జాతి పుణ్య పురుషుడు

ABN , First Publish Date - 2020-02-19T06:06:57+05:30 IST

‘‘ఆం‍ధ్ర సాహిత్య పరిషత్తును కొమార్తెగాను, సూర్యరాయాంధ్ర నిఘంటువును గుమా రునిగాను భావించుకొని పంతులుగారు తమ యనపత్యతా వ్యథను బాపుకొని మనుగడ సాగించినారు’’– ‘ఆంధ్రరచయితలు’ కర్త మధునాపంతుల...

జాతి పుణ్య పురుషుడు

తెలుగు సాహిత్య చరిత్రకు, తెలుగు దేశ చరిత్ర నిర్మాణానికి అవిస్మరణీయమైన సేవ చేసిన మహనీయుడు జయంతి రామయ్య పంతులు. తెలుగు శాసన పరిశోధనా క్షేత్రంలో ఎంతో కృషి చేసిన యశోధనుడు. మధునాపంతుల వారు అన్నట్లుగా జయంతివారు  స్థాపించిన ఆంధ్రసాహిత్య పరిషత్తు, ప్రారంభించిన సూర్యరాయాంధ్ర నిఘంటువు మన పాలిట కల్పవృక్షాలుగా నేటికీ నిలిచివున్నాయి.


‘‘ఆం‍ధ్ర సాహిత్య పరిషత్తును కొమార్తెగాను, సూర్యరాయాంధ్ర నిఘంటువును గుమా రునిగాను భావించుకొని పంతులుగారు తమ యనపత్యతా వ్యథను బాపుకొని మనుగడ సాగించినారు’’– ‘ఆంధ్రరచయితలు’ కర్త మధునాపంతుల సత్యనారాయణ శాస్ర్తి 1950లో అన్న ఈ మాటలు జయంతి రామయ్య పంతుల వారి సార్థక, ధన్య జీవితాన్ని చక్కగా తెల్పుతాయి. జయంతి రామయ్య పంతులు 1860 జూలై 18న అమలాపురం తాలూకా, ముక్తేశ్వరంలో జన్మించి, 1941 ఫిబ్రవరి 9న పరమ పదించారు. 81సంవత్సరాల జీవితంలో ఆ మహానుభావుడు తెలుగు సాహిత్య చరిత్రకు, తెలుగు దేశ చరిత్ర నిర్మాణానికి చేసిన సేవ అవిస్మరణీయమైనదే కాదు, అద్భుతమైనది. 


జయంతి రామయ్య ఓ వైపు బ్రిటిషు ప్రభుత్వంలో ఉద్యోగిస్తూ, మరోవైపు ఆంధ్రదేశ చరిత్ర, సాహిత్యాలకు మహత్తరమైన సేవ చేశారు. ఆయన పిఠాపురం, బొబ్బిలి, వెంకటగిరి, ఉయ్యూరు, తుని సంస్థానాధీశుల సహకారంతో నిధులు పోగుచేసి కాకినాడలో 1911లో ఆంధ్ర సాహిత్య పరిషత్తును నెలకొల్పారు ఆయన సంపాదకత్వంలో ‘ఆంధ్రసాహిత్య పరిషత్‌ పత్రిక’ స్ధాపితమై ప్రాచీన తెలుగు కావ్యాల పరిష్కరణ, ప్రచురణ, పరిశీలనలు లక్ష్యంగా కొన్ని దశాబ్దాల పాటు వర్ధిల్లింది. వేలూరి శివరామశాస్త్రి, రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ, నడకుదుటి వీరరాజు పంతులు మొదలైన దిగ్గజ విద్వాంసుల సాహిత్య వ్యాసాలు ఈ పత్రికలో ప్రచురితమై ప్రాచీన తెలుగు కావ్యాలపై కొంగొత్త వెలుగులు ప్రసారమయ్యాయి. జయంతి రామయ్య గారు, మరికొంత మంది పండితులు ప్రాచీన తెలుగు శాసనాల్ని వెలుగులోకి తెచ్చి తెలుగుదేశ చరిత్ర, సాహిత్య చరిత్ర నిర్మాణానికి దోహదం చేశారు. జయంతి రామయ్య పంతులుకు శాసనపరిశోధన అంటే ఎంతో ఇష్టం. ఆయన తొలుత రెవిన్యూ శాఖలో, ఆ తరువాత న్యాయశాఖలో తలమునకలుగా పనిచేస్తూ 1200 శాసనాల్ని వెలికి తీసి, పరిశోధించారు.


