ర్యాండమ్‌ టెస్టింగే శ్రీరామరక్ష

ABN , First Publish Date - 2020-03-28T09:13:42+05:30 IST

కరోనాపై పోరులో కఠినంగా వ్యవహరిస్తున్న కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు లాక్‌డౌన్‌తో కొంతమేరకు సత్ఫలితాలను సాధిస్తున్నాయి. కానీ.. కొవిడ్‌-19 కట్టడికి లాక్‌డౌన్‌ ఒక్కటే చాలదని

ర్యాండమ్‌ టెస్టింగే శ్రీరామరక్ష

ఇప్పటికీ గుంపులుగా బయటకు జనం..

లక్షణాలు కనిపించిన తర్వాతే పరీక్షలు

ఈలోగా వారి నుంచి వైరస్‌ వ్యాప్తి

కరోనాపై ఎదురుదాడితోనే నిర్మూలన

ఈ కసరత్తుతోనే అడ్డుకట్ట: వైద్య నిపుణులు

వైరస్‌ సోకినవారిని గుర్తించడం

ఐసోలేట్‌ చేయడం.. పరీక్షించడం

వారి నుంచి సోకినవారిని గుర్తించడం

ఈ కసరత్తుతోనే అడ్డుకట్ట: నిపుణులు

విదేశాల నుంచి వచ్చినవారి సంఖ్యకు

నిఘాలో ఉన్నవారి సంఖ్యకు మధ్య తేడా

నియంత్రణకిది విఘాతం: కేబినెట్‌ సెక్రటరీ


హైదరాబాద్‌/హైదరాబాద్‌ సిటీ/న్యూఢిల్లీ, మార్చి 27 (ఆంధ్రజ్యోతి): కరోనాపై పోరులో కఠినంగా వ్యవహరిస్తున్న కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు లాక్‌డౌన్‌తో కొంతమేరకు సత్ఫలితాలను సాధిస్తున్నాయి. కానీ.. కొవిడ్‌-19 కట్టడికి లాక్‌డౌన్‌ ఒక్కటే చాలదని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. మరీ ముఖ్యంగా.. వైరస్‌ ఉధృతి చైనాలో, ఇతర దేశాల్లో ఎక్కువగా ఉన్నప్పుడు ఆయా దేశాల నుంచి మనవాళ్లు మనదేశానికి లక్షల సంఖ్యలో వచ్చారు. వారిలో చాలా మందికి ఎయిర్‌పోర్టులో థర్మల్‌ స్ర్కీనింగ్‌ చేసి.. హోం క్వారంటైన్‌లో ఉండాల్సిందిగా సూచించారు. అయినా వారిలో చాలామంది పట్టించుకోవట్లేదు. ఉదాహరణకు..   ప్రముఖ హక్కుల సంఘం నేత కుమారుడు ఇటీవల విదేశాల నుంచి వచ్చాడు. సీనియర్‌ రాజకీయ నేత ఇంటి పక్కనే అతడి ఇల్లు కూడా. హోం క్వారంటైన్‌లో ఉండాలన్న అధికారుల సూచనలను పెడచెవిన పెట్టి అతడు రోజూ తన పెంపుడు కుక్కను తీసుకుని బయటకు వస్తున్నాడు. అతణ్ని ప్రశ్నించే సాహసం చేయలేక స్థానికులు భయంతో సతమతమవుతున్నారు. ఇదే కోవలో షార్ట్‌ఫిలిమ్స్‌ దర్శకుడొకరు.. టీవీ సీరియళ్లకు కెమెరామ్యాన్‌గా పనిచేసే మరొకరు.


ఇలా చాలామంది ప్రభుత్వ సూచనలను పట్టించుకోవట్లేదు. శుక్రవారంనాడు ఇలా తిరుగుతున్నవారిలో ఒకరిని ఖైరతాబాద్‌లో, శేరిలింగంపల్లిలో నలుగురిని, చార్మినార్‌ ఏరియాలో ఐదుగురిని, కూకట్‌పల్లిలో ఆరుగురిని పోలీసులు పట్టుకుని ప్రభుత్వ క్వారంటైన్‌కు తరలించారు.  వారిలో ఎవరికైనా ఇప్పటికే వైరస్‌ సోకి ఉంటే.. వారి నుంచి ఎంత మందికి అది వ్యాపిస్తుందో ఆ ముప్పును ఊహించడం కూడా కష్టం. నిజానికి మొదటిదశలో మన అధికారులు కూడా ఈ వైరస్‌ ముప్పును అంత తీవ్రంగా భావించలేదు. థర్మల్‌ స్ర్కీనింగ్‌ను సైతం తూతూమంత్రంగా చేశారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర కేబినెట్‌ సెక్రటరీ రాజీవ్‌గౌబా కూడా దేశంలోని అన్ని కేంద్రపాలిత/రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరిస్తూ లేఖ రాశారు. విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికులకు.. ప్రభుత్వాల నిఘాలో ఉన్నవారి సంఖ్యకు తేడా ఉందని ఆందోళన వెలిబుచ్చారు. విదేశాల నుంచి వచ్చిన వారందరినీ క్వారంటైన్‌లో పెడితే తప్ప ముప్పును ఎదుర్కోలేమని పేర్కొన్నారు.


యుద్ధ ప్రాతిపదికన..

