రోహిత్‌ జతగా ఎవరో?

ABN , First Publish Date - 2021-10-18T07:58:02+05:30 IST

టీ20 ప్రపంచకప్‌ కోసం టీమిండియా సన్నాహకాలు ఆరంభమయ్యాయి. మెగా టోర్నీకి ముందు భారత జట్టు రెండు వామప్‌ మ్యాచ్‌లు ఆడబోతోంది.

రోహిత్‌ జతగా ఎవరో?

రాహుల్‌, ఇషాన్‌ మధ్య పోటీ

నేడు ఇంగ్లండ్‌తో భారత్‌ వామప్‌ మ్యాచ్‌

రాత్రి 7.30 నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌లో..


దుబాయ్‌: టీ20 ప్రపంచకప్‌ కోసం టీమిండియా సన్నాహకాలు ఆరంభమయ్యాయి. మెగా టోర్నీకి ముందు భారత జట్టు రెండు వామప్‌ మ్యాచ్‌లు ఆడబోతోంది. ముందుగా సోమవారం ఇంగ్లండ్‌తో.. బుధవారం ఆస్ట్రేలియాతో  కోహ్లీ సేన తలపడనుంది. అయితే అసలైన సమరంలో దిగడానికి ముందే జట్టులోని లోపాలను సరిదిద్దుకోవాలనుకుంటోంది. ముఖ్యంగా హార్దిక్‌ పాండ్యా ఫామ్‌తో పాటు బ్యాటింగ్‌ ఆర్డర్‌లో కొన్ని స్థానాలను ఎవరితో భర్తీ చేయాలో తేలాల్సి ఉంది. దాదాపుగా జట్టులోని క్రికెటర్లంతా ఐపీఎల్‌ ముగిశాక నేరుగా ఈ టోర్నీ బయో బబుల్‌లోకి ప్రవేశించారు. వీరందరికీ ప్రాక్టీ్‌సకు ఏమాత్రం కొదువ లేకపోయినా ఈనెల 24న పాక్‌తో జరిగే ఆరంభ మ్యాచ్‌లో సరైన కూర్పుతో బరిలోకి దిగాలనుకుంటోంది. అందుకే జట్టులో నేరుగా చోటు దక్కలేని క్రికెటర్లను ఈ రెండు వామప్‌ మ్యాచ్‌ల్లో పరీక్షించి ఓ నిర్ణయం తీసుకోనున్నారు. 


రాహుల్‌కు చాన్స్‌!

 ఓపెనర్‌గా రోహిత్‌ శర్మ ఖాయమే. కానీ అతడికి జతగా రాహుల్‌, ఇషాన్‌లలో ఒకరిని ఎంపిక చేయాల్సి ఉంది. ఒత్తిడి నెలకొన్న మ్యాచ్‌ల్లో అద్భుతంగా ఆడిన రాహుల్‌ ఐపీఎల్‌లోనూ పంజాబ్‌ తరఫున 626 పరుగులు సాధించాడు. ఈ విషయంలో ఇషాన్‌కన్నా చాలా ముందున్నాడు. అయితే అతడి గణాంకాలు చెన్నైపై సాధించిన 98 (నాటౌట్‌) పరుగులతోనే బాగా మెరుగయ్యాయి. అంతకు ముందు మ్యాచ్‌ల్లో పవర్‌ప్లే ఓవర్లలో కాకుండా డెత్‌ ఓవర్లలోనే వేగంగా పరుగులు సాధించాడు. మరోవైపు ముంబై ఓపెనర్‌ ఇషాన్‌ ఆరంభం నుంచే మెరుపుదాడికి దిగుతుంటాడు. చివరి రెండు మ్యాచ్‌ల్లో తన తుఫాన్‌ ఇన్నింగ్స్‌తో దాదాపు తమ జట్టును ప్లేఆ్‌ఫ్సకు చేర్చేలా కనిపించాడు. ఒకవేళ టీమ్‌ మేనేజ్‌మెంట్‌ రాహుల్‌వైపు మొగ్గితే ఇషాన్‌ మిడిలార్డర్‌లో ఆడే అవకాశం ఉంది. అప్పుడు ఆరో స్థానంలో హార్దిక్‌ రావాల్సి ఉంటుంది. అంతేకాకుండా హార్దిక్‌ ఎంతమేరకు బౌలింగ్‌ చేయగలడనేది కూడా నిశితంగా పరిశీలించాల్సి ఉంది. ముగ్గురు స్పిన్నర్లలో జడేజా, వరుణ్‌ ఖాయంగా కనిపిస్తున్నారు. మూడో స్పిన్నర్‌ విషయంలో అశ్విన్‌, రాహుల్‌ చాహర్‌ మధ్య పోటీ నెలకొంది.


బుమ్రా, భువనేశ్వర్‌ పేస్‌ విభాగంలో బాధ్యతలు తీసుకోనున్నారు. కానీ ఇద్దరు స్పిన్నర్లతోనే సరిపెట్టుకుని ముగ్గురు పేసర్లతో వెళితే శార్దూల్‌కు చాన్స్‌ దక్కవచ్చు. మరోవైపు ఇంగ్లండ్‌ జట్టులో కెప్టెన్‌ మోర్గాన్‌ ఫామ్‌ ఆందోళనకరంగా ఉంది. బెయిర్‌స్టో, జేసన్‌ రాయ్‌ బ్యాటింగ్‌ కీలకం కానుంది. కానీ స్లో ట్రాక్‌లపై బంతి బ్యాట్‌పైకి రాకపోతే మాత్రం లివింగ్‌స్టోన్‌, డేవిడ్‌ మలాన్‌ కష్టపడాల్సి ఉంటుంది.


 పాక్‌తో విండీస్‌ వామప్‌

సోమవారం భారత్‌-ఇంగ్లండ్‌ సహా నాలుగు వామప్‌ మ్యాచ్‌లు జరుగబోతున్నాయి. ఇతర ప్రాక్టీస్‌ మ్యాచ్‌ల్లో పాకిస్థాన్‌ జట్టు వెస్టిండీ్‌సను ఎదుర్కొనబోతోంది. భారత్‌తో జరిగే హైవోల్టేజ్‌ మ్యాచ్‌ కోసం వీరు కూడా పూర్తి స్థాయిలో సిద్ధమయ్యేందుకు ఎదురు చూస్తున్నారు. అలాగే అఫ్ఘానిస్థాన్‌-దక్షిణాఫ్రికా మధ్య మరో మ్యాచ్‌ జరుగుతుంది. ఈ రెండు మ్యాచ్‌లు మధ్యాహ్నం 3.30 గంటల నుంచే జరుగుతాయి. ఇక రాత్రి 7.30 గంటల నుంచి ఆసీ్‌స-న్యూజిలాండ్‌ జట్ల ప్రాక్టీస్‌ మ్యాచ్‌ ఉంటుంది. ఈ మ్యాచ్‌లన్నీ దుబాయ్‌లోని ఐసీసీ క్రికెట్‌ అకాడమీకి చెందిన రెండు మైదానాల్లో నిర్వహించనున్నారు. 


ఇతర వామప్‌ మ్యాచ్‌లు

అఫ్ఘానిస్థాన్‌గీదక్షిణాఫ్రికా (మ.3.30)

పాకిస్థాన్‌ గీవెస్టిండీస్‌ (మ.3.30)

ఆస్ర్టేలియాగీన్యూజిలాండ్‌ (రాత్రి 7.30)

Updated Date - 2021-10-18T07:58:02+05:30 IST