2036 వరకు రష్యాకు పుతినే అధ్యక్షుడు!

ABN , First Publish Date - 2021-04-06T16:21:23+05:30 IST

రష్యా దేశానికి 2036 వరకు అధ్యక్షుడిగా కొనసాగేలా అధ్యక్షుడు పుతిన్ కొత్త చట్టంపై సంతకం చేశారు. పుతిన్

2036 వరకు రష్యాకు పుతినే అధ్యక్షుడు!

మాస్కో: రష్యా దేశానికి 2036 వరకు అధ్యక్షుడిగా కొనసాగేలా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కొత్త చట్టంపై సంతకం చేశారు. పుతిన్ ప్రస్తుత పదవీకాలం 2024 వరకు ఉంది. అయితే ఆ తర్వాత మరో 12 ఏళ్ల పాటు(రెండు దఫాలు 6+6) ఆయనే అధ్యక్షుడిగా కొనసాగేలా కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు. ఈ రాజ్యాంగ సవరణలకు గత నెల ‘ద స్టేట్ డ్యూమా’ ఏకగ్రీవ ఆమోదం తెలిపింది. ద స్టేట్ డ్యూమా ఆమోదం తెలిపిన గంటల వ్యవధిలోనే ఫెడరేషన్ కౌన్సిల్ ఆమోదం కూడా లభించింది. రాజ్యాంగ సవరణలకు సంబంధించి గతేడాది ఎన్నికలు జరగగా కొత్త చట్టాన్ని సమర్థిస్తూ మెజారిటీ ప్రజలు ఓటేశారు. 


ఇదిలా ఉంటే.. భవిష్యత్తులో మరో వ్యక్తి రష్యాకు అధ్యక్షుడిగా ఎన్నికైనప్పటికి సదరు వ్యక్తి కేవలం రెండు దఫాలు మాత్రమే అధ్యక్షుడిగా కొనసాగేలా చట్ట సవరణ చేశారు. అయితే పుతిన్‌ విషయంలో మాత్రం ఇది రీసెట్ అయ్యేలా సవరణలు జరగడం విశేషం. అంతేకాకుండా విదేశీ పౌరసత్వం కలిగి ఉన్న వారు రష్యా అధ్యక్ష బరిలో నిలవకుండా కొత్త చట్టం నిరోధిస్తుంది. కాగా.. ప్రస్తుతం పుతిన్ వయసు 68 ఏళ్లు. కొత్త చట్టంతో 83 ఏళ్లు వచ్చేంతవరకు అధ్యక్ష పదవిలో పుతిన్ కొనసాగనున్నారు. 

Updated Date - 2021-04-06T16:21:23+05:30 IST