ఎమ్మెల్యేను ప్రశ్నించి.. విగత జీవిగా మారి!

ABN , First Publish Date - 2021-01-19T09:04:12+05:30 IST

శుక్రవారం.. గిద్దలూరు వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు ప్రకాశం జిల్లా బేస్తవారపేట మండలం శింగరపల్లె వచ్చారు.

ఎమ్మెల్యేను ప్రశ్నించి.. విగత జీవిగా మారి!

  • ఆత్మహత్య చేసుకున్న జనసేన కార్యకర్త వెంగయ్య
  • గ్రామాభివృద్ధిపై 2 రోజుల కిందట ‘అన్నా’ను నిలదీసిన బాధితుడు
  • అధికార పార్టీ ఒత్తిళ్లే కారణమని ఆరోపణలు
  • మానసికస్థితి బాగోలేదంటున్న పోలీసులు, మృతుని భార్య


బేస్తవారపేట, జనవరి 18: శుక్రవారం.. గిద్దలూరు వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు ప్రకాశం జిల్లా బేస్తవారపేట మండలం శింగరపల్లె వచ్చారు. అభివృద్ధి పనులు ఎందుకు చేయడం లేదంటూ ఆ గ్రామ జనసేన కార్యకర్తలు ఎమ్మెల్యేను ప్రశ్నించారు. ‘ముందు మెడలో టవల్‌ తీసెయ్‌రా. మెడలో ఒక పార్టీ కండువా వేసుకొని, నలుగురు తాగుబోతులను వెంటేసుకువచ్చి ప్రశ్నిస్తే మేం సమాధానం చెప్పాలా?’ అంటూ ఆగ్రహంతో ఊగిపోతూ బూతులు తిట్టారు. ఎమ్మెల్యేను నిలదీసిన వారిలో జనసేన సీనియర్‌ కార్యకర్త దుమ్మని చంద్రశేఖర్‌, బండ్ల వెంగయ్యనాయుడు తదితరులు ఉన్నారు. 


ఆదివారం.. శింగరపల్లె ఘటన గురించి తెలుసుకొని తమ కార్యకర్తలను పరామర్శించేందుకు జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జి బెల్లంకొండ సాయిబాబా కార్యకర్తలతో కలిసి గ్రామానికి వెళ్లారు. ఆయన వాహనాన్ని వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. మూడు గంటలపాటు వైసీపీ, జనసేన నాయకుల మధ్య వాగ్వావాదం జరిగింది. గ్రామంలోకి వెళ్లేందుకు జనసేన నాయకులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.


సోమవారం..  ఉదయమే పొలానికి వెళ్లిన వెంగయ్య, ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ తన సోదరుడైన వెంకటేశ్వర్లుకు ఫోన్‌చేసి చెప్పాడు. వెంకటేశ్వర్లు బంధువులతో కలిసి పొలానికి చేరుకునే సరికి వెంగయ్య పురుగుమందు తాగి చనిపోయి ఉన్నాడు. 


..ఆదివారం ఘటన తర్వాత వైసీపీ కార్యకర్తలు చంద్రశేఖర్‌, వెంగయ్యనాయుడుపై ఒత్తిడి పెంచారని స్థానికులు చెబుతున్నారు. ‘మా ఎమ్మెల్యేనే నిలదీస్తారా?’ అంటూ వారి కుటుంబ సభ్యులను ప్రశ్నించినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో వెంగయ్య ఆత్మహత్య చేసుకున్నాడని చెబుతున్నారు. ఈ ఘటనపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తీవ్రంగా స్పందించారు.  ‘‘గ్రామంలోని పారిశుఽధ్య సమస్యపై, రహదారి, ఇతర సౌకర్యాల కల్పనపై ఎమ్మెల్యేను ప్రశ్నించినందుకు బండ్ల వెంగయ్య నాయుడు ప్రాణాలు తీసుకొనే పరిస్థితి రావడం అత్యంత దురదృష్టకరం. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి’’ అని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ‘‘ప్రశ్నించిన యువకుణ్ణి ప్రజల మధ్యనే ఎమ్మెల్యే అన్నా రాంబాబు బెదిరించారు. ఆ తరువాత కూడా తన పార్టీ వ్యక్తుల ద్వారా ఎమ్మెల్యే బెదిరింపులు కొనసాగించారు. వివిధ రూపాల్లో ఒత్తిళ్లకు గురి చేశారు. వెంగయ్యను ఆత్మహత్యకు ప్రేరేపించిన ఎమ్మెల్యే అన్నా రాంబాబు, ఆయన అనుచరులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలి’ అని డిమాండ్‌ చేశారు. వెంగయ్యనాయుడు మృతదేహానికి మంగళవారం కంభం ప్రభుత్వ వైద్యశాలలో పోస్టుమార్టం నిర్వహించనున్నారు.


జనసేన శ్రేణులు కంభం వెళ్లేందుకు సన్నద్ధమయ్యాయి. వారిని అడ్డుకునేందుకు పోలీసు యంత్రాంగం సన్నద్ధమైంది. దీంతో సింగరపల్లి, కంభంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాగా, మద్యానికి బానిసైన వెంగయ్య మతితప్పి మాట్లాడుతున్నాడని, ఈ పరిస్థితుల్లోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడని కుటుంబ సభ్యులు చెప్పారు. అతిగా మద్యం సేవించి మతి స్థితిమితం కోల్పోయి ఆత్మహత్యకు పాల్పడినట్టు ప్రాథమికంగా అంచనా వేస్తున్నామని ఎస్‌ఐ బాలకృష్ణ తెలిపారు. ఆమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

Updated Date - 2021-01-19T09:04:12+05:30 IST