‘తెలంగాణ ట్వల్వ్‌’లో ఒకరైన రఘుపతిరెడ్డి కన్నుమూత

ABN , First Publish Date - 2020-07-27T08:17:26+05:30 IST

స్వాతంత్య్ర సమరయోధుడు, తెలంగాణ సాయుధ పోరాటంలో తుపాకీ పట్టి ఉరికంబం దాకా వెళ్లిన యోధుడు, ‘తెలంగాణ ట్వల్వ్‌’ కేసులో ఒకరైన

‘తెలంగాణ ట్వల్వ్‌’లో ఒకరైన రఘుపతిరెడ్డి కన్నుమూత

  • సాయుధ పోరాటంలో ఉరికంబాన్ని ముద్దాడి వచ్చిన యోధుడు
  • నేడు స్వగ్రామం రామానుజపురంలో అంత్యక్రియలు


హైదరాబాద్‌ సిటీ, జూలై 26 (ఆంధ్రజ్యోతి): స్వాతంత్య్ర సమరయోధుడు, తెలంగాణ సాయుధ పోరాటంలో తుపాకీ పట్టి ఉరికంబం దాకా వెళ్లిన యోధుడు, ‘తెలంగాణ ట్వల్వ్‌’ కేసులో ఒకరైన గార్లపాటి రఘుపతిరెడ్డి (93) ఇకలేరు. రక్తంలో ఇన్‌ఫెక్షన్‌ సమస్యతో రెండు రోజులుగా మంచానికే పరిమితమైన ఆయన.. నల్లగొండ జిల్లా రామానుజపురంలోని స్వగృహంలో ఆదివారం సాయంత్రం కన్నుమూశారు. ఆయన భార్య శకుంతల 35 ఏళ్ల క్రితమే మృతిచెందారు. ఈ దంపతులకు నర్మద, నరోత్తంరెడ్డి, విజయకుమార్‌ రెడ్డి సంతానం. గ్రామ వతందార్‌ (గ్రామ పోలీస్‌ పటేల్‌) కుటుంబంలో జన్మించిన రఘుపతి రెడ్డి.. నారాయణగూడ, కేశవ్‌ మెమోరియల్‌ హైస్కూల్లో చదువుతున్న రోజుల్లో ‘క్విట్‌ ఇండియా’ ఉద్యమంలో పాల్గొన్నారు.


వామపక్ష భావజాలం వైపు ఆకర్షితులై చదువుకు స్వస్తిచెప్పి, నిజాం వ్యతిరేక పోరాటంలోకి దూకారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట దళ నాయకుడిగా రజాకర్ల మీద పిడికిలి బిగించారు. హైదరాబాద్‌ సంస్థానం విలీనం అనంతరం అరెస్టయిన రఘుపతిరెడ్డి.. ఖమ్మం కాన్సంట్రేషన్‌ క్యాంపులో చిత్రహింసలకు గురయ్యారు. 1948 అక్టోబరులో ప్రత్యేక ట్రైబ్యునల్‌ ‘అక్కినేపల్లి’ హత్యకేసు విచారణలో ఆయనతోపాటు మరో 11 మంది సాయుధ పోరాట వీరులకు ఉరిశిక్ష విధించింది. 1951 జనవరి 21, 22న వారిని ముషీరాబాద్‌ జైల్లో ఉరితీసేందుకు ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. ‘తెలంగాణ ట్వల్వ్‌’గా పేరు పొందిన ఆ కేసును వాదించేందుకు ఇంగ్లండ్‌కు చెందిన ప్రఖ్యాత న్యాయవాది డీఎన్‌ ప్రిట్‌ విచ్చేశారు.


ఆయన చొరవ వల్ల తీర్పు అమలుకు 14 గంటల ముందు నాటి రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్‌.. ఉరిశిక్షను యావజ్జీవ శిక్షగా మారుస్తూ ఆదేశాలు జారీచేశారు. అనంతరం గుల్బర్గా, చంచల్‌గూడ జైళ్లలో తొమ్మిదేళ్లు శిక్ష అనుభవించారు. 1956లో జైలు నుంచి విడుదలయ్యారు. 1964లో భారత కమ్యూనిస్టు పార్టీ చీలికను జీర్ణించుకోలేని రఘుపతి రెడ్డి.. పార్టీ సాధారణ సభ్యత్వాన్నీ వదులుకున్నారు. కానీ వామపక్ష భావజాలాన్ని మాత్రం వీడలేదు. ‘‘కమ్యూనిస్టుగానే నా జీవితం ముగుస్తుంది’’ అని స్వీయరచనలో రాసుకొన్న రఘుపతి రెడ్డి తుదివరకు కమ్యూనిస్టు పార్టీల ఐక్యతను కాంక్షించారు. రామానుజపురంలో సోమవారం ఉదయం పది గంటలకు ఆయన అంత్యక్రియలు జరగనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.  ఆయన మృతి పట్ల సీపీఐ రాష్ట్రకార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, తెలంగాణ అమరవీరుల ట్రస్ట్‌ కార్యదర్శి ప్రతా్‌పరెడ్డి, సీనియర్‌ జర్నలిస్టు యాదగిరి, సాయుధ పోరాటయోధుడు మల్లయ్య గుప్త  సంతాపం తెలిపారు.  

Updated Date - 2020-07-27T08:17:26+05:30 IST