పీవీని కాంగ్రెస్‌ నుంచి వేరు చేయలేం!

ABN , First Publish Date - 2020-07-16T06:02:36+05:30 IST

తెలుగుబిడ్డ, మాజీ దేశ ప్రధాని, ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడైన పీవీ నరసింహారావు శతజయంతి వేడుకల సందర్భంగా జాతి యావత్తూ ఆయన దేశానికి చేసిన విలువైన సేవలను స్మరించుకుంటున్నది....

పీవీని కాంగ్రెస్‌ నుంచి వేరు చేయలేం!

పీవీ పట్ల సోనియాగాంధీ గౌరవాభిమానాలు చూపిన సందర్భాలు కోకొల్లలు. లఖూభాయ్‌ పాఠక్‌ కేసులో పీవీ పేరును చార్జిషీటులో చేర్చినపుడు మోతీలాల్‌ నెహ్రు మార్గ్‌లోని పీవీ నివాసానికి వెళ్లి ఆయనకు సంపూర్ణ మద్దతు పలికిన తొలి వ్యక్తి సోనియాగాంధీయే. 2011లో బెంగుళూరులో ఏఐసిసి ప్లీనరీ జరిగినపుడు పీవీని వేదికపైకి ఆహ్వానించి తన ప్రక్కనే కూర్చొబెట్టుకున్న సంస్కారం సోనియా సొంతం. ఆ కార్యక్రమం ముగిశాక సభాస్థలి నుండి వెళ్లేటపుడు పీవీ కారుకంటే తన కారు ముందుగావస్తే దానిని వెనక్కిపంపి, పీవీని ముందుగా పంపించిన తర్వాతనే ఆమె వెళ్లారు. పీవీ గౌరవాన్ని ఏ సందర్భంలో కూడా కాంగ్రెస్‌ పార్టీ తక్కువ చేయలేదు. ఆయన పార్థివ దేహాన్ని ఏఐసిసి కార్యాలయంలోకి అనుమతించలేదన్న వాదన కూడా సరికాదు.


తెలుగుబిడ్డ, మాజీ దేశ ప్రధాని, ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడైన పీవీ నరసింహారావు శతజయంతి వేడుకల సందర్భంగా జాతి యావత్తూ ఆయన దేశానికి చేసిన విలువైన సేవలను స్మరించుకుంటున్నది. పీవీ దేశ ప్రధానిగా ఆర్థికరంగంలో, విదేశాంగ విధానంలో, ఇంకా పలు రంగాలలో సాధించిన అసమాన్య విజయాలను గురించి ఆయనతో ప్రత్యక్షంగా, పరోక్షంగా పనిచేసిన ఎంతోమంది పెద్దలు తమ అనుభవాలతో వివరిస్తున్నారు. భారతదేశం క్లిష్టమైన ఆర్థిక పరిస్థితులను ఎదుర్కొన్న సమయంలో దార్శనికతతో ఆయన తీసుకొన్న కొన్ని కఠోర నిర్ణయాల కారణంగా దేశం ఓ ప్రబల ఆర్థిక శక్తిగా ఎదిగింది. అందులో ఎవరికీ రెండో అభిప్రాయం లేదు. అయితే, దేశ ప్రధానిగా పీవీ నరసింహారావుకు దక్కిన కీర్తిప్రతిష్టలను మంట గలపడానికి ఆయన అధికారం నుండి దిగిపోయాక ఆయనపై అనేక తప్పుడు కేసులుపెట్టి వేధించినవారు నేడు చరిత్రను వక్రీకరిస్తున్నారు. పీవీ నరసింహారావుకు, శ్రీమతి సోనియా గాంధీకి మధ్య శత్రుత్వం ఉన్నట్లు ప్రచారం చేస్తున్నారు. పీవీ స్మృతిని కాంగ్రెస్‌ పార్టీ విస్మరించినట్లు కొందరు తెలియక మాట్లాడుతున్నారు, సత్యదూరమైన కథనాలను పత్రికలలో రాస్తున్నారు. పీవీ నరసింహారావు నిఖార్సైన కాంగ్రెస్‌ వాది. పీవీ ఆత్మ, శరీరం రెండూ కాంగ్రెస్‌ పార్టీయే.


