Abn logo
Jun 18 2021 @ 00:40AM

రాహుల్, కాంగ్రెస్‌ను వదిలేయ్‌!

విమర్శలు, వ్యం గ్యాలు, పరిహాసాలు, వేళాకోళాలు రాహుల్ గాంధీపై వర్షిస్తున్నాయి. ఆయన ప్రత్యర్థులైన బీజేపీ వారు ఆయన్ని ఒక ‘పప్పు’ (ఈ హిందీ పదానికి చిన్న బాలుడు అనే గౌరవనీయ అర్థమే కాక తెలివితక్కువవాడు అనే నిందాపూర్వక అర్థమూ ఉంది)గా భావిస్తున్నారు. దేశ నాయకత్వానికి అనర్హుడని ఘంటాపథంగా ఘోషిస్తున్నారు. భారతదేశ పురాతన రాజకీయ పక్షం సంక్షోభంలో కూరుకుపోవడానికి రాహులే బాధ్యుడని కాంగ్రెస్ సహచరులు అనేకమంది వ్యక్తిగతంగా విశ్వసిస్తున్నారు, బహిరంగంగా గొణుగుతున్నారు. ఎవరైనా ఒక కాంగ్రెస్‌వాది పార్టీ నుంచి నిష్క్రమించినప్పుడల్లా, ఆ మాటకొస్తే, ఏదైనా ఒక ఎన్నికలో కాంగ్రెస్ పరాజిత అయిన ప్రతిసారీ అందుకు రాహుల్ గాంధీనే తప్పుపడుతున్నారు. లోకుల మాట అలా ఉంచి ప్రధాన ప్రశ్నకు వద్దాం. రాహుల్ రహిత కాంగ్రెస్కు నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీని సమర్థంగా సవాల్ చేయగల సత్తా ఉంటుందా? 


2014 సాధారణ ఎన్నికలలో ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీ 2019 సార్వత్రక సమరంలో మరింత అవమానకరమైన అపజయాన్ని మూటగట్టుకుంది. దశాబ్దాల పాలనానుభవం ఉండి, చాణక్య రాజకీయాలలో రాటుదేలిన పార్టీకి ఎందుకీ పరాభవాలు? మోదీ సారథ్యంలోని బీజేపీని మట్టుబెట్టడం రాహుల్ ఆధ్వర్యంలోని కాంగ్రెస్‌కు అసాధ్యమని ఆ పరాజయాలు స్పష్టంగా సూచించాయి. 


పదిహేడు సంవత్సరాల క్రితం రాహుల్ దేశ రాజకీయాలలోకి ప్రవేశించక ముందు కాంగ్రెస్ పార్టీ దివ్యంగా వెలిగిపోతోందని కూడా చెప్పలేము. ఎందుకని? 1984 అనంతరం లోక్‌సభ ఎన్నికలలో ఒక్కసారి కూడా ఆ పార్టీ మెజారిటీ సీట్లను గెలుచుకోలేదు. ఇందిర హత్యతో వెల్లువెత్తిన సానుభూతిలో మాత్రమే 1984లో కాంగ్రెస్ చివరిసారి రికార్డుస్థాయిలో మెజారిటీ సీట్లను గెలుచుకోగలిగింది. ఉత్తరప్రదేశ్, ఇతర ఉత్తరాది రాష్ట్రాలలో కాంగ్రెస్ పతనం 1980 దశకపు తుదినాళ్ళ పరిణామం. దేశ రాజకీయాలలో సంభవిస్తున్న మౌలిక మార్పులను కాంగ్రెస్ పరాజయాలు ప్రతిబింబించాయి. కాంగ్రెస్ అనుసరిస్తున్న ప్రయోజన శూన్య లౌకికవాదం, సామాజిక న్యాయ సాధన విషయంలో చిత్తశుద్ధిలేని నిబద్ధతను మందిర్, మండల్ శక్తులు బహిర్గతం చేశాయి. దీనికి తోడు కాంగ్రెస్ ‘హైకమాండ్’ అధికార అభిజాత్యం పార్టీకి ఎనలేని హాని చేసింది. ఇందిరాగాంధీ హయాంలో ప్రారంభమై, పెచ్చరిల్లిపోయిన ఆ అభిజాత్య సంస్కృతి కాంగ్రెస్‌లో ఒకతరం ప్రాంతీయ నాయకులు అందరినీ ఒక పద్ధతి ప్రకారం బలహీనపరిచింది. అధిష్ఠానాన్ని ఎదిరించిన ఒక దేవరాజ్ అర్స్ నుంచి ఒక శరద్‌పవార్, ఒక మమతా బెనర్జీ దాకా ప్రతి ప్రాంతీయ నేతా పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యారు. లేదా సొంత ప్రాంతీయ పార్టీ ఏర్పాటు చేసుకోవడం మినహా గత్యంతరం లేని పరిస్థితి వారికి కల్పించింది. ప్రస్తుత ముఖ్యమంత్రులలో ఎనిమిది మంది పూర్వం కాంగ్రెస్ పార్టీకి చెందినవారే కావడంలో ఆశ్చర్యమేముంది? కాంగ్రెస్‌ను సమైక్యంగా నడపగలిగేది నెహ్రూ–గాంధీ కుటుంబమేనన్న అచంచల విశ్వాసం పార్టీ నాయకత్వ వ్యవస్థను బలహీనపరిచింది. సంస్థాగత క్షీణతకు దారితీసింది. దేశంలోని పలు ప్రాంతాలలో కాంగ్రెస్ పునరుజ్జీవానికి ఆస్కారం లేకుండా చేసింది. 


