రజతంతో సరి..

ABN , First Publish Date - 2021-12-06T07:28:54+05:30 IST

వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌లో రెండోసారి చాంపియన్‌గా నిలిచి సీజన్‌ను గ్రాండ్‌గా ముగించాలనుకున్న స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు ఆశలు అడియాసలయ్యాయి. టోర్నమెంట్‌ ఆరంభం నుంచి ఆధిపత్యం చాటుకున్న ప్రపంచ చాంపియన్‌ సింధు ఆఖరి మెట్టుపై బోల్తా...

రజతంతో సరి..

  • ఫైనల్లో సింధు ఓటమి 
  • వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌ చాంప్‌ సియోంగ్‌

బాలి: వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌లో రెండోసారి చాంపియన్‌గా నిలిచి సీజన్‌ను గ్రాండ్‌గా ముగించాలనుకున్న స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు ఆశలు అడియాసలయ్యాయి. టోర్నమెంట్‌ ఆరంభం నుంచి ఆధిపత్యం చాటుకున్న ప్రపంచ చాంపియన్‌ సింధు ఆఖరి మెట్టుపై బోల్తా పడింది. టైటిల్‌పోరులో కొరియా టీనేజ్‌ సంచలనం అన్‌ సియోంగ్‌ చేతిలో కంగుతిని రజతంతో సరిపెట్టుకుంది. ప్రపంచ ఆరో ర్యాంకరైన సియోంగ్‌ 21-16, 21-12తో సింధును ఓడించి విజేతగా నిలిచింది. 40 నిమిషాల పాటు సాగిన ఈ ఏకపక్ష పోరులో సింధుకు సియోంగ్‌ ఏ దశలోనూ అవకాశమివ్వకుండా విజృంభించింది. తొలిగేమ్‌లో ఓ మోస్తరు ప్రతిఘటన చూపిన సింధు.. రెండోగేమ్‌లో ప్రత్యర్థి షాట్లకు ఏమాత్రం బదులివ్వలేకపోయింది. 19 ఏళ్ల సియోంగ్‌ చేతిలో ఓడడం సింధుకు ఇది వరుసగా మూడోసారి కావడం గమనార్హం. గత రెండు వారాల్లో ఇండోనేసియా మాస్టర్స్‌, ఇండోనేసియా ఓపెన్‌ టోర్నీల్లో విజేతగా నిలిచిన సియోంగ్‌కిది వరుసగా మూడో మెగా టైటిల్‌. అంతేకాదు.. సీజన్‌ ముగింపు టోర్నీ అయిన వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌ గెలిచిన తొలి దక్షిణ కొరియా మహిళా షట్లర్‌గా సియోంగ్‌ రికార్డు సృష్టించింది. మూడోసారి ఈ మెగా ఈవెంట్‌ ఫైనల్లో పోటీపడ్డ 26 ఏళ్ల సింధు.. 2018లో చాంపియన్‌గా నిలిచింది. ఇక, సింధు తదుపరి ఈవెంట్‌గా ఈనెల 12 నుంచి స్పెయిన్‌లో జరిగే ప్రపంచ చాంపియన్‌షి్‌పలో తలపడనుంది. 


Updated Date - 2021-12-06T07:28:54+05:30 IST