పీవీ నరసింహారావును ‘యాక్సిడెంటల్‌ ప్రైమ్‍మినిస్టర్‌’ అని కొందరు అభివర్ణిస్తుంటారు. ఇందులో పూర్తి వాస్తవం లేదు. 1991లో ఎన్నికలు జరగడానికి ముందే ప్రత్యక్ష రాజకీయాల నుండి విరమించుకోవాలని పీవీ మానసికంగా సంసిద్ధులయ్యారు. కుటుంబ జీవితానికి కూడా దూరంగా ఉండి తన శేషజీవితాన్ని దేవుడి సన్నిధిలో గడిపేందుకు ‘కుర్తాళం’ పీఠాధిపతి కావాలనుకొన్నారు. రాజకీయ అస్త్ర సన్యాసం చేయాలన్నకున్న పీవీ నరసింహారావును ఏరికోరి ఒప్పించి అఖిల భారత కాంగ్రెస్‌ పార్టీకి అధ్యక్షునిగా చేయడానికి ప్రధాన కారకురాలు సోనియాగాంధీ. రాజీవ్‌గాంధీ హత్య జరిగిన 24 గంటల్లోనే సోనియాగాంధీని ఏఐసిసి అధ్యక్షురాలుగా చేయాలని కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (సిడబ్ల్యుసీ) తీర్మానించింది. అయితే, సోనియా గాంధీ ఆ నిర్ణయాన్ని సున్నితంగా తిరస్కరించారు. ఆ పదవికి సీనియర్‌నేత అయిన పీవీ నరసింహారావు అన్నివిధాలా అర్హుడని చెప్పి, ఆయనను ఒప్పించే బాధ్యతను పార్టీ సీనియర్‌ నేతలకే అప్పజెప్పారు. ఆ నేపథ్యాన్ని ఓసారి గుర్తు చేసుకోవాలి.


