Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Fri, 27 May 2022 00:25:58 IST

పరుల సొమ్ము

twitter-iconwatsapp-iconfb-icon

దైవ ప్రవక్త మహమ్మద్‌ శిష్యులలో అబూ దుజానా ప్రసిద్ధులు. ఆయన ప్రతిరోజూ ఫజర్‌ నమాజులో... దైవ ప్రవక్త వెనుక వరుసలో నిలబడి, ఏకాగ్రతతో నమాజు చేసేవారు. ఆ తరువాత ఎవరినీ కలవకుండా, సలాం చెప్పకుండా, తలవంచుకొని... మసీదు నుంచి వెళ్ళిపోయేవారు. అబూ దుజానా ప్రతిరోజూ ఇదే తీరులో వ్యవహరిస్తూ ఉండడం దైవ ప్రవక్తకు ఆశ్చర్యం కలిగించింది.


ఒకరోజు ఫజర్‌ నమాజు ముగిసిన వెంటనే అబూ దుజానా వెళ్ళిపోతూ ఉండగా... దైవప్రవక్త మహమ్మద్‌ ఆయనను ఆపారు. ‘‘రోజూ నమాజ్‌ తరువాత తొందరగా లేచి వెళ్తున్నావు. నమాజు తరువాత   ‘దుఆ’ చేయకుండా వెళ్తున్నావు. నీకు అల్లా్‌హతో అవసరమేదీ లేదా? నీకు బాధలు ఏవీ లేవా? నువ్వు సంతోషంగా ఉన్నట్టయితే... దాన్ని ప్రసాదించిన అల్లా్‌హకు కృతజ్ఞతలు చెప్పుకోవా?’’ అని మెల్లగా మందలిస్తున్నట్టు అడిగారు.


‘‘దైవప్రవక్తా! సృష్టికర్త అయిన అల్లాహ్‌ అవసరం లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేను’’ అని చెప్పారు దుజానా.


‘‘మరి నమాజ్‌ తరువాత.... అల్లా్‌హను అర్థించడం కోసం... రెండు చేతులూ ఎత్తి ‘దుఆ’ చెయ్యకుండా ఎందుకు వెళ్ళిపోతున్నావు?’’ అని మళ్ళీ అడిగారు దైవప్రవక్త.


‘‘మా ఇంటి పక్కనే ఒక యూదు సోదరుడి ఇల్లు ఉంది. అతని ఇంటి ఆవరణలో ఉన్న పెద్ద ఖర్జూరపు చెట్టు కొమ్మలు... ఖర్జూరపు గుత్తులతో మా ఇంటివైపు ఖాళీ స్థలంలో వంగి ఉంటాయి. రాత్రి గాలికి కొమ్మల నుంచి ఖర్జూర పండ్లు ఆ ఖాళీ స్థలంలో రాలి పడుతూ ఉంటాయి. ఇంట్లో పిల్లలు లేవకముందే.. ఆ ఖర్జూరాలను ఏరి, ఒక గంపలో వేసి... ఆ ఇంటి యజమానికి అప్పగిస్తాను. పిల్లలు రాత్రి ఖాళీ కడుపుతో నిద్రపోతారు. నిద్రలేవగానే ఆ పండ్లను చూస్తే... వాటిని తింటారనే భయంతో అలా చేస్తాను. అందుకే ‘దుఆ’ చెయ్యకుండా వెళ్ళిపోతున్నాను. ఒకసారి ఇంటికి వెళ్ళడం ఆలస్యం అయ్యేసరికి... పిల్లలు ఆకలి బాధతో పండ్లను ఏరుకొని తినబోయారు. వాళ్ళను సముదాయించి... వారి నోళ్ళలోంచి పండ్లను బయటకు తియ్యాల్సి వచ్చింది. పక్కవారి సొమ్ము దొంగతనం చేసిన అపరాఽధానికి... షహర్‌ మైదానంలో దేవుని ముందు సిగ్గుతో తలవంచాల్సి వస్తుందనే నా భయం’’ అని అన్నారు దుజానా.


మసీదులో ఒక మూల నిలబడి... ఈ మాటలు వింటున్న దైవప్రవక్త అనుయాయుడు హజ్రత్‌ అబూబకర్‌ ఎంతగానో చలించిపోయారు. దుజానా తన ఇంటికి బయలుదేరిన వెంటనే... ఆయన పక్క ఇంటి యూదుడి దగ్గరకు అబూబకర్‌ వెళ్ళారు. ఖర్జూరపు చెట్టుకు తగిన ధర చెల్లించారు. దాన్ని దుజానాకు బహుమతిగా అందించారు.  కొన్ని నెలలు గడిచిన తరువాత.. దుజానా నిజాయితీ గురించీ, ప్రవర్తన గురించీ ఆ యూదుడికి తెలిసి ఆశ్చర్యపోయాడు. దైవ ప్రవక్త మహమ్మద్‌ను ఆశ్రయించాడు. ఆయన ప్రియశిష్యులలో ఒకరుగా మారిపోయాడు.  


‘పరుల సొమ్ము పాము వంటిది’ అని మనం తరచుగా వింటూ ఉంటాం. నేడు వేరొకరి సొమ్మును దౌర్జన్యంగా, అక్రమంగా ఎలా దోచుకోవాలో కొత్త కొత్త మార్గాలను మానవుడు అన్వేషిస్తున్నాడు. ఇతరుల హక్కులకు భంగం కలిగిస్తే సమాజంలో అశాంతి, అలజడులు విచ్చలవిడిగా చెలరేగుతాయనే సత్యాన్ని ఎవరూ మరచిపోకూడదు.


మహమ్మద్‌ వహీదుద్దీన్‌

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.