకు మాత్రం ఫోన్‌ చేయొద్దు’ అని రవీంద్ర చెప్పినట్టు నిర్ధారించుకున్నామని ఎస్పీ చెప్పారు. ఆతర్వాత కూడా మాజీ మంత్రి అనుచరులు కోలా రాము, ధనబాబు, మరో పీఏ నాగరాజు, చింతా చిన్ని పలుమార్లు కొల్లు రవీంద్రతో మాట్లాడారని ఎస్పీ తెలిపారు. కొల్లు రవీంద్రను అరెస్ట్‌ చేసేందుకు పోలీసులు వెళ్ల్లగా ఆయన ఇంటి వద్దలేరని, ఇంటి వెనుక నుంచి నిచ్చెన వేసుకుని కిందకు దిగి పరారైనట్టు తేలిందన్నారు.

Updated Date - 2020-07-05T09:20:09+05:30 IST