1991, మే 21 రాత్రి తమిళనాడులోని శ్రీపెరంబదూర్‌ ఎన్నికల సభలో పాల్గొన్న ఏఐసిసి అధ్యక్షులు రాజీవ్‌గాంధీ మానవబాంబు ఘాతుకానికి బలైపోయిన సంఘటన దేశ ప్రజలను, కాంగ్రెస్‌ శ్రేణులను ద్రిగ్భాంతికి గురిచేసింది. ఆ మరుసటి రోజునే, మే 22న ఢిల్లీలో కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (సిడబ్ల్యుసీ) అత్యవసరంగా సమావేశం అయింది. రాజీవ్‌గాంధీ హత్యను ఖండిస్తూ ఒక తీర్మానాన్ని, ఏఐసిసి అధ్యక్ష బాధ్యతలను శ్రీమతి సోనియాగాంధీకి అప్పగించాలని మరో తీర్మానాన్ని ఏకగ్రీవంగా చేపట్టింది. దీనికి అధ్యక్షత వహించింది మరెవరోకాదు పీవీ నరసింహారావే. ఢిల్లీలో రాజీవ్‌గాంధీ పార్థివ దేహానికి అంతిమ సంస్కారాలు పూర్తయిన వెంటనే పీవీతోసహా సిడబ్ల్యుసీ సభ్యులు సోనియాగాంధీని కలిసి పార్టీ తీర్మానాన్ని నివేదించారు. చాలామంది సోనియాగాంధీ పార్టీ పగ్గాలు చేపడతారని భావించారు. కానీ, ఆ అంచనాలను వొమ్ము చేస్తూ ఆమె ఆ నిర్ణయాన్ని సున్నితంగా తోసిపుచ్చారు. అప్పటికి లోక్‌సభకు మొదటి విడత ఎన్నికలు పూర్తయ్యాయి. రెండవ దశ ఎన్నికల ప్రచారానికి మరికొన్ని రోజులు మాత్రమే వ్యవధి ఉంది. ఈలోగా పార్టీకి నూతన అధ్యక్షుణ్ణి ఎన్నుకోవాలి. ఆయన సారథ్యంలో ప్రచారం మొదలు కావాలి. అటువంటి సమయంలో కొందరు సీనియర్‌ నేతలు కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి అంతర్గతంగా పోటీ పడ్డారు. ఆ పోటీలో లేనిది పీవీ ఒక్కరే. అయితే, సోనియాగాంధీ ఆంతర్యం ఏమిటో ‘సిడబ్ల్యుసీ’ గ్రహించగలిగింది. ఆ సమయంలో పార్టీ సీనియర్లు అందరూ ఏకాభిప్రాయానికి వచ్చి పీవీను కాంగ్రెస్‌ అధ్యక్ష బాధ్యతలను స్వీకరించమని ఒత్తిడి చేశారు. దశాబ్దాల పాటు శ్రీమతి ఇందిరాగాంధీకి, రాజీవ్‌గాంధీకి అత్యంత సన్నిహితుడుగా ఉన్న పీవీ నరసింహారావు పార్టీ బాధ్యతలు స్వీకరించడానికి అంగీకరించారు. దాంతో, మే 29న హెచ్‌కెఎల్‌ భగత్‌ అధ్యక్షత సమావేశమైన ‘సిడబ్ల్యుసీ’ అఖిల భారత కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షునిగా పీవీ నరసింహారావును ఏకగ్రీవంగా ఎన్నుకొంటూ తీర్మానించింది.


1991 జూన్‌ 20న కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ (సిపిపి) నేతగా ఎంపికై, జూన్‌ 21న ప్రధానమంత్రిగా పదవీ స్వీకారం చేసిన పీవీ నరసింహారావు ఐదేళ్ల కాలంలో పూర్తి స్వతంత్రతో పాలన అందించారు. ఆనాటి మంత్రివర్గ కూర్పులలో, ప్రభుత్వ పాలనలో, పార్టీ నిర్ణయాలలో ఎన్నడూ సోనియాగాంధీ జోక్యం చేసుకోలేదు. పీవీ ప్రధానిగా ఉన్న ఐదేళ్లూ సోనియాగాంధీ రాజకీయాలకు దూరంగా ఉండిపోయారు. చాలా అరుదుగా మాత్రమే బహిరంగ కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఆగస్ట్‌ 20, 1994న మాజీ ప్రధాని, దివంగత నేత రాజీవ్‌ గాంధీ 50వ జన్మదిన వేడుకను పురస్కరించుకొని ఏఐసీసీ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా కార్యక్రమాన్ని ప్రధాని పీవీ నరసింహారావు ఢిల్లీ తల్కటోర మైదానంలో ఘనంగా నిర్వహించారు. సోనియాగాంధీ ప్రత్యేక అతిథిగా పాల్గొన్న ఆ కార్యక్రమంలో పీవీ ప్రసంగిస్తూ ‘‘దేశంలో అమలు జరుగుతున్న ఆర్థిక సంస్కరణలు, ఐటీ విప్లవం.. మొదలైన దేశ గతిని మార్చే కార్యక్రమాలకు స్ఫూర్తి, మార్గదర్శి రాజీవ్‌గాంధీయే’’ అని స్పష్టం చేశారు.


