త్వరలో ఉపాధ్యాయుల రేషనలైజేషన్‌

ABN , First Publish Date - 2022-07-23T09:51:23+05:30 IST

రాష్ట్రంలో త్వరలో ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ జరగనుంది. ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం..

త్వరలో ఉపాధ్యాయుల రేషనలైజేషన్‌

  • ఆ తర్వాతే టీచరు పోస్టుల భర్తీ.. ఒకట్రెండు రోజుల్లోనే హేతుబద్ధీకరణ ప్రక్రియ
  • జిల్లా యూనిట్‌గా సర్దుబాటు.. ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం!
  • టీచర్ల నుంచి ముందుగా ఆప్షన్ల స్వీకరణ..
  • సీనియారిటీ ప్రకారం స్థానచలనం
  • ఇకపై నెలవారీగా విద్యార్థుల ప్రగతి నమోదు
  • ఒకటి, రెండు రోజుల్లోనే హేతుబద్ధీకరణ ప్రక్రియ


హైదరాబాద్‌, జూలై 22 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో త్వరలో ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ జరగనుంది. ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం.. ఖాళీల విషయంలో స్పష్టత కోసం ముందుగా రేషనలైజేషన్‌ చేపట్టాలని భావిస్తోంది. ఆ తరువాతే పోస్టులను భర్తీ చేయనుంది. ఒకటి రెండు రోజుల్లోనే హేతుబద్ధీకరణ ప్రక్రియ మొదలు కానుంది. రేషనలైజేషన్‌లో భాగంగా జిల్లా యూనిట్‌గా ఉపాధ్యాయులను ఎక్కడికక్కడ సర్దుబాటు చేయనున్నారు. రాష్ట్రంలో పెద్దసంఖ్యలో టీచర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నా వీటిని భర్తీ చేయాలంటే కొన్ని సాంకేతిక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా కొన్ని పాఠశాలల్లో ఎక్కువ మంది విద్యార్థులు ఉండి, తక్కువ సంఖ్యలో టీచర్లు ఉన్నారు. మరికొన్ని పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండి, ఉపాధ్యాయుల సంఖ్య ఎక్కువగా ఉంది. దీంతో విద్యార్థులకు సరైన బోధన సాగడం లేదు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణను నిర్వహించాలని ప్రభుత్వం గత కొంత కాలంగా ప్రయత్నిస్తోంది. అయితే కరోనా కారణంగా గత రెండేళ్లుగా పాఠశాలలు సరిగ్గా నడవకపోవడంతో ఈ విషయాన్ని పక్కన పెట్టారు. కానీ, హేతుబద్ధీకరణకు సంబంధించి అధికారులు ఇప్పటికే పూర్తి స్థాయి సమాచారాన్ని సేకరించి సిద్ధంగా ఉంచారు. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఏయే పాఠశాలల్లో ఎంత మంది విద్యార్థులున్నారు? విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఎంత మంది ఉపాధ్యాయులను హేతుబద్ధీకరించాల్సి ఉంటుంది? అ విషయంపై పూర్తి స్థాయి నివేదికను రూపొందించారు. ఉపాధ్యాయుల సీనియారిటీ ప్రకారం రేషనలైజేషన్‌లో స్థానచలనం ఉంటుంది. 


ఖాళీలపై స్పష్టత రావాలంటే..

ఈ విద్యా సంవత్సరం పాఠశాలలు తిరిగి రెగ్యులర్‌గా నడుస్తుండడంతోపాటు ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలను భర్తీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఎన్ని ఖాళీలు ఉన్నాయనే విషయంపై స్పష్టత రావాలంటే ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ జరగాల్సి ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్టు తెలిసింది. ఈ ఆదేశాలకనుగుణంగా త్వరలోనే రేషనలైజేషన్‌ షెడ్యూల్‌ను విడుదల చేసే అవకాశం ఉంది. ఆయా జిల్లాల పరిధిలోనే ఈ షెడ్యూల్‌ను ప్రకటించనున్నారు. అయితే రేషనలైజేషన్‌లో భాగంగా ఎక్కువ మంది టీచర్లు పాఠశాలల నుంచి కొందరు టీచర్లు ఇతర చోట్లకు వెళ్లాల్సి ఉంటుంది. ఇందుకోసం టీచర్ల నుంచి ఆప్షన్లు తీసుకునే అవకాశం ఉంది. ఈ ఆప్షన్లను నమోదు చేసుకున్న వారిలో సీనియారిటీకి ప్రాధాన్యం ఇస్తారు. మరోవైపు పాఠశాలల్లో విద్యార్థులకు సంబంధించిన ప్రగతిని నెల వారీగా నమోదు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు డీఈవోలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ ప్రగతి నివేదికలను ఆన్‌లైన్‌లో కూడా నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ నివేదికల్లో ఒకవేళ విద్యార్థుల ప్రగతి తగ్గినట్టుగా స్పష్టమైతే.. సంబంధిత పాఠశాల టీచర్లు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. 

Updated Date - 2022-07-23T09:51:23+05:30 IST