PV Sindhu: వేధిస్తున్న గాయం.. బ్యాడ్మింటన్ ప్రపంచ చాంపియన్‌షిప్స్ నుంచి పీవీ సింధు అవుట్!
ABN , First Publish Date - 2022-08-14T02:50:22+05:30 IST
భారత స్టార్ షట్లర్, రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు (PV Sindhu) ఈ ఏడాది బ్యాడ్మింటన్ ప్రపంచ చాంపియన్‌షిప్స్
హైదరాబాద్: భారత స్టార్ షట్లర్, రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు (PV Sindhu) ఈ ఏడాది బ్యాడ్మింటన్ ప్రపంచ చాంపియన్‌షిప్స్ నుంచి తప్పుకుంది. ఇటీవల జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో మోకాలి గాయంతోనే ఆడి పసిడి పతకం సాధించిన సింధు.. విజయానంతరం తన గాయం గురించి వెల్లడించింది. గాయం ఇంకా వేధిస్తుండడంతో ఈసారి బ్యాడ్మింటన్ ప్రపంచ చాంపియన్‌షిప్స్ నుంచి తప్పుకున్నట్టు సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.
కామన్వెల్త్ గేమ్స్ క్వార్టర్ ఫైనల్స్‌లో నొప్పిని అనుభవించానని, గాయం కారణంగా భయపడ్డానని పేర్కొన్న సింధు.. తన కోచ్, ఫిజియో, ట్రైనర్ సాయంతో ముందుకే సాగాలని నిర్ణయించుకున్నట్టు ట్వీట్ చేసింది. అయితే, గాయం ఇంకా వేధిస్తుండడంతో దురదృష్టవశాత్తు ప్రపంచ చాంపియన్‌షిప్స్ నుంచి వైదొలగినట్టు వివరించింది. ప్రపంచ చాంపియన్‌షిప్స్ ఈ నెల 21 నుంచి 28 వరకు జరగనుంది. ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో సింధుకు మంచి రికార్డు ఉంది. 2019లో స్వర్ణం సాధించింది. అలాగే, ఆమె ఖాతాలో రెండు రజత పతకాలు, రెండు కాంస్య పతకాలు కూడా ఉన్నాయి.