Abn logo
Aug 14 2021 @ 00:35AM

మహాత్ముని ఆత్మబంధువు

స్వాతంత్ర్య సముపార్జనలో, జాతినిర్మాణంలో గాంధీ కృషికి, ఆయన ఉద్యమాలకు మహదేవ్ దేశాయి అందించిన తోడ్పాటు అనితరసాధ్యమైనది. మహాత్ముని వలే మహదేవ్ కూడ నిస్వార్థుడు. సంకుచితత్వం ఏ కోశానా లేని విశాలమనస్కుడు. విశాల భారతదేశంలోని అన్ని ప్రాంతాల గురించి సమగ్ర పరిజ్ఞానమున్న గుజరాతీ. మతదురహంకారాన్ని అసహ్యించుకున్న, అధికసంఖ్యాకుల ఆధిపత్యాన్ని వ్యతిరేకించిన హిందువు. ప్రపంచ వ్యవహారాల పట్ల విశేషఆసక్తి ఉన్న భారతీయుడు. గాంధీకి అందించిన సేవలు, ఆయనతో కలిసి చేసిన కృషి ద్వారా తన జాతిచరిత్రను, ప్రపంచగమనాన్ని ప్రభావితం చేసిన ఉదాత్తుడు మహదేవ్ దేశాయి.


ఆగస్టు 15 అంటే, స్వతంత్రభారత ప్రథమ ప్రభు త్వం దేశ పాలనాబాధ్యతలు చేపట్టిన రోజు అని భారతీయులందరివలే నేనూ భావించే వాణ్ణి. అయితే ఇటీవలి సంవత్సరాలలో నా వరకు ఆ తేదీ ఒక కొత్త అర్థాన్ని సంతరించుకున్నది. ఇప్పుడు, నాకున్న చరిత్ర పరిజ్ఞానంలో, అది ప్రేరేపించే భావోద్విగ్నతలో 1947 ఆగస్టు 15లో 1942 ఆగస్టు 15 ముడివడి ఉంది. పుణే జైలులో మహదేవ్ దేశాయి చనిపోయిన రోజు 1942 ఆగస్టు 15. ఆయన తోడ్పాటే లేకపోతే బ్రిటిష్ పాలన నుంచి భారత్ విముక్తమయ్యేది కాదేమో? అయినా ఆ మహోన్నత దేశభక్తుడు, స్వాతంత్ర్య సమరయోధుడు నేడు కృతజ్ఞతాపూర్వక సంస్మరణకు సైతం నోచుకోవడం లేదు! 


మహదేవ్, బహుశా, స్వతంత్ర భారతసౌధానికి రాళ్ళు ఎత్తిన అజ్ఞాత సేవకుడుగానే ఉండిపోదలుచుకుని ఉంటారు. 1917లో అహ్మదాబాద్‌లో గాంధీ జీవితంలోకి ప్రవేశించిన నాటి నుంచి, పావు శతాబ్ది తరువాత ఆగాఖాన్ ప్యాలెస్‌లో మరణించేంతవరకు ఆయన తనను తాను మహాత్ముని సేవకే నివేదించుకున్నారు. గాంధీకి కార్యదర్శి, టైపిస్ట్, అనువాదకుడు, సలహాదారుడు, సమాచారవాహకుడు, సంభాషి, సమస్యాపరిష్కర్త, ఇంకా ఎన్నో... అన్నిటినీ మించి మహాత్ముని ఆత్మబంధువు మహదేవ్ దేశాయి. ఆయన తన ఆరాధ్యుడికి భోజనం కూడా వండిపెట్టారు. మహదేవ్. చేసిన కిచిడీని గాంధీ మెచ్చుకునేవారు. 


స్వాతంత్ర్య సముపార్జనలో, జాతి నిర్మాణంలో గాంధీ కృషికి, ఆయన ఉద్యమాలకు మహదేవ్ దోహదం అనితర సాధ్యమైనది. మహాత్ముడే స్వయంగా ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ‘ఇప్పుడు నా చేతులు, పాదాలే కాదు నా మెదడు కూడా మహదేవ్ దేశాయే. అతడే లేకపోతే నేను కాళ్లు కదపలేని, మాట్లాడలేని వాణ్ణవుతాను. మహదేవ్‌తో నా అనుబంధం ప్రగాఢమవుతున్న కొద్దీ అతడెంతటి సుగుణ వంతుడో తెలుస్తోంది. అతడు కేవలం మంచి మనిషే కాదు విద్వజ్ఞుడు కూడా’ అని 1918లోనే గాంధీ తన సమీప బంధువు మగన్‌లాల్‌కు చెప్పారు. ఇరవై సంవత్సరాల అనంతరం తీవ్ర అనారోగ్యనికి గురైన మహదేవ్ సెలవు తీసుకోవడానికి నిరాకరిస్తే గాంధీ ఆయన్ని తీవ్రంగా మందలించారు. ‘నీవు అశక్తుడవయితే నేను రెక్కలు తెగిన పక్షిని అవుతానన్న సంగతి తెలియదా? నీవు మంచాన పడితే నా కార్యకలాపాలలో నాలుగింట మూడువంతుల మేరకు నేను స్వస్తి చెప్పాల్సి ఉంటుంది’ అంటూ మహాత్ముడు కలవరపడ్డారు. 


