Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

‘‘గెటవుట్‌ ఫ్రమ్‌ మై ఆఫీస్‌’’ అని ఆయన గట్టిగా అనడంతో అదిరిపోయాను..

twitter-iconwatsapp-iconfb-icon
గెటవుట్‌ ఫ్రమ్‌ మై ఆఫీస్‌ అని ఆయన గట్టిగా అనడంతో అదిరిపోయాను..

‘‘ఫ్రీగా కాదండీ. డబ్బులు ఇస్తున్నారు’’ అంటూ ఎస్వీఆర్‌తో జోక్‌ చేశా

‘బాపూ గారంటే మీరేనా?’ అని అడిగా..

‘‘చావు పద’’ అంటూ విగ్గుల షాపునకు తీసుకెళ్లారు పుల్లయ్య

సినిమాల్లో ట్రై చేద్దామని ఇంట్లోంచి పారిపోయి మద్రాసు వెళ్లా..

నేను ఆడవేషం వేసినప్పుడు నాన్న స్టేజ్‌ ఎక్కి విగ్‌ లాగేసి కొట్టారు..

పేరేదో బాగుందే.. పైకొస్తాడు.. అని ఎన్టీఆర్ ను చూసి అప్పుడే అనుకున్నా..

ఎంత ఇబ్బంది ఉన్నా నేను అప్పులు చేయను.. అప్పులు ఇవ్వను..

ఇవాళ కామెడీ చూస్తుంటే నవ్వు రావట్లేదు. కృత్రిమత్వం ఎక్కువైంది..

ఏమయ్యా నీ కాళ్లు పట్టుకునే స్థితి వచ్చింది నాకు.. అని ఆయన నా చెవిలో అన్నారు..

07-09-2015న ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో రావి కొండలరావుమూడు నాలుగు గుర్రాల మీద స్వారీ చేయొద్దంటారు పెద్దలు. కానీ రావి కొండలరావు మాత్రం పాత్రికేయం, రచన, నటన వంటి రకరకాల గుర్రాల మీద స్వారీ చేసి నెగ్గుకొచ్చారు. అతికొద్దిమందికి సాధ్యమయ్యే పనిని సునాయాసంగా చేసి పేరు ప్రఖ్యాతలు సాధించుకున్న ఘనత ఆయనది. ఏ పాత్రనైనా ఒకే విధంగా పోషించే నటులు కొందరు ఉన్నారు. అయితే పాత్రల స్వభావాన్ని బట్టి డైలాగ్‌ మాడ్యులేషన్‌ మార్చుకొవడం రావి కొండలరావు ప్రత్యేకత అని చెప్పాలి. ఆయన నటించిన పాత్రలు చిన్నవే అయినా ఎంతో సహజంగా వుండి ప్రేక్షకుల మనసును ఆకట్టుకునేవి. సంభాషణలకు మేనరిజం జోడించి చెప్పడం ఆయన ప్రత్యేక శైలి. నాటక రంగ, సినీ జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించిన ఆయన.. మంగళవారం(28-07-2020) తుదిశ్వాస విడిచారు. 


గతంలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ నిర్వహించే ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో రావి కొండలరావు పాల్గొన్నారు. 07-09-2015న ఏబీఎన్ లో ప్రసారమయిన ఆ కార్యక్రమ వివరాలు...ఆర్కే : ఆరు దశాబ్దాల నుంచి నాటక, సినీరంగాల్లో ఉన్నారు. ఈ ప్రస్థానం ఎలా అనిపిస్తోంది?

రావి కొండలరావు : నా ప్రస్థానం బావుంది. శ్రీకాకుళంలో చదువుకున్నాను. ఆ తర్వాత మద్రాసు వెళ్లాను. శ్రీకాకుళంలో ‘మహోదయం’ అనే పత్రిక కార్యాలయం వెళ్లి అక్షరదోషాలు సరిచేయడం, సినిమా సమీక్షలు చేయడం.. వంటి పనులు చేసేవాడిని. ఆ తర్వాత ‘బంగారుపాప’ అనే పిల్లల పక్షపత్రికను నడిపాను. అప్పట్లో ఆ పత్రిక ధర మూడు అణాలు. పత్రికకు పెట్టుబడి లేదు. కొంతమందితో సంవత్సర చందాలు పోగు చేసుకున్నా. అదే నా పెట్టుబడి. ఆ టైంలో ‘ఆనందవాణి’ అనే పత్రిక ఉండేది. అందులో శ్రీశ్రీ, ఆరుద్ర గారు పనిచేసేవారు. నా రచనలు కొన్ని ఆ పత్రికలో ప్రచురితమయ్యాయి. అందులోనే మద్రాసులో సబ్‌ఎడిటర్‌గా చేరాను.


