తండ్రిని చూడకుండానే వెనుతిరిగిన రఘురామ కుమారుడు

ABN , First Publish Date - 2021-05-18T20:38:28+05:30 IST

ఎంపీ రఘురామకృష్ణరాజు అరెస్ట్ ఆ తర్వాత జరిగిన పరిణామాలపై ఆయన కుటుంబసభ్యులు, సన్నిహితులు ఆందోళన వ్యక్తం చేశారు.

తండ్రిని చూడకుండానే వెనుతిరిగిన రఘురామ కుమారుడు

హైదరాబాద్: ఎంపీ రఘురామకృష్ణరాజు అరెస్ట్ ఆ తర్వాత జరిగిన పరిణామాలపై ఆయన కుటుంబసభ్యులు, సన్నిహితులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల రఘురామను ఏపీ సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఆయనను పోలీసులు చిత్రహింసలకు గురిచేశారని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు ఆదేశాలతో రఘురామకు సికింద్రాబాద్‌లోని ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. తన తండ్రిని చూసేందుకు రఘురామ కుమారుడు భరత్ ఆర్మీ ఆసుపత్రికి వచ్చారు. తన తండ్రిని చూడడానికి అవకాశం ఇవ్వాలని ఆర్మీ అధికారులను భరత్ కోరారు. ఆయనను ఆర్మీ అధికారులు అడ్డుకున్నారు. కొద్దిసేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. కుటుంబసభ్యులకు ఎలాంటి అనుమతి లేదని అధికారులు తిరిగి పంపించారు. దీంతో ఆర్మీ ఆసుపత్రి నుండి రఘురామ కుమారుడు భారత్ వెనుదిరిగారు.


సికింద్రాబాద్‌ ఆర్మీ ఆసుపత్రిలో రఘురామకు వైద్యపరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే రఘురామ రక్త నమూనాలను వైద్య బృందం సేకరించింది. జ్యుడీషియల్ అధికారి నేతృత్వంలో వైద్య పరీక్షలు కొనసాగుతున్నాయి. సేకరించిన రక్త నమూనాలను వైద్య బృందం ల్యాబ్‌కు పంపింది. వైద్య పరీక్షలు మొత్తం వీడియో గ్రఫీ చేస్తున్నారు. ఈ రోజు సాయంత్రం వరకు మెడికల్ రిపోర్ట్స్ వచ్చే అవకాశం ఉందని ఆర్మీ అధికారులు చెబుతున్నారు. ఈ నెల 21 వరకు ఆర్మీ ఆసుపత్రిలో రఘురామకు చికిత్స అందిస్తారు. అదే రోజు ఆయన ఆరోగ్య పరిస్థితి, వీడియోగ్రఫి,  స్టేట్‌మెంట్‌ను సీల్డ్‌కవర్‌లో సుప్రీంకోర్టుకు జ్యుడిషియల్ అధికారి అందజేస్తారు.

Updated Date - 2021-05-18T20:38:28+05:30 IST