అరుదైన మేధావి.. అపురూపమైన మనిషి

ABN , First Publish Date - 2021-10-09T06:26:06+05:30 IST

డెబ్భెల తరం ఉద్యమకారుల జ్ఞాపకాల వెంట పోతే ఒక్కో మనిషీ ఒక్కో అద్భుతం. శేషయ్య 70లలో రాడికల్‌ విద్యార్థి ఉద్యమంలోకి వచ్చారు. ఆ ప్రభావం తనపై ఎంత గాఢంగా ఉందో ఆయనే ఒక ఇంటర్వ్యూలో చెప్పారు....

అరుదైన మేధావి.. అపురూపమైన మనిషి

డెబ్భెల తరం ఉద్యమకారుల జ్ఞాపకాల వెంట పోతే ఒక్కో మనిషీ ఒక్కో అద్భుతం. శేషయ్య 70లలో రాడికల్‌ విద్యార్థి ఉద్యమంలోకి వచ్చారు. ఆ ప్రభావం తనపై ఎంత గాఢంగా ఉందో ఆయనే ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. లోతైన అధ్యయనం, పదునైన ఆచరణ, గ్రామీణ ప్రాంతాల అట్టడుగు జీవితాల్లో ఉండే అసలైన భారతాన్ని విప్పి చూపిన ఉద్యమం ఒక సాహసోపేత తరాన్ని దేశానికిచ్చింది. తిరుపతి కేంద్రంగా నిర్మాణమైన విద్యార్థి ఉద్యమంలో యూనివర్సిటీ గోడల్ని ఎరుపెక్కించిన వారిలో శేషయ్య ఒకరు. ఎప్పుడన్నా ఒకసారి ఆర్‌ఎస్‌యు రోజుల్లో... అని వెనక్కి వెళ్లి ఆనాటి సాహసాల్ని చెప్పేవారు. ఇదంతా తీరిగ్గా ఒకసారి రికార్డు చేయాలని అనుకుంటూ వాయిదా వేస్తూ వచ్చాను. విప్లవ విద్యార్థి, కార్మిక, రైతుకూలీ సంఘాలతో కలిసి నడిచిన అనుభవాలెన్నో ఆయన ప్రయాణంలో ఉన్నాయి. ఇక ఆ పాదముద్రలు ఎక్కడ దొరకబట్టాలి?


శేషయ్య చాలా సున్నితమైన మనిషి. తోటి మనుషుల బాధలు, కష్టాల పట్ల ఆయన హృదయం లోలోపలి నుంచి కదిలిపోతారు. ఎంత ఎమోషనల్‌గా ఉంటారో విషయాల పట్ల అంత సైంటిఫిక్‌గా కూడా ఉంటారు. ఆయన హ్యూమెన్‌ ఎమోషన్స్‌ మనుషులతో ఆయన గాఢమైన సంబంధాల్లో ఉంటాయి. విషయాల పట్ల అవగాహన, కార్యాచరణలో చాలా సైంటిఫిక్‌గా ఉంటారు. పౌరహక్కుల ఉద్యమం ఎదుర్కొన్న సైద్ధాంతిక సవాళ్లు, నిర్మాణ సమస్యలు, హింసాత్మక దాడుల మధ్య ఆయన అందించిన నాయకత్వం, ప్రదర్శించిన తెగువ, సాహసంలో ఇవన్నీ మిళితమై ఉన్నాయి. నిజానికి నలభై ఏడు సంవత్సరాల పౌరహక్కుల సంఘం చరిత్ర పొడవునా గొప్ప తెగువ, సాహసం ఉన్నాయి. శేషయ్య ఒకానొక సంక్లిష్ట దశలో దానిని అందుకున్నారు. న్యాయశాస్త్ర పరిశోధన నుంచి పౌరహక్కుల కార్యాచరణ దాకా దాని సారాన్ని తనలోకి తీసుకున్నారు.