ఆర్కే : మద్రాసు వెళ్లాక ఏం చేశారు?

రావి కొండలరావు : ‘ఆనందవాణి’ పక్కనే ‘ఆంధ్రపత్రిక’ ఆఫీసు ఉండేది. నాకు ముళ్లపూడి వెంకటరమణ గారు బాగా తెలుసు. ఆయనతో పరిచయానికి ఓ ఫ్లాష్‌బ్యాక్‌ ఉంది. 1948లో థర్డ్‌ఫారమ్‌ చదివే రోజుల్లో నేను ఆర్‌ఎస్ఎస్‌ సభ్యుడిగా ఉండేవాడిని. గాంధీగారు పోయాక హిందూ మహాసభ, ఆర్‌ఎస్ఎస్ లను నిషేధించారు. ఆర్‌ఎస్ఎస్ పై నిషేధం తొలగించాలని మేం రాజమండ్రి వెళ్లి ఊరేగింపుగా రోడ్లమీదకు వచ్చాం. దాంతో పోలీసులు అరెస్టు చేశారు. రాజమండ్రి జైల్లో మూడు నెలలు ఉన్నాను. చదువు మధ్యలోనే ఆగిపోయింది. ఎలాగూ చదువు లేదు కాబట్టి సినిమాల్లో ఏదోటి చేద్దామని ఇంట్లో వాళ్లకు చెప్పాపెట్టకుండా పదహారేళ్ల వయసులో మద్రాసుకు వెళ్లిపోయాను. చదివే సమయంలో ‘బాల’ అనే పత్రికకు రచనలు రాయటం వల్ల మద్రాసులోని ఆ ఆఫీసుకు వెళ్లి ఆ పత్రిక ఎడిటర్‌ గారిని కలిశాను.

 

ఆ రోజే అక్కడికి ‘బాపూ’గారు వచ్చారు. ఆయన కార్టూన్‌ ఒకటి పట్టుకొచ్చారు. ఎడిటర్‌గారు దాన్ని చూసి ఏదో సవరణ చెబుతుంటే అలా తొంగిచూశా. కింద బాపూ అని కనిపించింది. ‘బాపూ గారంటే మీరేనా?’ అని అడిగాను. ఆయనను పరిచయం చేసుకున్నా. ‘పక్కనే మా ఇల్లు రండి’ అన్నారు బాపూ. నేను అక్కడికి వెళితే రమణగారు ఉన్నారు. ఆయన ‘బాల’ పత్రికకు సీరియల్‌ ఏదో రాస్తున్నారు. అలా రమణగారితో పరిచయం ఏర్పడి స్నేహం ఏర్పడింది. మధ్యలో 1953లో డబ్బింగ్‌ సినిమా రాశాను.


ఆర్కే: నాటకాల్లోకి ఎందుకు వెళ్లాలనిపించింది?

రావి కొండలరావు : మా అన్నయ్య ఆర్కేరావు నటుడు. ఇంకో అన్న రావి వెంకటాచలం నాటక రచయిత, నటుడు. ప్రస్తుతం విశాఖపట్టణంలో ఉన్నారు. ఆయనకు ఇప్పుడు వందేళ్లు. మా నాన్న అప్పట్లో పోస్టుమాస్టరు. నాటకాలకు నాన్న వ్యతిరేకి. నేనొకసారి ఆడవేషం వేసినప్పుడు స్టేజ్‌ ఎక్కి విగ్‌ లాగేసి నాలుగు దెబ్బలు కొట్టారు నాన్న. తర్వాత ‘కన్యాశుల్కం’లో వెంకటేశం వేషం వేశాను.


ఆర్కే : మీ అన్నయ్యలు ప్రేరణ అన్నమాట?