మహదేవ్ దేశాయి సన్నిహితులలో ఒకరు గాంధీ శిష్యురాలు, బ్రిటిష్ వనిత మీరా బెన్ (మెడెలెయిన్ స్లేడ్). 1925 నవంబర్‌లో ఆమెకు స్వాగతం చెప్పేందుకు మహదేవ్ అహ్మదాబాద్ రైల్వేస్టేషన్‌కు వెళ్ళారు. అదే వారి మొదటి పరిచయం. పదిహేడు సంవత్సరాల అనంతరం పుణే లోని ఆగాఖాన్ ప్యాలెస్‌లో మహదేవ్ మరణించినప్పుడు మీరాబెన్ ఆయన చెంతనే ఉన్నారు. తన ఆత్మకథలో కూడ ఆమె ఆయన గురించి ప్రముఖంగానే ప్రస్తావించారు. ‘మహదేవ్ సున్నిత మనస్కుడు. ఆ సుకుమారత్వం ఆయన హస్త నైపుణ్యాలలోనూ కన్పించేది. ఎంతటి సంక్లిష్ట విషయాన్నయినా ఆయన శీఘ్రంగా అర్థం చేసుకోగలిగేవారు. బాపూకు కుడిభుజం అయిన మహదేవ్‌ ఆయన సంభాషణలను అక్షరబద్ధం చేసేవారు. వివిధ అంశాలపై ఆయనతో చర్చించేవారు. గాంధీ తరపున లేఖలు రాసేవారు. ఏ పనైనా చాలా వేగంగా, నైపుణ్యంతో చేసేవారు. బాపూ పట్ల మహాదేవ్ అంకితభావమే ఆయనలోని విశిష్టత. ఇదే విషయంలో మా ఇద్దరి మధ్య ఒక ప్రగాఢ బంధం ఉంది’ అని మీరాబెన్‌ రాసుకున్నారు.


1942లో ‘క్విట్ ఇండియా’అని మహాత్ముడు ఘోషించినప్పుడు బ్రిటిష్ పాలకులు ఆయన్ని అరెస్ట్ చేసి పుణేలోని ఆగాఖాన్ ప్యాలెస్‌లో నిర్బంధించారు. మహదేవ్ దేశాయి, మీరాబెన్ కూడా గాంధీతో పాటు అక్కడే నిర్బంధవాసంలో ఉన్నారు. తాము సుదీర్ఘకాలం నిర్బంధంలో ఉండక తప్పదన్న వాస్తవాన్ని గ్రహించిన మహదేవ్ 1942 ఆగస్టు 14 సాయంత్రం మీరాబెన్‌తో ముచ్చటిస్తూ, ‘ఈ జైలుజీవితం రచనలు చేసేందుకు ఒక గొప్ప అవకాశం. కనీసం ఆరు పుస్తకాలు రాయాలనే యోచనలో ఉన్నాను. నా ఆలోచనలను కాగితం మీద పెట్టడాన్ని వెంటనే ప్రారంభిస్తాను’ అన్నారు. దురదృష్టవశాత్తు ఆ మరుసటిరోజే ఆయన గుండెపోటుతో మరణించారు. అప్పుడు ఆయన వయస్సు 50 సంవత్సరాలు. మహదేవ్ తనతో పాటు తీసుకువచ్చిన సూట్‌కేస్‌ను గాంధీ తెరిచి చూడగా అందులో బట్టలతో పాటు ఒక బైబిల్, న్యూస్ పేపర్ క్లిప్పింగ్స్, టాగోర్ ‘ముక్తధార’ నాటక ప్రతి, ‘బ్యాటిల్ ఫర్ ఆసియా’ మొదలైన పుస్తకాలు ఉన్నాయి. 


