14 రోజుల శిశువు గుండెకు అరుదైన చికిత్స

ABN , First Publish Date - 2021-12-04T08:11:03+05:30 IST

పుట్టిన కొద్ది గంటలకే ఆ కవలలను అనారోగ్య సమస్యలు చుట్టుముట్టాయి.

14 రోజుల శిశువు గుండెకు అరుదైన చికిత్స

సర్జరీ లేకుండా చిన్న కోతతో సరిచేసిన వైద్యులు

హైదరాబాద్‌ సిటీ, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి): పుట్టిన కొద్ది గంటలకే ఆ కవలలను అనారోగ్య సమస్యలు చుట్టుముట్టాయి. అందులో ఒకరు చనిపోయారు. మరొకరికి ఊపిరి అందకపోవడంతో కిమ్స్‌ ఆస్పత్రి వైద్యులు అరుదైన వైద్య ప్రక్రియతో ప్రాణదానం చేశారు. ఐవీఎఫ్‌ విధానంలో ఇటీవల ఓ మహిళ కవలలకు జన్మనిచ్చింది. నెలలు నిండక ముందే పుట్టడంతో ఇద్దరు శిశువుల్లో ఒకరు 900 గ్రాములు, మరొకరు 850 గ్రాముల బరువుతో పుట్టారు. వీరిలో శ్వాస సమస్య మొదలై.. శరీరంలో ఇన్‌ఫెక్షన్‌ ప్రారంభమైంది. పాలు సరిగ్గా తాగకపోవడం, మూత్రపిండాల సమస్యలు కనిపించాయి. సమస్యను గుర్తించేలోపే ఓ శిశువు మృతిచెందాడు. మరో శిశువుకు పేషెంట్‌ డక్టస్‌ ఆర్టెరియోసస్‌ అనే హృద్రోగం ఉన్నట్లు గుర్తించారు. దీని వల్ల గుండెలో రంధ్రం ఏర్పడింది. తద్వారా గుండెకు ఊపిరితిత్తులకు మధ్య రక్త సరఫరా పెరిగి.. గుండె సరిగ్గా పనిచేయలేదు. మూత్రపిండాలు దెబ్బతిన్నాయి. మెదడులో అంతర్గత రక్తస్రావం ముప్పు పొంచి ఉండడంతో.. వెంటిలేటర్‌ అనివార్యమైంది. శిశువు బరువు 850 గ్రాములే కావడంతో.. శస్త్రచికిత్సకు అవకాశం లేకుండా పోయింది. దీంతో.. పిల్లల హృద్రోగ నిపుణులు డాక్టర్‌ సుదీ్‌పవర్మ, డాక్టర్‌ గౌతమి, మత్తుమందు వైద్యుడు నాగరాజన్‌ చిన్న కోతతో పికోలో అక్లూడర్‌(మె్‌షలాంటి పరికరం)ను ఆ శిశువు గుండెకు అమర్చారు. గుండెలో చిల్లు ఉన్నచోట ఈ పరికరం ఫిక్స్‌ అవ్వగానే.. మెష్‌ తెరుచుకుని, ప్యాచ్‌ పడుతుంది. దాంతో చిల్లు మూసుకుపోతుంది. శిశువుకు 14 రోజుల వయసు ఉండగా.. దీన్ని అమర్చినట్లు వైద్యులు వివరించారు. నవజాత శిశువుకు ఇలాంటి చికిత్స చేయడం దేశంలోనే అరుదని తెలిపారు.

Updated Date - 2021-12-04T08:11:03+05:30 IST