రావి కొండలరావు : వాళ్ల ద్వారానే నటన అబ్బింది. అప్పట్లో స్కూల్లో వేసిన నాటకాల్లో ఫస్ట్‌ప్రైజ్‌ ఎవరంటే రావికొండలరావే. దీంతో నన్ను మించినవారు ఎవరున్నారు అనుకునేవాడిని. దాదాపు ఆరునెలలు మద్రాసులో ఉన్నాను. షూటింగ్‌లు చూస్తుండేవాడ్ని. ఓసారి ‘మనదేశం’ షూటింగ్‌కు వెళ్లాను. హీరో ఇన్‌స్పెక్టర్‌ వేషంలో కనిపిస్తున్నాడు. ఓ మూలన నిలబడి చూస్తూ పక్కవాడిని ‘ఎవరండీ హీరో?’ అన్నాను. ‘ఎవరో కొత్తగా వచ్చాడు. ఎన్టీయారట’ అన్నారు. ఆయన పేరు ఏదో బావుందే.. పైకొస్తాడు అనుకున్నాను (నవ్వులు).

గెటవుట్‌ ఫ్రమ్‌ మై ఆఫీస్‌ అని ఆయన గట్టిగా అనడంతో అదిరిపోయాను..

ఆర్కే : ఆ తర్వాత ఏం చేశారు?

రావి కొండలరావు : ఆ తర్వాత తిరిగి శ్రీకాకుళం వెళ్లిపోయాను. బాపూ, రమణగార్లకు ఉత్తరాలు రాసేవాడిని. వంద రూపాయల జీతంతో స్టోరీ డిపార్ట్‌మెంట్‌లో చేశాను. పనిలేక విసుగు వచ్చేది. దర్శకుడు కమలాకర కామేశ్వరరావును ‘దర్శకత్వ శాఖలో పనిచేయొచ్చా?’అని అడిగితే ‘ఓ యస్‌’ అన్నారు. సహాయ దర్శకుడిగా చేరాను.


ఆర్కే : మీరెప్పుడైనా పస్తులున్నారా?

రావి కొండలరావు : చాలాసార్లు పస్తులు ఉన్నాను. ఎందుకంటే నేను అప్పులు చేయను. ఇంకొకరికి అప్పు ఇవ్వను. ఎంత ఇబ్బంది ఉన్నా అప్పులు చేయను. రమణగారిని అడిగినా ఆయన డబ్బులు ఇస్తారు. అడిగేవాడిని కాదు. అలాగే పస్తులుండేవాడ్ని. సరిగ్గా భోజనం సమయంలో బాపూగారింటికి వెళ్లేవాడ్ని. ‘రండి భోంచేద్దాం’ అనేవారు. ‘ఎందుకండీ బయట తింటాను’ అనేవాడిని. ‘అయ్యో భలేవారు, భోంచేయాలి మీరు’ అనేవారు. ఒక్కోసారి రాత్రి ఏమీ లేకుంటే మజ్జిగ తాగి పడుకున్న సందర్భాలున్నాయి.


ఆర్కే : విసుగనిపించి ఇంటికి వెళ్లిపోలేదా?

రావి కొండలరావు : పట్టుపడితే వదిలేది లేదు. ఎన్టీయార్‌, అంజలి నటించిన ‘శోభ’ చిత్రంలో ఆపద్ధర్మంగా చిన్న వేషం వేశాను. అదే సినిమాల్లో నా తొలివేషం. రంగస్థల అనుభవంతో ఆ క్యారెక్టర్‌ బాగా చేశాను. ‘బావుందే’ అన్నారు ఎన్టీయార్‌. నాటకాలు, సినిమాల్లో తిరుగుతుండేవాణ్ణి. బి.ఎన్‌.రెడ్డిగారి ‘పూజాఫలం’ కోసం పనిచేశాను. 150 రూపాయలు పారితోషికం ఇచ్చారు. అప్పటికి నాకు పెళ్లయ్యింది కాబట్టి ఆ జీతం సరిపోలేదు.


ఆర్కే : రాధాకుమారి గారు మీకెలా పరిచయం అయ్యారు? మీది లవ్‌ మ్యారేజా?