ప్రజాస్వామిక హక్కుల భావనను ఆయన తాత్విక స్థాయిలో ఎట్లా చర్చిస్తాడో ఆయన ఉపన్యాసాలు విన్నవాళ్లందరి అనుభవంలో ఉండి ఉంటుంది. రాజ్యాంగం గుర్తించిన హక్కులు సరే. ప్రజాస్వామిక హక్కుల భావన అంతకన్నా విస్తృతమైనది, లోతైనది. మానవ నాగరికతా వికాస క్రమంలో ఎంతో సంఘర్షణ పడి సాధించుకున్నవి సగటు మనిషి చైతన్యంలో భాగం కావడం, కాలేకపోవడం గురించి మాట్లాడేవాడు. భారత సమాజం మరెంతో సంఘర్షణకు లోను కావలసిందే. ఎందుకంటే మనం నేరుగా పారిశ్రామిక విప్లవ వారసులం కాము. అందువల్ల మన సమాజానికి హక్కుల భావన అంత సులభంగా అర్థం కాదు అంటారు. రాజ్యం, దాని అణచివేత వైపు నుంచే కాదు, హక్కులను సమాజ మౌలిక స్థాయిలో అన్వయించి చూడాలి. అలాగే సామాజిక పరిణామంలో నిన్న గుర్తించని హక్కులను ఇవాళ రాజ్యం కూడా గుర్తించడానికి దోహదం చేసే ప్రజాపోరాటాలే మౌలికమైనవని, పౌరహక్కుల ఉద్యమం అందులో అంతర్భాగమేనని అంటాడాయన. 


అందుకే హక్కుల సంఘాలు రాజ్యహింసను ఖండిస్తే సరిపోదు ‘విప్లవహింస’ను కూడా వ్యతిరేకించాలని చర్చ వచ్చినప్పుడు పౌరహక్కుల ఉద్యమం చేయవలసింది పాలకులు, ప్రజా ఉద్యమాల మధ్య తీర్పులు చెప్పడం కాదు అని స్పష్టంగా ప్రకటించారు. చట్టం, న్యాయవ్యవస్థతో సహా రాజ్యం పాలకవర్గ సాధనమని, అది ప్రయోగించే అణచివేతను, దానిని ప్రతిఘటించే ప్రజలను ఒకేలా చూడకూడదని ఆయన అంటారు.


మరి చట్టాలు, న్యాయవ్యవస్థ ప్రజలకు పనికి రావా అంటే వాటితో పనిచేయించుకోవలసింది కూడా ప్రజలే. ప్రజలు ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న వ్యవస్థలు అవి. కోర్టుల్లో న్యాయపోరాటం చేయవలసిందే. కానీ న్యాయస్థానాల వర్గ స్వభావాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. కోర్టు తీర్పులు కూడా ప్రజాచైతన్యాన్ని అనుసరించి ఉంటాయి. ప్రజాపోరాటాల ఒత్తిడి ఉంటే తప్ప కోర్టుల్లో జనన్యాయం సఫలం కాదు. ఈ అవగాహనతోనే ఆయన పౌరహక్కుల సంఘం తరఫున స్వయంగా కోర్టుల్లో పిటిషన్లు వేశారు. ఎన్‌కౌంటర్లలో పాల్గొన్న పోలీసులపై 302 సెక్షన్‌ కింద కేసు నమోదు చేయాలని ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పులో పిటిషనర్‌ శేషయ్యే. తర్వాత దానిని సుప్రీంకోర్టు కొట్టేసింది. రాజ్యం, దాని స్వభావం, పనితీరు గురించి ఆయన మాటల్లో వినాల్సిందే. స్టేట్‌ అంటే ప్రభుత్వం, పోలీసులే కాదు. దానిని మౌలిక స్థాయిలో అర్థం చేసుకోవాలి. అందుకు శేషయ్య ప్రసంగాలు, రచనలు ఎంతగానో దోహదం చేస్తాయి.

(రేపు పౌరహక్కుల సంఘం నేత ప్రొ. శేషయ్య ప్రథమ వర్ధంతి. ఈ సందర్భంగా పౌరహక్కుల సంఘం ప్రచురించిన ‘పౌరహక్కుల ఉద్యమ ధ్రువతార’ గ్రంథంలో పి. వరలక్ష్మి రాసిన వ్యాసంలోని కొన్ని భాగాలు ఇవి)

Updated Date - 2021-10-09T06:26:06+05:30 IST