నిర్మల్‌ గుండె చెరువు!

ABN , First Publish Date - 2021-07-24T07:22:02+05:30 IST

వరుణుడి ప్రకోపానికి నిర్మల్‌ అతలాకులమైంది. ఒక్కరోజు.. గురువారం ఒక్కరోజే కురిసిన కుండబోత వర్షం.. వరదై పోటెత్తి నిర్మల్‌ పట్టణం, భైంసా సహా జిల్లా వ్యాప్తంగా బీభత్సం సృష్టించింది. వరద ఉధృతికి ఏకంగా

నిర్మల్‌ గుండె చెరువు!

25 చెరువులు, 25 కాలువలకు గండ్లు.. వరద నీటిలో 300 ఇళ్లు

పేరుకుపోయిన బురద, ఇసుక.. జిల్లాలో కూలిన 600 విద్యుత్‌ స్తంభాలు

రోడ్లు ధ్వంసం.. విద్యుత్తు, నీటి సరఫరాకు అంతరాయం

భైంసాలో గుండెగావ్‌ బాధితుల ఆందోళన.. శుక్రవారం 13 సెం.మీ వాన

కడెంలో 22 సెంమీ.. వేర్వేరు చోట్ల వాగుల్లో పడి ముగ్గురి మృతి

పంట నష్టం.. నేడూ భారీ వర్షాలు.. సాగర్‌లోకి 20 వేల క్యూసెక్కులు


నిర్మల్‌, జూలై 23 (ఆంధ్రజ్యోతి): వరుణుడి ప్రకోపానికి నిర్మల్‌ అతలాకులమైంది. ఒక్కరోజు.. గురువారం ఒక్కరోజే కురిసిన కుండబోత వర్షం.. వరదై పోటెత్తి నిర్మల్‌ పట్టణం, భైంసా సహా జిల్లా వ్యాప్తంగా బీభత్సం సృష్టించింది. వరద ఉధృతికి ఏకంగా 25 చెరువులు, 25 కాల్వలు తెగి పోయాయి. ఆ నీరంతా పొలాలు, రోడ్లు, కాలనీలు, ఇళ్లను ముంచెత్తింది. పంట చేలల్లో వరద నీరు నిలిచి మొక్కలు మురిగిపోతున్నాయి. పలుచోట్ల రోడ్లు తెగిపోయాయి. కాలనీలు చెరువులను తలపించాయి. ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు కట్టుబట్టలతో రోడ్డున పడ్డారు. బియ్యం, ఇతర నిత్యావసరాలు తడిసిపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వరదల ధాటికి జిల్లా వ్యాప్తంగా 600కుపైగా విద్యుత్తు స్తంభాలు నేలకొరిగాయి. 79ట్రాన్స్‌ఫార్మార్లు దెబ్బతిన్నాయి. ఎన్నో గ్రామాలకు విద్యుత్తు, తాగునీటి సరఫరా నిలిచిపోయింది. నిర్మల్‌ పట్టణంలోని జీఎన్‌ఆర్‌ కాలనీలోని 300ఇళ్లు వరదలో చిక్కుకున్నాయి. మరో రెండు కాలనీలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. గురువారం రాత్రే ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. శుక్రవారం చాలామంది ఇళ్లకు వెళ్లారు. జిల్లాలో పలు చెరువులు, కాలువలు తెగిపోవడంతో నీటిపారుదల శాఖకు రూ.3 కోట్లకు పైగా నష్టం వాటిల్లింది. పంచాయతీ రాజ్‌ పరిధిలో తొమ్మిది రోడ్లు పూర్తిగా దెబ్బతినడంతో ఆ శాఖకు రూ.2.5 కోట్ల మేర నష్టం వాటిల్లింది. శుక్రవారం కూడా జిల్లాలో పలుచోట్ల భారీ వర్షం పడింది. జిల్లా వ్యాప్తంగా 12.9 సెం.మీ వర్షపాతం నమోదవ్వగా, కడెం మండలంలో అత్యధికంగా 22 సెం.మీ వర్షపాతం రికార్డయింది.


శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల వర్షాలు పడ్డాయి. ములుగు జిల్లా తాడ్వాయిలో 13.5, ఖమ్మం జిల్లా కల్లూరులో 10.5, వికారాబాద్‌ లో 6.7, భద్రాద్రి జిల్లా పినపాకలో 6.4, ఆదిలాబాద్‌ జిల్లా వాంకిడిలో 3.8, రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో 2.9, మంచిర్యాల జిల్లా జన్నారంలో 2.15 సెంటీమీటర్ల వర్షం కురిసింది. మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలో గురువారం పెద్దనపల్లి వాగు దాటుతూ సండ్రల్‌పాడ్‌కు చెందిన కాల్వ లచ్చయ్య (55)అనే రైతు ప్రవాహానికి కొట్టుకుపోయాడు. శుక్రవారం మృతదేహం లభ్యమైంది. ఇదే జిల్లాలో మందలమర్రికి చెందిన వ్యవసాయ కూలీ చంద్రయ్య (52) మామిడివాగులో పడి మృతిచెందాడు. ఖమ్మం జిల్లా గోకవరం చెరువు వద్దకు చేపల వేటకు వెళ్లి, బురదలో కూరుకుపోయి ఖాన్‌ఖాన్‌పేటకు చెందిన సట్టుబోయిన మహేశ్‌ (25) చనిపోయాడు. ములుగు రూరల్‌కు చెందిన పశువుల కాపరి ఆకుల లక్ష్మయ్య, గోదావరిలో చిక్కుకుపోయాడు. కొత్తగూడెం జిల్లా చర్ల మండలం సీకత్తిగూడేనికి చెందిన ముగ్గురు గోదావరిలో చిక్కుకుపోగా రక్షించారు. గోదావరిఖనిలోని మల్కాపురం వద్ద ఓ ఇటుక బట్టీలో ఇరుక్కుపోయిన 33 మంది కార్మికులను సింగరేణి రెస్క్యూ టీం కాపాడింది. గోదావరి వంతెన సమీపంలోని లారీ అసోసియేషన్‌ యార్డు నీట మునిగింది. 



పలు రైళ్ల రద్దు

భారీ వర్షాల కారణంగా జగత్‌పురి-కాసరా-కార్జత్‌ కొల్హాపూర్‌ సెంట్రల్‌ రైల్వే పరిధిలో ట్రాక్‌ వరదనీటిలో మునిగిపోవడంతో పలురైళ్లను రద్దు చేశారు. 27న సికిందరాబాద్‌ నుంచి ఎల్‌టీటీ వెళ్లే రైలును, 28న ఎల్‌టీటీ నుంచి సికిందరాబాద్‌కు వచ్చే రైళ్లను రద్దు చేసినట్టు అధికారులు తెలిపారు. 24 నుంచి 27 వరకు సీఎస్‌టీ ముంబై నుంచి ఆదిలాబాద్‌ వచ్చే రైలును, ఆదిలాబాద్‌ నుంచి సీఎ్‌సటీ ముంబై వెళ్లే రైలును, హైదరాబాద్‌ నుంచి సీఎ్‌సటీ ముంబై వెళ్లే రైలును, సీఎ్‌సటీ ముంబై నుంచి హైదరాబాద్‌కు వచ్చే రైలును జూలై 24 నుంచి 27 వరకు రద్దు చేశారు. 


