మండలి చైర్మన్‌గా మోషేన్‌రాజు

ABN , First Publish Date - 2021-11-19T07:58:02+05:30 IST

శాసనమండలి కొత్త చైర్మన్‌గా పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్సీ కొయ్యే మోషేన్‌రాజు ఎన్నిక కానున్నారు...

మండలి చైర్మన్‌గా మోషేన్‌రాజు

వైసీపీ తరఫున నామినేషన్‌ దాఖలు

నేడు ఎన్నికకు నోటిఫికేషన్‌ జారీ

పోటీపెట్టనన్న టీడీపీ.. ఏకగ్రీవ ఎన్నికే!


అమరావతి, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): శాసనమండలి కొత్త చైర్మన్‌గా పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్సీ కొయ్యే మోషేన్‌రాజు ఎన్నిక కానున్నారు. అభ్యర్థిని పోటీపెట్టబోమని టీడీపీ హామీ ఇవ్వడంతో శుక్రవారం ఆయన ఎన్నిక ఏకగ్రీవం కానుంది. చైర్మన్‌ ఎన్నిక శుక్రవారం నిర్వహించనున్నట్లు అసెంబ్లీ కార్యదర్శి బాలకృష్ణమాచార్యులు గురువారం నోటిఫికేషన్‌ విడుదల చేశారు. గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ ఆమోదంతో ఈ నోటిఫికేషన్‌ ఇచ్చినట్లు తెలిపారు. ఆ వెంటనే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు మోషేన్‌రాజు నామినేషన్‌ వేశారు. ఆయన అభ్యర్థిత్వాన్ని వైసీపీ ఎమ్మెల్సీలు గంగుల ప్రభాకర్‌రెడ్డి, దువ్వాడ శ్రీనివాస్‌, బల్లి కల్యాణ చక్రవర్తి బలపరిచారు. వాస్తవానికి ఈ ఎన్నికను స్థానిక సంస్థల కోటాలోని 11 మంది ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తయ్యాక చేపట్టాలని ప్రభుత్వం భావించింది. కానీ శాసనసభ సమావేశాలను ఈ నెల 26వ దాకా నిర్వహించాలని నిర్ణయించిన దరిమిలా చైర్మన్‌ ఎన్నిక చేపట్టాలని ఆకస్మికంగా నిర్ణయించారు. శుక్రవారం మధ్యాహ్నం 2.30కు ఎన్నిక జరుగుతుందని అసెంబ్లీ సెక్రటేరియేట్‌ వెల్లడించింది. ఏకగ్రీవ ఎన్నికకు సహకరించాలని మండలిలో టీడీపీ పక్ష నేత యనమల రామకృష్ణుడిని అధికార పక్షం అభ్యర్థించింది. పోటీపెట్టబోమని ఆయన హామీ ఇచ్చారు. నామినేషన్‌ పత్రాలపై తామూ ప్రతిపాదన సంతకాలు చేయాలని టీడీపీ నిర్ణయించింది.

Updated Date - 2021-11-19T07:58:02+05:30 IST