కేకేఆర్‌పై రాజస్థాన్ విన్

ABN , First Publish Date - 2021-04-25T04:58:01+05:30 IST

ఐపీఎల్ 2021లో భాగంగా కోల్‌కతా నైట్ రైడర్స్-రాజస్థాన్ రాయల్స్ మధ్య శనివారం జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ విజయం సాధించింది. మరో 7 బంతులు మిగిలుండగానే 6 వికెట్ల తేడాతో గెలుపు సొంతం చేసుకుంది. ఎప్పుడూ భారీ స్కోర్లు ..

కేకేఆర్‌పై రాజస్థాన్ విన్

ముంబై: ఐపీఎల్ 2021లో భాగంగా కోల్‌కతా నైట్ రైడర్స్-రాజస్థాన్ రాయల్స్ మధ్య శనివారం జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ విజయం సాధించింది. మరో 7 బంతులు మిగిలుండగానే 6 వికెట్ల తేడాతో గెలుపు సొంతం చేసుకుంది. ఎప్పుడూ భారీ స్కోర్లు నమోదయ్యే ముంబైలోని వాంఖడే మైదానంలో ఇలా ఓ లో స్కోరింగ్ మ్యాచ్ జరగడం ఈ సీజన్లో ఇదే తొలిసారి కావడం విశేషం. కేకేఆర్ బ్యాట్స్‌మన్‌ను రాజస్థాన్ బౌలర్లు పూర్తి స్థాయిలో నిలువరించడంతో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 133 పరుగులు మాత్రమే చేయగలిగింది. 


అనంతరం 134 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ కూడా నెమ్మదిగానే ఇన్నింగ్స్ ప్రారంభించింది. అలాగే ఓపెనర్ జోస్ బట్లర్(5: 7 బంతుల్లో.. 1 ఫోర్) మొదటి వికెట్‌ రూపంలో వెంటనే అవుట్ కావడంతో యశశ్వి జైస్వాల్‌(22: 17 బంతుల్లో.. 5 ఫోర్లు)తో కలిసి కెప్టెన్ సంజు శాంసన్(42 నాటౌట్: 41 బంతుల్లో.. 2 ఫోర్లు, 1 సిక్స్) ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. జైస్వాల్ అవుటైన తరువాత శివమ్ దూబే(22: 18 బంతుల్లో.. 2 ఫోర్లు, 1 సిక్స్) తో కలిసి స్కోరు బోర్డును నడిపించాడు. 


అయితే శివమ్ దూబేతో పాటు రాహుల్ తెవాటియా కూడా వెంటవెంటనే అవుట్ కావడంతో రాజస్థాన్ కొంత ఒత్తిడిలో పడింది. అయితే డేవిడ్ మిల్లర్‌(24 నాటౌట్: 23 బంతుల్లో.. 3 ఫోర్లు)తో కలిసి సంజూ జట్టుకు విజయాన్ని కట్టబెట్టాడు. ఈ విజయంతో రాజస్థాన్ ఈ సీజన్లో రెండో విజయాన్ని కైవసం చేసుకుంది. పాయింట్ల పట్టికలో 7వ స్థానం నుంచి 6వ స్థానానికి చేరింది. కాగా.. కేకేఆర్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 2 వికెట్లు తీయగా.. శివమ్ మావి, ప్రసిద్ధ్ కృష్ణ చెరో వికెట్ తీశారు. 

Updated Date - 2021-04-25T04:58:01+05:30 IST