ఉధృతంగా గోదావరి 

ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా కృష్ణానది పరిధిలోని జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్‌ ప్రాజెక్టులోకి భారీగా నీరు చేరుతోంది. జూరాల నిండు కుండను తలపిస్తోంది. ప్రాజెక్టులోకి 1.66 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా 1.68 లక్షల క్యూసెక్కులను వదులుతున్నారు. శ్రీశైలంలోకి 1.92 లక్షల క్యూసెక్కుల వరద వస్తోంది, విద్యుదుత్పత్తి కోసం సాగర్‌లోకి 19,741 క్యూసెక్కులను వదులుతున్నారు.  సాగర్‌ పూర్తి స్థాయి నీటిమట్టం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం 180టీఎంసీల నీరు ఉంది.  పులిచింతలకు 31వేల క్యూసెక్కుల వరద వస్తుండగా 21,484 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. మూసీ ప్రాజెక్టు నుంచి 12,601 క్యూసెక్కులను వదులుతున్నారు. ఇక కాళేశ్వరం వద్ద గోదావరి ఉప్పొంగుతుండడంతో చివరి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. మేడిగడ్డలోకి అన్నారం, ప్రాణహిత నుంచి 11.3 లక్షల క్యూసెక్కుల వరద వస్తోంది. అంతే నీటిని 79 గేట్ల ద్వారా దిగువకు వదులుతున్నారు. శ్రీరాంసాగర్‌లోకి 2.25 లక్షల క్యూసెక్కుల వరదవస్తోంది. 40గేట్ల ద్వారా నీటిని వదులుతున్నారు.



గుండెగావ్‌ గ్రామస్థుల ఆందోళన

భైంసా మండలం గుండెగావ్‌లో ముంపు బాధితుల ఆగ్రహంతో రోడ్డెక్కారు. బీజేపీ ఆధ్వర్యంలో భైంసాలోని జాతీయ రహదారిపై ఆందోళన చేపట్టారు. ఏటా వర్షకాలంలో ముంపు బెడదతో పడరాని పాట్లు పడుతున్నామని, తమకు పునరావాసం కల్పించాలని గళమెత్తారు. రోడ్డుపైనే భోజనాలు చేశారు. కాగా వర్షంతో దెబ్బతిన్న నిర్మల్‌ పట్టణం, సారంగపూర్‌ మండలంలో మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి పరిశీలించారు. బాధితులను పరామర్శించి ధైర్యం చెప్పారు. నిజామాబాద్‌లో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, వరంగల్‌లో మంత్రి ఎర్రబెల్లి, ములుగు జిల్లాలో మంత్రి సత్యవతి రాథోడ్‌, ఖమ్మంలో మంత్రి పువ్వాడ వరద పరిస్థితిని సమీక్షించారు. 


వేల ఎకరాల్లో పంట నష్టం 

నిజామాబాద్‌ జిల్లాలో మూడు రోజుల పాటు కురిసిన వర్షాలతో భారీ పంటనష్టం జరిగింది. 4,126 హెక్టార్లలో సోయా, వరి, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి. జిల్లాలో 14 మండలాల పరిధిలో 105 గ్రామాల్లో  5,911 మంది రైతులకు సంబంధించిన పంటలు దెబ్బతినాయి. ఇందులో 2,161.8 హెక్టార్‌లలో వరి పంట దెబ్బతింది. 395.42హెక్టార్లలో సోయాబీన్‌, 333.27 హెక్టార్‌లలో మొక్కజొన్న పంటలకు నష్టం జరిగింది. కామారెడ్డి జిల్లాలో 18,397 ఎకరాలు,  పెద్దపల్లి జిల్లాలో 2వేల ఎకరాల్లో పంటపొలాలకు నష్టం జరిగింది. 


నేడు కొన్నిచోట్ల భారీ వర్షాలు

రాష్ట్రంలో శనివారం కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈనెల 22 న ఏర్పడిన అల్పపీడనం బలపడి తీవ్ర అల్పపీడనంగా మారిందని, దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 5.8 కి.మీ ఎత్తువరకు కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. రాగల రెండు రోజులు రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు.

Updated Date - 2021-07-24T07:22:02+05:30 IST