400శాసనాల్ని ఆంధ్రవిశ్వకళా పరిషత్తుకు బహూకరించడం ఆయన చిత్తశుద్ధికి, కార్య నిర్వహణా దక్షతకు నిదర్శనం. రామయ్య గారు కాటయవేముని తొట్టరముద్ది రాగిరేకుల్ని, యుద్ధముల్లుని బెజవాడ శాసనాన్ని, రాజరాజ నరేంద్రుని నందంపూడి శాసనాన్ని, కాక తీయ చక్రవర్తి గణపతి దేవుడి మల్కాపురం శాసనాన్ని వెలికితీసి ప్రచురించారు. జయంతి వారు ప్రచురించిన ఇమ్మడి నరసింగరాయని దేవులపల్లి శాససం సాళువవంశ ప్రారంభం గురించి చెప్తుంది. రామయ్యపంతులు 800 శాసనపాఠాల్ని పరిష్కరించి ఇంగ్లీషులోనూ తెలుగులోనూ ప్రచురించారు. దక్షిణ భారతశాసన సంపుటాల్లోనూ, భారతదేశ శాసనసంపుటాల్లోనూ (ఎపిగ్రాఫికా ఇండియా) రామయ్యగారి పాఠపరిష్కరణలు, వివరణలు ప్రచురింపబడి దేశీయ, విదేశీ శాసనవేత్తల ప్రశంసలు పొందాయి. ఆయన గుంటూరు, కడపజిల్లాల్లో సేకరించి, ప్రకటించిన శాసనాలు తెలుగు చోడుల, పూర్వపల్లవుల, చాళుక్యుల చరిత్రల్లోని చీకటి కోణాలపై వెలుగులు ప్రసరింప చేశాయి.


విష్ణు కుండి నుల అస్తిత్వాన్ని తెలియజేసే శాసనాన్ని ప్రకటించడం రామయ్యగారి ప్రతిభను తెలియచేస్తుంది. జయంతి వారు పరిశోధనా క్షేత్రంలో నిస్వార్ధంగా కృషి చేసి, శాస్త్రీయంగా తమ అభిప్రాయాలు ప్రతిపాదించారని, వాదోపవాదాల్లో ఉదారపూర్వకంగా వ్యవ హరించారని, భారతీయ శాసనచ‍‍రిత్రలో బుహ్లర్‌ పండితుని లాగానే తెలుగు శాసనపరిశోధనలో జయంతి రామయ్య పంతులు యశోధనులనీ దక్షిణ భారత శాసనసంస్థ సంచాలకులు సి.ఆర్‌. కృష్ణమాచార్యులు ప్రశంసించారు. విఖ్యాత శాసనవేత్త డా. హీరానందశాస్త్రి తెలుగుశాసనాలను ఒక పుస్తక రూపంలో కాని దక్షిణభారత శాసనాల సంపుటాల్లో గాని ప్రచురించేందుకు మీకంటే ప్రతిభాంతులు నాకు మరొకరు కానరారని రామయ్య గారితో అన్నారు.