గుజరాతీ, ఆంగ్ల సాహిత్యాలలో అపార పాండిత్యమున్న మహదేవ్ దేశాయికి చరిత్ర, రాజకీయాలు, న్యాయశాస్త్రంలో విశేష శ్రద్ధాసక్తులు ఉన్నాయి. గాంధీ సహచరులందరిలో ఆయనే మంచి విద్వజ్ఞుడు. ఆయన చదివిన పుస్తకాలు, ఆ పుస్తకాలలో రాసిన వ్యాఖ్యల గురించి అమెరికన్ చరిత్రకారుడు ఇయాన్ దేశాయి ఒక ఆసక్తికరమైన అధ్యయనం చేశారు. దీనిపై కొన్ని సంవత్సరాల క్రితం ‘విల్సన్ క్వార్టర్లీ’లో ఒక పరిశోధనావ్యాసాన్ని ప్రచురించారు. అందులో, ‘బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా మహాత్ముని సైద్ధాంతిక పోరాటానికి అవసరమైన సమాచారాన్ని మహదేవ్ సమకూర్చేవారని ఆయన తోడ్పాటుతోనే గాంధీ తన ఆలోచనలను మరింత నిశితం చేసుకునేవారని ఇయాన్‌ వాఖ్యానించాడు.. మహదేవ్ మరణించినప్పుడు ఆయనకు నివాళిగా మాంచెస్టర్ గార్డియన్‌లో ఒక వ్యాసం వెలువడింది.


మహదేవ్ చాలా విస్తృతంగా చదివేవారు. అయినా తన ప్రాథమిక విధిని ఆయన ఎన్నడూ విస్మరించలేదు. మహాత్మునికి సలహాలు ఇవ్వడం, వివిధ పనులలో ఆయనకు సహకరించడం. మహాత్ముని నోటి వెంట వెలువడిన ప్రతి మాటను భావితరాల కోసం అక్షరబద్ధం చేయడమే ఆ విధి. గాంధీ కార్యకలాపాల గురించిన వివరాలను ఆయన సవివరంగా రాసి ఉంచేవారు. గాంధీజీ నోటి వెంట వెలువడిన అవిస్మరణీయ, చారిత్రక ప్రాధాన్యమున్న మాటలనే కాదు, చాలా అప్రధానమైన వాటిని కూడా ఆయన రికార్డు చేసి ఉంచారు. ‘గాంధీకి ప్రాణమిత్రుడు మహదేవ్. ఆయన రికార్డు చేసిన అనేకానేక విషయాలు భావి చరిత్రకారులకు గాంధీ గురించిన మౌలిక సమాచారాన్ని అందిస్తాయని’ గోపాలకృష్ణ గాంధీ అన్న మాటల్లో సంపూర్ణ సత్యముంది. 


మహదేవ్ దేశాయి 1942 ఆగస్టు 15న మరణించారు. గాంధీ ఆయన కంటే 23 సంవత్సరాలు పెద్దవాడు. మహదేవ్ అనంతరం మరో ఏడు సంవత్సరాల పాటు ఆయన జీవించారు. అయితే తుదిక్షణం వరకు మహదేవ్‌ లేని లోటును మహాత్ముడు పూరించుకోలేకపోయారు. ఆయన సలహాలు అందుబాటులో లేక పోవడం గురించి గాంధీజీ బాధపడుతుండేవారు. తన జీవితంలోని కడపటి వారంలో గాంధీ ఒక వైపు హిందువులు– ముస్లింల మధ్య సామరస్యాన్ని నెలకొల్పేందుకు కృషి చేస్తూనే మరోవైపు జవహర్‌లాల్ నెహ్రూ, వల్లభ్‌భాయి పటేల్‌ల మధ్య విభేదాలను తొలగించేందుకు సతమతమవుతుండేవారు. ఆ సందర్భంగా,  ‘మహదేవ్ లేని లోటు మున్నెన్నడూ లేని విధంగా ఇప్పుడు కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఆయనే గనుక సజీవుడై ఉంటే పరిస్థితులు ఇలా విషమించేవి కావ’ని మహాత్ముడు తన మనవరాలు మనుతో వాపోయారు.


గాంధీజీ జీవితంలో మహదేవ్‌కు ఉన్న ప్రాధాన్యం గురించి, భారత స్వాతంత్ర్య సాధనలో ఆయన విశిష్ట కృషి గురించి నాకు చాలాకాలం సరైన అవగాహన లేదు. నేను నలబయ్యోవడిలోకి ప్రవేశించిన తరువాతనే ఈ అంశాలపై ఒక స్పష్టమైన అవగాహన ఏర్పడింది. గాంధీజీ జీవితచరిత్ర రాయడం, దానికోసం అంతకుముందు ఎవరికీ అందుబాటులో లేని ఆయన వ్యక్తిగత పత్రాలను చదవడం వల్ల మహదేవ్ గురించి నాకు స్పష్టమైన అవగాహన కలిగింది. ప్రతిభావంతమైన ఆయన మేధ, మానవతాహృదయం నాకు బాగా అవగతమయ్యాయి. 


