గో వధపై నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలి: రఘునందన్‌రావు

ABN , First Publish Date - 2021-02-28T00:54:57+05:30 IST

సిద్దిపేట శివారులో గోవధ సంఘటన ప్రదేశాన్ని శనివారం దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు సందర్శించారు.

గో వధపై నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలి: రఘునందన్‌రావు

హైదరాబాద్: నిన్న సిద్దిపేటలో గో వధ కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. పుల్లూరు రోడ్డులోని కోళ్లఫారం షెడ్డులో కబేళా నిర్వాహకులు 18 గోవులను వధించారు. ఈ సంఘటన జరిగిన ప్రదేశాన్ని శనివారం దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇంత దారుణమైన సంఘటన జరిగిన భూ యజమాని జుబేర్‌ని పోలీసులు ఎందుకు అరెస్టు చేయట్లేదని ప్రశ్నించారు. స్థానిక ఇన్‌స్పెక్టర్‌ కాకుండా మరోక ప్రత్యేక అధికారితో నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని రఘునందన్‌రావు డిమాండ్ చేశారు. విచారణ పూర్తి కానిది మీడియాను, నాయకులను ఎందుకు అనుమతించటం లేదని  రఘునందన్‌రావు నిలదీశారు. సంఘటన ప్రదేశంలో ఆనవాలు లేకుండా పోలీస్ అధికారులు మట్టి ఎందుకు పోయించారని ప్రశ్నించారు.  పట్టణానికి కూతవేటు దూరంలో ఉండి రెండేళ్లుగా ఇలాంటి సంఘటనలు జరుగుతున్న పోలీసులు ఎందుకు పట్టించుకోవడం లేదని రఘునందన్‌రావు ప్రశ్నించారు. ఈ సంఘటన అధికార పార్టీ నాయకుల కనుసైగల్లో నడుస్తోందన్నారు. 


మీడియాను నియంత్రించాలని ఏ చట్టం చెప్పడం లేదన్నారు.అరెస్టు చేసిన ముద్దాయిలను నల్లమాస్క్ వేసి మీడియాకు చూపించాలి ఎందుకు చూపించడం లేదని రఘునందన్‌రావు ప్రశ్నించారు. పట్టణంలో ఎన్నో సీసీ కెమెరాలున్న పోలీసులకు ఈ సంఘటన ఎందుకు కనిపించలేదో  చెప్పాలని నిలదీశారు. చట్టాలు చేసే వాళ్లం మేము.. చట్టాల గురించి చెప్పవద్దనే విధంగా పోలీసు అధికారులు నడుచుకుంటున్నారని రఘునందన్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈసంఘటనలో స్థానిక పోలీసుల మీద మాకు నమ్మకం లేదు.. వేరొక అధికారితో విచారణ జరిపించేలా సీపీనీ కలిసి కోరతామని రఘునందన్‌రావు పేర్కొన్నారు.

Updated Date - 2021-02-28T00:54:57+05:30 IST