రావి కొండలరావు : ఆమె విజయనగరంలో నాటకాల్లో నటించేది. మేం శ్రీకాకుళం నుంచి ట్రూప్‌ తీసుకొని విజయనగరానికి నాటక పోటీలకు వెళ్లేవాళ్లం. తను పదమూడేళ్ల వయసులో జె.వి.సోమయాజులు, రమణమూర్తిలతో కలిసి చేసింది. మా అన్నయ్య ద్వారా ఆమె పరిచయం అయ్యింది. ఒకరోజున - రాధాకుమారి వాళ్ల నాన్న నాతో ‘మా అమ్మాయిని సినిమాల్లోకి ప్రవేశపెట్టాలండీ.. వేషాలుంటే చూడండి’ అన్నారు. ఓ డబ్బింగ్‌ సినిమాలో డబ్బింగ్‌ చెప్పించడానికి రాధాకుమారికి కబురు పంపాను. మా ఇంట్లోనే దిగింది. అద్దె 70 రూపాయలు. అప్పట్లో డబ్బింగ్‌ సినిమాలు ఎక్కువగా ఉండేవి. రాధాకుమారికి డబ్బింగ్‌ అవకాశాలు ఇప్పించటానికి వెంటబెట్టుకుని తిరిగేవాడ్ని. మా ఇద్దరి మధ్యా అలా సాన్నిహిత్యం ఏర్పడింది. ఆ సమయంలో హాయిగా ‘నాటకాలు వేసుకోవడానికి ఓ నటి ఉంటే బావుంటుంది.. ఈవిడని పెళ్లి చేసుకుంటే ఆ కొరత తీరుస్తుంది’ అనిపించింది.


ఆర్కే: డబ్బులు ఇవ్వకుండా నాటకాలు వేస్తుందని ఆమెను పెళ్లాడారా?

రావి కొండలరావు : ఆమెకు నాటకాలంటే ప్రాణం. ఇద్దరిదీ ఒకే అభిరుచి. మా అమ్మకు చెబితే ‘ఇద్దరు నాటకాలు వేస్తే వంట ఎవరు చేస్తారు?’ అంది. ‘మా తిప్పలు మేం పడతాం’ అన్నాను. ‘సరే మీ ఇష్టం’ అని మా అమ్మ అంటూనే తిరుపతికి వెళ్లి పెళ్లి చేసుకున్నాం.

గెటవుట్‌ ఫ్రమ్‌ మై ఆఫీస్‌ అని ఆయన గట్టిగా అనడంతో అదిరిపోయాను..

ఆర్కే : ఇప్పుడొస్తున్న సినిమాల్లో కామెడీ ఎలా ఉంది?

రావి కొండలరావు : ఇవాళ కామెడీ చూస్తుంటే నవ్వు రావట్లేదు. కృత్రిమత్వం ఎక్కువైంది. అప్పట్లో రేలంగి, రాజబాబు, పద్మనాభం, రమణారెడ్డి, సూర్యకాంతం, అల్లు రామలింగయ్య వంటి వాళ్లు షూటింగ్‌లో నటిస్తున్నప్పుడే తెగ నవ్వొచ్చేది.


ఆర్కే : మీరు రచయిత, నటుడు, పాత్రికేయుడు.. వీటిలో మీకు ఏ పాత్ర అంటే సంతృప్తి?

రావి కొండలరావు : నాకు నాటకమంటే ఇష్టం. ఇప్పటికీ నాటకాలు ఆడుతున్నాను, రాస్తున్నాను. పాత నాటకాల్లో నటిస్తున్నాను కూడా. ఈ మధ్యే గుంటూరులో ఓ నాటకం వేశాను. 


అక్కినేనిని తిట్టే సన్నివేశం..?

ఒక చిత్రంలో - సెట్స్‌లోకి వెళ్లాక తొలి సీన్‌లో అక్కినేని గారిని ‘గాడిదా..’ అని తిట్టాలి. నాకు భయమేసింది. అంతకుముందు కొన్ని అనుభవాల వల్ల భయపడ్డాను. ఓ సినిమాలో గుమ్మడి గారు ఎస్వీఆర్‌ను తన్నే సీన్‌లో నటించాలి. అప్పుడు ఎస్వీఆర్‌ ‘‘గుమ్మడి ఏంటీ? నన్ను తన్నడమేంటి?’’ అన్నారట. అందుకని తటపటాయిస్తుంటే నాగేశ్వరరావుగారు వచ్చి ‘ఏవిటీ’ అని అడిగారు. ‘‘ఈ సీన్‌లో మిమ్మల్ని గాడిదా అని పిలవాలండీ’’ అన్నారు అసిస్టెంట్‌ డైరెక్టర్‌. ‘‘కొడుకును తండ్రి తిడితే తప్పేముందీ’’ అన్నారు ఏఎన్నార్‌. దాంతో విజృంభించాను...అరిచాడు పుల్లయ్య