 నేను రాసిన గాంధీ జీవితచరిత్ర విడుదలయిన తరువాత నా కంటే చిన్నవాడు, అమెరికాలో పెరిగిన నా మేనల్లుడు శుబు నాకొక లేఖ రాశాడు: ‘మీ పుస్తకం చదవక ముందు మహాదేవ్ దేశాయి ప్రాధాన్యం గురించి నాకు ఏమీ తెలియదు. ఇప్పుడు మీ పుస్తకం చదివిన తరువాత మహదేవ్ లేనట్టయితే భారత్‌లో గాంధీజీ కృషి సాధ్యమయ్యేది కాదని స్పష్టంగా అర్థమయింది. మరి మహదేవ్‌ను నేటితరం భారతీయులు ఎందుకు విస్మరించారో అర్థం కావడం లేదు’. అని అందులో పేర్కొన్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం మహదేవ్ కుమారుడు నారాయణ్ దేశాయి తన తండ్రి జీవిత చరిత్రను రాశారు. అదొక స్ఫూర్తిదాయకమైన జీవితచరిత్ర అనడంలో సందేహం లేదు. అయితే గుజరాతీ, ఆంగ్లభాషల్లో నిష్ణాతులైన వారు, కొత్తగా అందుబాటులోకి వచ్చిన ప్రాథమిక సమాచారాన్ని పరిగణనలోకి తీసుకుని సరికొత్తగా మహదేవ్ దేశాయి జీవితచరిత్రను రాయవలసిన అవసరం ఎంతైనా ఉంది. 


మహాత్ముని వలే మహదేవ్ దేశాయి కూడా పూర్తిగా నిస్వార్థుడు. సంకుచితత్వం ఏ కోశానా లేని విశాలమనస్కుడు. విశాల భారతదేశంలోని అన్ని ప్రాంతాల గురించి సమగ్ర పరిజ్ఞానమున్న గుజరాతీ. ఆయన మతదురహంకారాన్ని అసహ్యించుకున్న, అధికసంఖ్యాకుల ఆధిపత్యాన్ని వ్యతిరేకించిన హిందువు. ప్రపంచ వ్యవహారాల పట్ల విశేషఆసక్తి ఉన్న భారతీయుడు. విస్తృతంగా రచనా వ్యాసంగం చేసిన ప్రతిభావంతుడు మహదేవ్లో మంచి హాస్యస్ఫూర్తి తొణికిసలాడుతుండేది. గాంధీకి అందించిన సేవలు, ఆయనతో కలిసి చేసిన కృషి ద్వారా తన జాతిచరిత్రను, ప్రపంచగమనాన్ని ప్రభావితం చేసిన ఉదాత్తుడు మహదేవ్ దేశాయి. గాంధీ–మహదేవ్‌ల మధ్య అనుబంధంపై నా పరిశోధనలో పలు అసాధారణ అంశాలు వెలుగులోకి వచ్చాయి. బ్రిటిష్ సంస్కృతిని ఆంతరంగీకరించుకున్న కశ్మీరీ జవహర్లాల్ నెహ్రూ, భారతీయతను పుణికిపుచ్చుకున్న ఇంగ్లీష్ మహిళ మీరాబెన్, తమిళ్ సంస్కృత పండితుడు విఎస్ శ్రీనివాస శాస్త్ర్తి, వైస్రాయ్ లిన్‌లిత్ గో కేథలిక్ ప్రైవేట్ సెక్రటరీ గిల్బెర్ట్ లైథ్ వెయితె మొదలైన వారితో ఆయన ఉత్తర ప్రత్యుత్తరాలు చాలా ఆసక్తిదాయకమైనవి. 


 భారత స్వాతంత్ర్య అమృతోత్సవాల సందర్భంగా నవభారత నిర్మాణానికి విశేషంగా దోహదం చేసిన బిఆర్ అంబేడ్కర్, అబుల్ కలాం ఆజాద్, సుభాస్ చంద్రబోస్, కమలాదేవి ఛటోపాధ్యాయ, బిర్సాముండా, దాదాభాయి నౌరోజీ, జవహర్‌లాల్ నెహ్రూ, వల్లభ్‌భాయి పటేల్ మొదలైన వారిని మనం ఉత్తేజకరంగా స్మరించుకుంటాం. అటువంటి మహనీయులకు సంబంధించిన ఏ జాబితాలోనైనా మహదేవ్ దేశాయి తప్పక ఉంటారు.


రామచంద్ర గుహ

(వ్యాసకర్త చరిత్రకారుడు)

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే మరిన్ని...