వైద్యనిపుణులు చెబుతున్న ప్రకారం.. లాక్‌డౌన్‌ వంటి చర్యలు కేవలం వైరస్‌ వ్యాపించే వేగాన్ని కొంతమేర తగ్గిస్తాయంతే. వైర్‌సను పూర్తిగా నిర్మూలించాలంటే దానిపై ఎదురుదాడి చేయాలి. అంటే.. వైరస్‌ సోకినవారిని గుర్తించడం, వారిని ఇతరులకు దూరంగా ఉంచి చికిత్స చేయడం, ఈలోపు వారి ద్వారా ఎవరికి వైరస్‌ సోకిందో వారిని గుర్తించడం.. వారికి ఐసోలేషన్‌లో ఉంచడం. ఇలా చివరి పేషెంట్‌ వరకూ గుర్తించి చికిత్స చేయాలి. ఈ ప్రక్రియ యుద్ధప్రాతిపదికన జరిగితే తప్ప వైర్‌సను నిర్మూలించలేమని చెబుతున్నారు. 


విరుగుడు అదే..

చాప కింద నీరులా విస్తరిస్తున్న కరోనాను కట్టడి చేయాలన్నా.. వైరస్‌ తీవ్రత వాస్తవంగా ఎంత ఉందో తెలుసుకోవాలన్నా.. దానికి మార్గం ర్యాండమ్‌ టెస్టింగ్‌ ఒక్కటేనని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. అంటే.. ఎలాంటి లక్షణాలూ లేకున్నా వైరస్‌ వ్యాపించే ముప్పున్న ప్రాంతాల్లో కొంతమందిని ఎంచుకుని వారికి పరీక్షలు చేయించడం. ఉదాహరణకు కూరగాయల దుకాణాలు,మాల్స్‌కు వచ్చేవారి నుంచి నమూనాలు  సేకరించడం.. గుంపులుగా బయటకు వచ్చేవారిలో కొందరికి పరీక్షలు చేయడం ద్వారా రాష్ట్రంలో వైరస్‌ తీవ్రతను అంచనా వేయవచ్చని సూచిస్తున్నారు.


‘ఈ ఏడాది జనవరి 18 నుంచి.. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులందరికీ విమానాశ్రయాల్లో స్ర్కీనింగ్‌ నిర్వహిస్తున్నాం. అప్పట్నుంచి మార్చి 23 దాకా మనదేశంలోని వివిధ రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు విదేశాల నుంచి 15 లక్షల మంది ప్రయాణికులు వచ్చారు. ఆ సంఖ్యకు.. ప్రస్తుతం ప్రభుత్వ పర్యవేక్షణలో/నిఘాలో ఉన్నవారి సంఖ్యకు మధ్య తేడా ఉంది. కరోనాపై మనం చేస్తున్న పోరుకు ఈ తేడా చాలా ప్రమాదకరం. ఇది మనను మరింత అపాయంలో పడేస్తుంది.  వైరస్‌ వ్యాప్తిని నియంత్రించాలంటే విదేశాల నుంచి వచ్చినవారందరినీ నిఘాలో ఉంచడం కీలకం. ఈ దిశగా తక్షణ చర్యలు తీసుకోవాలని కేంద్ర ఆరోగ్య, కుటుంబసంక్షేమ శాఖ పలుమార్లు విజ్ఞప్తి చేసింది. ఇందులో జిల్లాల యంత్రాంగాలను భాగం చేయాలని కోరుతున్నాం.

రాజీవ్‌ గౌబా, కేంద్ర కేబినెట్‌ సెక్రటరీ 

(రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల చీఫ్‌ సెక్రటరీలకు రాసిన లేఖ)


‘‘కొవిడ్‌-19 వ్యాప్తిని తగ్గించేందుకు చాలా దేశాలు ‘లాక్‌డౌన్‌’ వంటి పద్ధతులను పాటిస్తున్నాయి. కానీ, అలాంటి చర్యలు మాత్రమే కరోనాను ఆపలేవు. వాటివల్ల మరి కాస్త సమయం లభిస్తుందంతే. ఆ సమయాన్ని ఆయా దేశాలు ఎలా వాడుకున్నాయన్నదే ప్రశ్న. ఆ సమయంలో కరోనా వైర్‌సపై దాడి చేయాల్సిందిగా మేం ప్రపంచదేశాలకు పిలుపునిస్తున్నాం. వైరస్‌ బాధితులను గుర్తించడం, ఐసోలేట్‌ చేయడం, పరీక్షించడం, చికిత్స చేయడం. ఈలోగా వారి నుంచి ఎంత మందికి సోకిందో గుర్తించడం.. విస్తృతంగా చేస్తేనే వైర్‌సను నిర్మూలించగలం’’

టెడ్రోస్‌, ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ 


కొన్ని పరిమితులు..

ర్యాండమ్‌గా కరోనా వైరస్‌ పరీక్షలను చేయడానికి రాష్ట్రప్రభుత్వానికి కొన్ని పరిమితులున్నట్టు సమాచారం. కరోనా నిర్ధారణ కిట్స్‌ పరిమితంగా ఉన్న నేపథ్యంలో.. రోగ లక్షణాలు ఉన్నవారికేపరీక్ష చేయాలని ఐసీఎంఆర్‌ సూచించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో గాంధీ, ఉస్మానియా, నిమ్స్‌, ఫీవర్‌, ఐపీఎమ్‌, వరంగల్‌ కాకతీయ మెడికల్‌ కాలేజీతోపాటు సీసీఎంబీలో కూడా కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. వీటన్నింటిలో కలిపి రోజుకు 1720 వరకు నమూనాలను పరీక్షించవచ్చు. కానీ, ఇప్పటివరకూ రాష్ట్రంలో మొత్తం 1319 మందిని మాత్రమే పరీక్షించారు. వారిలో 1274 మందికి నెగెటివ్‌ వచ్చింది. గురువారం కేవలం 107 మంది నమూనాలను పరీక్షించారు. పరీక్షలకు అవసరమైన రీఏజెంట్‌ సొల్యూషన్స్‌ కొరత తీవ్రంగా ఉండడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. 

Updated Date - 2020-03-28T09:13:42+05:30 IST