కేంద్రంలో పీవీ ప్రధానిగా ఉండగా, ఆంధ్రప్రదేశ్‌లో 1989-–94 మధ్య కాంగ్రెస్‌ పార్టీయే అధికారంలో ఉంది. ఆ సమయంలో ముఖ్యమంత్రులుగా పనిచేసిన నేదురుమల్లి జనార్ధనరెడ్డి, కోట్ల విజయ భాస్కర రెడ్డి ఇద్దరూ పీవీ కుటుంబ సభ్యులకు సముచితమైన గౌరవం ఇచ్చారు. నేదురుమల్లి తన క్యాబినెట్‌లో పీవీ పెద్ద కుమారుడు పీవీ రంగారావుకు చోటు కల్పించారు. అప్పటికే సికిందరాబాద్ లోక్‌సభకు పీవీ రెండో కుమారుడు పీవీ రాజేశ్వరరావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పీవీ మేనల్లుడైన సింగాపురం రాజేశ్వరరావు రాజ్యసభకు ఎంపికయింది కూడా అప్పుడే. డా. వైఎస్‌ రాజశేఖర రెడ్డి తను ముఖ్యమంత్రిగా ఉండగా పునరుద్ధరించిన ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలిలో గవర్నర్‌ కోటా క్రింద సభ్యుడిగా పీవీ రంగారావుకు అవకాశం కల్పించారు.


రాజీవ్‌ హత్యానంతరం ఆయన ప్రాతినిధ్యం వహించిన ఆమేధీ నియోజకవర్గంలో సోనియాగాంధీ పర్యటించి ప్రజల బాగోగులు తెలుసుకొనే ఓ సందర్భంలో స్థానికులు రాజీవ్‌గాంధీ హంతకులకు సత్వరం శిక్షపడాలంటూ నినాదాలు చేసినపుడు, ‘‘నా ఆవేదన కూడా అదే’’ అని ఆమె అన్నారు. ఆ వ్యాఖ్యకు జాతీయ మీడియా ఎనలేని ప్రాధాన్యత కల్పించింది. రాజీవ్‌ హత్యకేసులో చెప్పుకోదగ్గ పురోగతి లేదుకనుక పీవీ పట్ల శ్రీమతి సోనియా ఆగ్రహంతో ఉన్నారనే కథనాలను కొన్ని పత్రికలు అల్లాయి. నిజానికి, భారతదేశంలో నేరవిచారణ, న్యాయ స్థానాలు వెలువరించే తీర్పులపై అప్పీళ్లకు వెళ్లడం, చివరగా రాష్ట్రపతిని క్షమాబిక్ష కోరడం.. ఈ ప్రక్రియలన్నీ పూర్తయ్యి శిక్ష ఖరారు కావడానికి సుదీర్ఘకాలం పడుతుంది. ఈ వాస్తవం సోనియాకు తెలియదని ఎవరూ అనుకోలేరు. నిజానికి, రాజీవ్‌ హత్య కేసులో సీనియర్‌ ఐపిఎస్‌ అధికారి కార్తికేయన్‌ నేతృత్వంలో వేసిన ‘ప్రత్యేక దర్యాప్తు బృందం’ (సిట్‌) చాలా వేగంగా నేరపరిశోధన చేసింది. కాకుంటే న్యాయ ప్రక్రియలో విపరీతమైన జాప్యం జరిగిన మాట వాస్తవం. భర్తను అత్యంత పాశవికంగా హత్య చేసిన హంతకులకు క్షమాబిక్ష పెట్టి వారిని విడుదల చేయాలని కోరిన గొప్ప మానవతావాది సోనియాగాంధీ. రాజీవ్‌ హత్య కేసు విచారణ జాప్యానికి పీవీ కారణంగా భావించి ఆయన పట్ల సోనియాగాంధీ ద్వేషం పెంచుకొన్నారనడంలో అర్థమే లేదు. అవన్నీ కాంగ్రెస్‌ పార్టీని బలహీన పర్చడానికి అల్లిన కల్పిత కథలే.