దక్షిణభారత శాసనాల సంపుటాల్లో తెలుగు శాసనాల ప్రచురణ, పరిష్కరణల బాధ్యతను జయంతి రామయ్యపంతులు చేపట్టి విజయులయ్యారు. జయంతి రామయ్యపంతులు ఆంధ్ర దేశ చరిత్ర నిర్మాణానికి పునాదిరాళ్లు వేసిన పరిశోధకులు. రాజమండ్రిలో 1922లో ‘ఆంధ్రేతిహాస పరిశోధక మండలి’ (ఆంధ్రా హిస్టారికల్‌ రీసర్చ్‌ సొసైటీ) స్థాపనలో ఆయన ప్రముఖపాత్ర నిర్వహించారు. అంతేగాక ఈ సంస్థద్వారా తెలుగు చరిత్ర నిర్మాణానికి దోహదం చేసే పరిశోధనా పత్రిక ప్రారంభవికాసాలకూ ఈ మహనీయుడు ఎంతో దోహదం చేశారు. ఈ సంస్థ ఆధ్వర్యంలోనే రాజమండ్రిలో 1937 ఆగస్టు 22న జయంతి వారికి ఘనసన్మానం జరిగింది. ఆయన 75న జన్మదిన సందర్భంగా 24 మంది ప్రముఖ చరిత్ర పరిశోధకుల వ్యాసాలతో జయంతి వారి జీవిత పరిచయంతో సభాధ్యక్షుల ఉపన్యాసంతో కూడుకొన్న ఒక అభినందన గ్రంథం వెలువడింది. 


జయంతి వారు ప్రాచీన తెలుగు కావ్యాభిమాని. పైగా పచ్చి గ్రాంథికవాది కూడా. గురజాడ, గిడుగు పిడుగు ప్రభృతులు తెలుగు పాఠ్య పుస్తకాల్లోనూ, తెలుగు సాహిత్య గ్రంథాల్లోనూ ప్రజలు మాట్లాడే సహజమైన వ్యావహారిక భాషకు ప్రాథమ్యం ఇవ్వాలని ఉద్యమం చేపడ్తే, జయంతి వారు గ్రాంథిక భాషే వుండాలని సైంధవ ప్రయత్నం చేసి కొంతకాలం నెగ్గుకొచ్చారు. కాని ఆ ప్రయత్నం ఆయన జీవితకాలంలోనే విఫలమయింది. ఆయన ఈ దిశలో రాసిన ‘డిఫెన్స్‌ ఆఫ్ లిటరరీ తెలుగు’ కాస్తా ఆయన కళ్లముందే బీరువాల్లో బందీ అయికూచుంది. ప్రాచీన తెలుగు కావ్య పక్షపాతి, పక్కా గ్రాంథిక భాషావాది అయిన రామయ్యపంతులు 1937లో ‘ఆధునికాంధ్ర వాఙ్మయ వికాస వైఖరి’ అన్న విపుల వ్యాసంలో వెలిబుచ్చిన అభిప్రాయాలు ఏమాత్రమూ ఆధునిక ఆలోచనా స్పర్శలేకుండా, ప్రాచీనతకు కాపు కాయడమే కనిపిస్తుంది. ‘‘సారాంశంలో ఈ గ్రంథం మార్పును ధిక్కరించి, గతానికి మురిసిపోయి ప్రగతిని అడ్డుకోవడమే’’ అని ఆచార్య రాచపాళెం చంద్రశేఖర రెడ్డి ఆక్షేపించారు. అయితే ఆంధ్రప్రాచీన సాహిత్యానికి, ఆంధ్రదేశ చరిత్రరచనకు రామయ్య పంతులు పాటుపడ్డ వైనాన్ని రాచపాళెంవారు రవంత కూడా స్మరించకపోవడం విచారకరం. జయంతి రామయ్యపంతులు నిస్సంతువుగానే మరణించారు. కాని మధునాపంతుల వారు అన్నట్లుగా ఆయన స్ధాపించిన ఆంధ్రసాహిత్య పరిషత్తు, ప్రారంభించిన సూర్యరాయాంధ్ర నిఘంటువు మన పాలిట కల్పవృక్షంగానే నేటికీ నిలిచివున్నాయి. -

ఘట్టమరాజు

(నేడు జయంతి రామయ్య పంతులు వర్ధంతి)

Updated Date - 2020-02-19T06:06:57+05:30 IST