రాజస్థాన్‌.. నెంబర్‌ 2

ABN , First Publish Date - 2022-05-21T09:49:11+05:30 IST

ఐపీఎల్‌ తాజా సీజన్‌లో ప్లేఆ్‌ఫ్సకు చేరిన మూడో జట్టుగా రాజస్థాన్‌ రాయల్స్‌ నిలిచింది.

రాజస్థాన్‌.. నెంబర్‌ 2

చెన్నైపై విజయం..

ప్లేఆఫ్స్ కు అర్హత

ముంబై: ఐపీఎల్‌ తాజా సీజన్‌లో ప్లేఆ్‌ఫ్సకు చేరిన మూడో జట్టుగా రాజస్థాన్‌ రాయల్స్‌ నిలిచింది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌పై ఐదు వికెట్ల తేడాతో నెగ్గింది. దీంతో 18 పాయింట్లతో పాటు, మెరుగైన రన్‌రేట్‌ కారణంగా రెండో స్థానం దక్కించుకుంది. సీఎ్‌సకే పది ఓటములతో లీగ్‌ నుంచి నిష్క్రమించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన చెన్నై 20 ఓవర్లలో 6 వికెట్లకు 150 పరుగులు చేసింది. మొయిన్‌ అలీ (93) మాత్రమే రాణించాడు. చాహల్‌, మెక్‌కాయ్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదనలో రాజస్థాన్‌ 19.4 ఓవర్లలో 5 వికెట్లకు 151 పరుగులు చేసి గెలిచింది. జైస్వాల్‌ (59), అశ్విన్‌ (40 నాటౌట్‌) అదరగొట్టారు. సోలంకికి రెండు వికెట్లు దక్కాయి. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా అశ్విన్‌ నిలిచాడు.


ఆదుకున్న జైస్వాల్‌, అశ్విన్‌:

ఓ మాదిరి ఛేదనలో రాజస్థాన్‌ ఆఖరి ఓవర్‌ వరకు ఆడాల్సి వచ్చింది. ఓపెనర్‌ జైస్వాల్‌ ఆరంభంలో మెరవగా.. చివర్లో అశ్విన్‌ బ్యాట్‌ ఝుళిపించడంతో గట్టెక్కింది. బట్లర్‌ (2) విఫలమైనా.. శాంసన్‌ (15)తో కలిసి రెండో వికెట్‌కు జైస్వాల్‌ 51 పరుగులు జోడించాడు. దేవ్‌దత్‌ (3) త్వరగానే వెనుదిరిగాడు. జైస్వాల్‌ అర్ధసెంచరీ పూర్తి చేశాక 15వ ఓవర్‌లో సోలంకి అవుట్‌ చేశాడు. తన తర్వాతి ఓవర్‌లోనే హెట్‌మయెర్‌ (6)ని కూడా అతడే పెవిలియన్‌కు చేర్చగా ఆఖర్లో కాస్త ఉత్కంఠ నెలకొంది. 12 బంతుల్లో 19 పరుగులు కావాల్సిన వేళ ఇరు జట్లకు అవకాశం కనిపించింది. కానీ అశ్విన్‌ బౌండరీలతో చెలరేగడంతో చెన్నైకి నిరాశే మిగిలింది.


అటు అలీ.. ఇటు బౌలర్లు:

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై ఇన్నింగ్స్‌ అనూహ్యంగా సాగింది. తొలి రెండు ఓవర్లలో 2/1తో ఉన్న జట్టు ఆ తర్వాతి నాలుగు ఓవర్లలో మొయిన్‌ అలీ వన్‌మ్యాన్‌ షోతో 72 పరుగులు సాధించింది. కానీ మరో 14 ఓవర్లలో చేసింది కేవలం 75 పరుగులే. ఆఖరి ఓవర్‌ వరకు అలీ ఉన్నా.. మరో ఎండ్‌లో ధోనీ ఉన్నా కూడా చాహల్‌, అశ్విన్‌ అద్భుతంగా కట్టడి చేయగలిగారు. దీంతో 200రన్స్‌ సులువే అనుకున్న చోట అతి కష్టమ్మీద సీఎ్‌సకే 150 స్కోరు చేసింది. అంతకుముందు ఓపెనర్‌ రుతురాజ్‌ (2)ను మొదటి ఓవర్‌లోనే కోల్పోగా మరో ఓపెనర్‌ కాన్వే (16)తో కలిసి అలీ బ్యాట్‌ ఝుళిపించాడు. మూడో ఓవర్‌లో కాన్వే 6,4తో 12 పరుగులు వచ్చాయి. ఆ తర్వాత మరో మూడు ఓవర్లలో అలీ ఏకంగా 60 పరుగులు రాబట్టడం విశేషం.


ప్రసిద్ధ్‌ వేసిన ఇన్నింగ్స్‌ నాలుగో ఓవర్‌లో 4,4,6,4.. అశ్విన్‌ ఓవర్‌లో 4,4,6.. ఆరో ఓవర్‌లోనైతే 6,4,4,4,4,4తో ఏకంగా 26 పరుగులు రాబట్టడంతో పవర్‌ప్లేలో జట్టు 75/1 స్కోరుతో నిలిచింది. అటు 19 బంతుల్లోనే అలీ ఫిఫ్టీ పూర్తి చేశాడు. రెండో వికెట్‌కు 83 పరుగులు జత చేశాక ఎనిమిదో ఓవర్‌లో కాన్వేను అశ్విన్‌ అవుట్‌ చేశాడు. ఆ తర్వాత అంతా రాజస్థాన్‌ ఆధిపత్యమే నడిచింది. జగదీశన్‌ (1), రాయుడు (3) నిరాశపర్చారు. క్రీజులో అలీ, ధోనీ (26) ఉన్నా 8-14 ఓవర్ల మధ్య ఒక్క ఫోర్‌ కూడా రాకపోగా 28 పరుగులే వచ్చాయి. డెత్‌ ఓవర్లలోనూ ఈ జోడీ బ్యాట్లు ఝుళిపించలేకపోయింది. దీనికి తోడు చివరి రెండు ఓవర్లలో ధోనీ, అలీ కూడా వెనుదిరగడంతో ఐదో వికెట్‌కు 51 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఆఖరి ఐదు ఓవర్లలో 33 పరుగులు మాత్రమే చేసింది.


సంక్షిప్త స్కోర్లు

చెన్నై:

20 ఓవర్లలో 150/6 (మొయిన్‌ అలీ 93, ధోనీ 26, చాహల్‌ 2/26, మెకాయ్‌ 2/20, అశ్విన్‌ 1/28);

రాజస్థాన్‌:

19.4 ఓవర్లలో 151/5 (యశస్వి జైస్వాల్‌ 59, అశ్విన్‌ 40 నాటౌట్‌, సోలంకి 2/20).

Updated Date - 2022-05-21T09:49:11+05:30 IST