1996లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో పీవీ తిరిగి గెలిచివుండి ఉంటే సోనియా ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించేవారు కాదు. ఆ ఎన్నికలలో పార్టీ ఓటమి చెందడంతో, అందుకు నైతిక బాధ్యత వహిస్తూ పీవీ రాజీనామా చేశారు. ఆ తర్వాత పార్టీ పగ్గాలను చేపట్టాలని సోనియాగాంధీపై ఒత్తిడి వచ్చింది. అయినప్పటికీ సోనియా అంగీకరించలేదు. ఆ సమయంలో కేంద్రంలో ఏర్పడిన యునైటెడ్‌ ఫ్రంట్‌ ప్రభుత్వాలు యేడాదికొకటి చొప్పున టెంట్లు మాదిరిగా కూలిపోవడంతోను, దేశంలో మత సామరస్యానికి భంగం కలిగేలా భారతీయ జనతాపార్టీ వ్యూహాలు రచిస్తున్న నేపథ్యంలోనూ 1997 మార్చిలో సోనియాగాంధీ కాంగ్రెస్‌ పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని స్వీకరించారు. కాంగ్రెస్‌ పార్టీని, దేశాన్ని కాపాడుకోవడం, రాజీవ్‌గాంధీ జ్ఞాపకాలను పదిలపర్చుకోవడం లక్ష్యంగా తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చినట్లు ఆమె స్పష్టం చేశారు. అంటే పీవీ ఏఐసిసి అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన దాదాపు ఎనిమిదేళ్ళకు సోనియా గాంధీ కాంగ్రెస్‌ పార్టీలోకి ప్రవేశించారు.


పీవీ పట్ల సోనియాగాంధీ గౌరవాభిమానాలు చూపిన సందర్భాలు కోకొల్లలు. లఖూభాయ్‌ పాఠక్‌ కేసులో పీవీ పేరును చార్జిషీటులో చేర్చినపుడు మోతీలాల్‌ నెహ్రు మార్గ్‌లోని పీవీ నివాసానికి వెళ్లి ఆయనకు సంపూర్ణ మద్దతు పలికిన తొలి వ్యక్తి సోనియాగాంధీయే. 2011లో బెంగుళూరులో ఏఐసిసి ప్లీనరీ జరిగినపుడు పీవీని వేదికపైకి ఆహ్వానించి తన ప్రక్కనే కూర్చొబెట్టుకున్న సంస్కారం సోనియా సొంతం. ఆ కార్యక్రమం ముగిశాక సభాస్థలి నుండి వెళ్లేటపుడు పీవీ కారుకంటే తన కారు ముందుగావస్తే దానిని వెనక్కిపంపి పీవీని ముందుగా పంపించిన తర్వాతనే ఆమె వెళ్లారు. పీవీ గౌరవాన్ని ఏ సందర్భంలో కూడా కాంగ్రెస్‌ పార్టీ తక్కువ చేయలేదు. ఆయన పార్థివ దేహాన్ని ఏఐసిసి కార్యాలయంలోకి అనుమతించలేదన్న వాదన కూడా సరికాదు.


పీవీ సైతం ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ, సోనియాగాంధీల పట్ల ఎనలేని గౌరవాన్ని, స్నేహాభిమానాల్ని చూపారు. తను ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలను అందరూ ప్రస్తుతిస్తుంటే ఆయన మాత్రం ‘‘పండిట్‌ జవహర్లాల్‌ నెహ్రు వేసిన పునాదులపై రాజీవ్‌గాంధీ చూపిన మార్గంలోనే నా విధానాలు కొనసాగాయి’’ అంటూ వినమ్రంగా అనేకసార్లు ప్రకటించుకున్నారు. పీవీ రాజకీయంగా కాంగ్రెస్‌ పార్టీలోనే పుట్టారు. కాంగ్రెస్‌ వాదిగానే ఎదిగారు. కాంగ్రెస్‌ నేతగానే చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడ్డారు.

గిడుగు రుద్రరాజు

మాజీ ఎమ్మెల్సీ, ఏఐసిసి కార్యదర్శి

Updated Date - 2020-07-16T06:02:36+05:30 IST