సంస్థాగత అవనతి కాంగ్రెస్‌ను పతనం అంచుకు చేర్చింది. ఇందుకు రాహుల్ గాంధీయే కారకుడా? కాదు, కానే కాదు. ఆయన రాజకీయాలలోకి ప్రవేశించక ముందే కాంగ్రెస్ వైభవం వెలిసిపోవడం మొదలయింది తన నానమ్మ ఇందిర కాలంలోనే ప్రస్తుత పాడుదశ ప్రారంభమయినట్టు రాహుల్ బహుశా గుర్తించవచ్చు. మరి ఆయన దేనికి బాధ్యుడు? కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత రూపంలో సంఘ్ పరివార్‌కు సైద్ధాంతిక విరోధి కాదని, మోదీ నిర్దేశిత బీజేపీని దీటుగా సవాల్ చేయగల శక్తిమంతమైన ఎన్నికల యంత్రాంగం కూడా కాదని గుర్తించడంలో విఫలమయినందుకు ఆయన్ని తప్పుపట్టవలసి ఉంది. కాంగ్రెస్ నాయకులు అందరూ అధికారలాలసులు. విఐపి హోదాలకు అలవాటు పడ్డవారు. ఎర్రదీపం కారు ఉండాలి లేదా రాజ్యసభ సీటు అయినా ఉండాలి ఇది ఉంటే లూట్యెన్స్ బంగ్లాకు అవలీలగా ఆసామి అవ్వచ్చు. మరి ఇటువంటి నాయకుల పార్టీ రాత్రికిరాత్రి విప్లవ పార్టీగా మారిపోతుందా? లౌకికవాద రక్షణకు కంకణం కట్టుకున్న క్రియాశీలుర సంస్థ అవుతుందా? వామపక్షాలతో భావసారూప్యత గల సహ ప్రయాణికుల పార్టీగా మనగలుగుతుందా? అధికారం లేకుండా సుదీర్ఘకాలం ఉండగలగడం అసాధ్యం. కాంగ్రెస్‌లో తమకు అనుభవమవుతున్న వాస్తవం ఇదే అవ్వడంతో ఆ పార్టీ నాయకులు తీవ్ర అసంతృప్తికి లోనవుతున్నారు. సమీప భవిష్యత్తులో అధికారం లభ్యమవడం అసాధ్యమనేది తప్పించుకోలేని వాస్తవమని వారికి అర్థమయింది. ఇటీవలి కాలంలో కాంగ్రెస్ నుంచి రాహుల్ సన్నిహిత సహాయకులు సహా పలువురు నాయకుల నిష్క్రమణ ఆ వాస్తవాన్నే ప్రతిఫలించింది. ఓటర్లను అమితంగా ఆకర్షించే నాయకుడు లేదా కార్యదక్షుడైన ఎన్నికల వ్యూహకర్తగా కన్పించనంతవరకు కాంగ్రెస్‌వాదులలో అత్యధికులు ఆయన నాయకత్వానికి మనఃపూర్వకంగా మద్దతునివ్వరు. ఇదొక నిశ్చిత వాస్తవం.


కాంగ్రెస్‌ను పరిపూర్ణంగా సంస్కరించాలని రాహుల్ మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తుంటే పార్టీలో కొనసాగుతూ ఆ మహత్కార్యాన్ని సాధించడం అసాధ్యమన్న సత్యాన్ని ఆయన గ్రహించి తీరాలి. నిజమేమిటంటే ప్రస్తుత కాంగ్రెస్ పార్టీలో ఉంటూ లేదా ఎన్నికల రాజకీయాలలో పాల్గొంటూ మీరు ఒక ‘నైతిక’ విప్లవాన్ని తీసుకురాలేరు. ఎందుకని? అత్యంత పోటీదాయకమైన, ఆర్థిక వనరులు దండిగా ఉన్న సమకాలీన అధికారిక రాజకీయాలలో మేధోస్ఫూర్తితో కూడిన కార్యక్రమాలకు, మానవాత్మలను కదిలించే మహాత్ములకు స్థానం లేదు. మనసా వాచా కర్మణా లౌకికవాదినని చెప్పుకుంటూ అధికారం కోసం మహరాష్ట్రలో శివసేనతోను, బెంగాల్‌లో ఇస్లామిక్ మతాచార్యుడితోనూ రాజీ పడితే ఎలా? ప్రగతిశీల విలువలు, సంప్రదాయాలను సంరక్షించేందుకు కట్టుబడి ఉన్న రాజకీయ పక్షంగా కన్పించేందుకు కాంగ్రెస్ ఆరాటపడుతోంది, కాదు, చాలా ప్రయాసపడుతోంది. 


