ఎమ్మెల్యే పదవికి రాజగోపాల్‌ రాజీనామా

ABN , First Publish Date - 2022-08-09T09:35:59+05:30 IST

నల్లగొండ జిల్లా మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తన పదవికి సోమవారం రాజీనామా చేశారు.

ఎమ్మెల్యే పదవికి రాజగోపాల్‌ రాజీనామా

వెంటనే ఆమోదించిన స్పీకర్‌.. నోటిఫికేషన్‌ జారీ


మునుగోడు సీటు ఖాళీ అయినట్లు ఈసీకి మెసేజ్‌

ఈ ధర్మయుద్ధంలో మునుగోడు ప్రజలు గెలుస్తారు

కేసీఆర్‌ నుంచి తెలంగాణకు విముక్తి కల్పిస్తారు

ఆ మూడు నియోజకవర్గాలు తప్ప కేసీఆర్‌కు ఇతర నియోజకవర్గాలు కనిపించడంలేదు

తెలంగాణ ద్రోహుల పార్టీగా మారిన టీఆర్‌ఎస్‌ 

రేవంత్‌.. తెలంగాణ కోసం ఏం త్యాగం చేశావు?

కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యలు


హైదరాబాద్‌, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): నల్లగొండ జిల్లా మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తన పదవికి సోమవారం రాజీనామా చేశారు. శాసనసభలో స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డిని స్వయంగా కలిసి రాజీనామా పత్రాన్ని అందజేశారు. మునుగోడు నియోజకవర్గ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఏకవాక్యంతో అందులో పేర్కొన్నారు. రాజీనామాకు ఎలాంటి కారణాలూ తెలపలేదు. కాగా, రాజగోపాల్‌రెడ్డి రాజీనామాను స్పీకర్‌ వెంటనే ఆమోదించారు. స్పీకర్‌ శ్రీనివాసరెడ్డి ఆదేశాల మేరకు శాసన సభ కార్యదర్శి వి.నర్సింహాచార్యులు నోటిఫికేషన్‌ జారీ చేశారు. ఈ రాజీనామా సోమవారమే అమల్లోకి వచ్చిందని తెలిపారు. రాజగోపాల్‌రెడ్డి రాజీనామాతో మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ(93) సీటు ఖాళీ అయిందని స్పీకర్‌ ప్రకటించారు. ఖాళీ వివరాలను భారత ఎన్నికల సంఘం(ఈసీఐ)కు పంపించారు. కాగా, రాజీనామాకు ముందు రాజగోపాల్‌రెడ్డి..


గన్‌పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సబ్బండ వర్గాల పోరాటంతో ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్‌ కుటుంబం అరాచక పాలన సాగిస్తోందని ఆరోపించారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రజలు ఆత్మగౌరవం కోరుకుంటున్నారని, ఇందుకోసమే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై ధర్మయుద్ధం ప్రకటించానని తెలిపారు. ఈ యుద్ధంలో మునుగోడు ప్రజలు గెలుస్తారని, తెలంగాణకు కేసీఆర్‌ నుంచి విముక్తి కల్పిస్తారని అన్నారు. కేసీఆర్‌ పడుకున్నా, లేచినా.. మునుగోడు ప్రజలే గుర్తుకురావాలని వ్యాఖ్యానించారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రిని కలవాలని ఎన్నోసార్లు ప్రయత్నించినా అపాయింట్‌మెంట్‌ ఇవ్వలేదని చెప్పారు. మునుగోడు ప్రజలపై ఉన్న నమ్మకంతోనే నిస్వార్థంగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తీర్పు కోరుతున్నానని వెల్లడించారు. తనపై సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని, తనను గెలిపించి ప్రజలు పాపం చేశారని కొందరు వ్యాఖ్యానించడం విచిత్రంగా ఉందని అన్నారు.


రాష్ట్ర ప్రజలంతా ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నిక గురించే మాట్లాడుకుంటున్నారని తెలిపారు. కాంగ్రెస్‌, టీఆర్‌ఎ్‌సకు చెందిన చాలా మంది నేతలు తనతో మాట్లాడుతున్నారని చెప్పారు. కాగా, టీఆర్‌ఎస్‌ తెలంగాణ ద్రోహుల పార్టీగా మారిందని రాజగోపాల్‌ ఆరోపించారు. మంత్రులు గంగుల, ఎర్రబెల్లి, తలసాని, పువ్వాడ ఉద్యమకారులా? అని ప్రశ్నించారు. తెలంగాణలో ప్రజాస్వామ్యం లేకుండా పోయిందని అన్నారు. సీఎం కేసీఆర్‌కు సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్‌ తప్ప ఇతర నియోజకవర్గాలు కనిపించడంలేదని విమర్శించారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తెలంగాణ కోసం ఏ త్యాగం చేశారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఉద్యమంలో పాల్గొనకుండా.. ఇప్పుడు గొప్పలు మాట్లాడితే ప్రజలు నమ్మరని అన్నారు. చుండూరు సభలో పీసీసీ అధ్యక్షుడు, ఆయన మనుషులు మాట్లాడిన భాష విని తెలంగాణ సమాజం తల దించుకుంటోందన్నారు. కోమటిరెడ్డి సోదరులను తిట్టించిన భాష విన్న ప్రజలందరూ రేవంత్‌ విధానాలపై ఆలోచించాలన్నారు. కాగా, 21న తాను బీజేపీలో చేరనున్నట్లు రాజగోపాల్‌రెడ్డి ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.

Updated Date - 2022-08-09T09:35:59+05:30 IST