‘ప్రేమించి చూడు’ చిత్రంలో తండ్రి వేషం ఉందనీ, పి.పుల్లయ్య గారిని కలవమని రమణగారు నన్ను పంపించారు. అక్కినేని నాగేశ్వరరావు గారికి తండ్రి వేషం అది. అప్పుడు నా వయసు 30 ఏళ్లు. అక్కినేని నాకంటే పదేళ్లు పెద్దవారు. పి.పుల్లయ్య వద్దకు వెళ్లి ‘‘సార్‌, రమణగారు పంపించారు’’ అన్నాను. వెంటనే ఆయన ‘‘గెటవుట్‌ ఫ్రమ్‌ మై ఆఫీస్‌’’ అన్నారు గట్టిగా. అదిరిపోయాను. పుల్లయ్యగారంటే పులి. ఆయన మహా కోపిష్టి. ‘‘ఎవడయ్యా నీకు చెప్పింది. రమణకు బుద్ధి లేదా, నీకు, నాకు బుద్ధిలేదా?’’ అన్నారు. ‘‘అసలు ఎలా నిన్ను నాగేశ్వరరావుకు తండ్రి వేషం ఇస్తాను. ఊహించడానికే కష్టం..’’ అని కేకలేశారు. వెంటనే రమణ దగ్గరికెళ్లి విషయం చెప్పాను. అప్పుడాయన ‘‘మీ తెలుగు మాస్టర్‌ను అనుకరిస్తూ మిమిక్రీ చేస్తావు కదా. అది ఆయన ముందు చేసుంటే బావుండు’’ అన్నారాయన. మరోసారి పుల్లయ్య వద్దకు వెళ్లి తెలుగు మాస్టర్‌లా యాక్టింగ్‌ చేసి చూపించాను. అప్పుడు కానీ ఆయన శాంతించలేదు. ‘‘చావు పద’’ అంటూ విగ్గుల షాపు వద్దకు తీసుకెళ్లారు పుల్లయ్య.


ఎస్వీఆర్‌

ఓ సినిమాలో గుమ్మడి గారు ఎస్వీఆర్‌ను తన్నాలి. ‘‘నన్ను తన్నే అంతటి వాడవు అయ్యావా నువ్వు? అసలు నేను గెడ్డం గీయించుకునే క్షురకుడి దగ్గర కూడా తలవంచను తెలుసా?’’ అన్నారట ఎస్వీఆర్‌. అలాంటి ఎస్వీఆర్‌తో ఓ చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. ఒక సీన్‌లో రంగారావు గారిని ‘‘ఒరేయ్‌ ఒరేయ్‌.. మళ్లీ సిగరెట్‌ వెలిగిస్తున్నావా?’’ అని తిట్టాలి. నాకేమో భయమేసింది. అప్పుడాయన నా దగ్గరకొచ్చి ‘‘పంతులూ.. ఫ్రీగా చెయ్యవయ్యా’’ అన్నారు. ‘‘ఫ్రీగా చేయట్లేదండీ. డబ్బులు ఇస్తున్నారండీ’’ అంటూ జోక్‌ చేశాను. అంతే ఆయన కూడా ఫక్కున నవ్వేశారు.


రాజనాల

మధుసూదనరావు దర్శకత్వంలో వచ్చిన ‘వీరాభిమన్యుడు’లో ద్రోణాచార్యుడు పాత్ర నాది. రాజనాల దుర్యోధనుడు. ఫస్ట్‌ షాట్‌లో ద్రోణాచార్యుని కాళ్లు దుర్యోధనుడు కడగాలి. ‘‘ఏమయ్యా నీ కాళ్లు పట్టుకునే స్థితి వచ్చింది నాకు’’ అంటూ రాజనాల గారు నా చెవిలో అన్నారు.

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

సినీ ప్రముఖులుLatest News in Teluguమరిన్ని...

Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.