భారతీయ జనతాపార్టీ–రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌పై సైద్ధాంతిక సమరం చేయాలని రాహుల్ గాంధీ నిజంగా ఆశిస్తుంటే అందుకు ఆయన నాయకత్వం వహిస్తున్న సైన్యం సరైనది కాదు. విలువల ఆధారిత రాజకీయాలకు నిబద్ధుడై ఉంటే తన దృఢవిశ్వాసాలకు అనుగుణంగా వ్యవహరించేందుకు ఆయన సాహసించి తీరాలి. ప్రస్తుతపు ‘ఇందిర-రాజీవ్-సోనియా’ కాంగ్రెస్‌తో తెగతెంపులు చేసుకుని తన భావాలతో ఏకీభవించే, తన స్వప్నాన్ని పంచుకునే సహచరులతో సొంతపార్టీ ఏర్పాటు చేసుకుని తన రాజకీయ ప్రస్థానానికి స్వయంగా నూతన మార్గాన్ని నిర్మించుకోవాలి. మెరుగైన రాజకీయాల విషయమై తనకొక దార్శనికత ఉంటే అది అమలు లోకి వచ్చేందుకు ఆందోళన చేయాలి. అవిరళ కృషి చేయాలి. ట్విటర్‌లో మోదీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడం లేదా అమెరికన్ మేధావులతో ఆన్‌లైన్ సంభాషణలు జరపడం కాకుండా ఈ సువిశాల భారతధాత్రి వీధుల్లోకి విచ్చేసి ప్రజలతో మమేకమవ్వాలి. వారసత్వ నాయకత్వంతో వెలుగొందే సంస్కృతి స్థానంలో సమాన అవకాశాలు సామాన్యులకూ అందుబాటులోకి వచ్చే కొత్త రాజకీయాలను తీసుకురావాలి. వారసత్వ గుదిబండను వదిలించుకుని తన సొంతంగా సమర్థ నాయకుడుగా ఆవిర్భవించేందుకు ఆయనకు ఆదొక్కటే మార్గం. తద్వారా మాత్రమే ప్రస్తుత పాలకులకు రాహుల్ బలమైన సవాళ్లను విసరగలరు. ప్రజలు ఆశిస్తున్న, విశ్వసించగల ప్రత్యామ్నాయ నాయకుడిగా ప్రభవించగలరు. 


నానమ్మ ఇందిర చరిత్ర నుంచి రాహుల్ స్ఫూర్తి పొందాలి. తనను ఇప్పుడు ‘పప్పు’అని పరిహసిస్తున్నట్టుగానే ఇందిరను అప్పట్లో ‘గూంగీ గుడియా’ (మూగబొమ్మ) అని అపహసించేవాళ్లు. అయితే అధికారంలోకి వచ్చిన మూడు సంవత్సరాలకే పాత తరం నాయకుల నుంచి సకల అవరోధాలను అధిగమించి సొంతవ్యక్తిత్వం గల నేతగా ప్రభవించడంలో ఆమె అసాధారణ విజయం సాధించారు. వాస్తవిక రాజకీయాలను ఆచరించడం ద్వారా మహోన్నత నాయకత్వ శిఖరాలను ఇందిర అధిరోహించారు. అధికార సాధన కఠోరమైనది. ఈ వాస్తవాన్ని అంగీకరించి అందుకు తనదైన రీతిలో వ్యవహరించదలుచుకున్నదీ లేనిదీ రాహుల్ వెనువెంటనే నిర్ణయించుకోవలసిన అవసరమున్నది. అధికారానికి వాస్తవికంగా పోటీపడడానికి బదులు భావాల విశ్వంలోనే ఉండిపోదలుచుకున్నారా? ఒక్కటి మాత్రం నిశ్చితం. యథాపూర్వక సౌఖ్య స్థితిలో కొనసాగడం ఆయనకు గానీ, కాంగ్రెస్ పార్టీకి గానీ ఇంకెంత మాత్రం ప్రత్యామ్నాయం కాకూడదు.

రాజ్‌దీప్‌ సర్దేశాయి

(వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్‌్ట)