పంజాబ్‌ రేసులోనే..

ABN , First Publish Date - 2020-10-21T08:43:36+05:30 IST

బెంగళూరు.. ముంబై.. ఇప్పుడు ఢిల్లీ. ఇలా వరుసగా అగ్రశ్రేణి జట్లపై ఆధిపత్యం చూపిస్తూ కింగ్స్‌ లెవన్‌ పంజాబ్‌ ప్లేఆఫ్స్‌ రేసులోకి దూసుకొస్తోంది. మంగళవారం జరిగిన కీలక మ్యాచ్‌లో ఆల్‌రౌండ్‌ షోతో సత్తా చాటుకుంది. అటు శిఖర్‌ ధవన్

పంజాబ్‌ రేసులోనే..

  • ఢిల్లీకి ఓటమి
  • ధవన్‌ శతకం వృథా


గెలిచి తీరాల్సిన మ్యాచ్‌లో పంజాబ్‌ మెరిసింది. ముంబైతో డబుల్‌ సూపర్‌ ఓవర్‌లో నెగ్గిన జోష్‌లో ఉన్న రాహుల్‌ సేన ముందుగా ఢిల్లీని భారీ స్కోరు చేయకుండా కట్టడి చేసింది.. ఆ తర్వాత మిడిలార్డర్‌ పోరాటంతో మరో ఓవర్‌ ఉండగానే మ్యాచ్‌ను ముగించి హ్యాట్రిక్‌ విజయాన్ని అందుకుంది. దీంతో 8 పాయింట్లతో పంజాబ్‌ ప్లేఆఫ్స్‌ రేసులో నిలిచింది. అటు వరుసగా రెండు సెంచరీలతో రికార్డు నెలకొల్పిన  ధవన్‌ ఒంటరి పోరాటం వృథా అయ్యింది.


దుబాయ్‌: బెంగళూరు.. ముంబై.. ఇప్పుడు ఢిల్లీ. ఇలా వరుసగా అగ్రశ్రేణి జట్లపై ఆధిపత్యం చూపిస్తూ కింగ్స్‌ లెవన్‌ పంజాబ్‌ ప్లేఆఫ్స్‌ రేసులోకి దూసుకొస్తోంది. మంగళవారం జరిగిన కీలక మ్యాచ్‌లో ఆల్‌రౌండ్‌ షోతో సత్తా చాటుకుంది. అటు శిఖర్‌ ధవన్‌ (61 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్సర్లతో 106 నాటౌట్‌) మినహా ఎవరూ రాణించకపోవ డంతో ఢిల్లీ క్యాపిటల్స్‌ మూల్యం చెల్లించుకుంది. తద్వారా 5 వికెట్లతో గెలిచిన రాహుల్‌ సేన 8 పాయింట్లతో ఐదో స్థానానికి చేరింది. అయితే డీసీ ఇప్పటికీ టాప్‌లోనే ఉంది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ 20 ఓవర్లలో 5 వికెట్లకు 164 పరుగులు చేసింది. ఇందులో ధవన్‌ మినహా మిగతా నలుగురు చేసినవి 58 పరుగులే. షమికి రెండు వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదనలో పంజాబ్‌ 19 ఓవర్లలో 5 వికెట్లకు 167 పరుగులు చేసి గెలిచింది. నికోలస్‌ పూరన్‌ (28 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 53), మ్యాక్స్‌వెల్‌ (32) రాణించారు. రబాడకు 2 వికెట్లు దక్కాయి. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా ధవన్‌ నిలిచాడు.  


ఆదుకున్న పూరన్‌

భారీ స్కోరు కాకపోయినా పంజాబ్‌ ఆరంభంలో కాస్త తడబడింది. అయితే, మిడిలార్డర్‌లో పూరన్‌, మ్యాక్స్‌వెల్‌ అదరగొట్టారు. సూపర్‌ ఫామ్‌లో ఉన్న కెప్టెన్‌ రాహుల్‌ (15)ను అక్షర్‌ పటేల్‌ మూడో ఓవర్‌లోనే బోల్తా కొట్టించాడు. అయితే తుషార్‌ వేసిన ఇన్నింగ్స్‌ ఐదో ఓవర్‌లో క్రిస్‌ గేల్‌ (29) ఢిల్లీకి చుక్కలు చూపించాడు. వరుసగా 4,4,6,4,6తో 26 పరుగులు పిండుకున్నాడు. దీంతో 5 ఓవర్లలో జట్టు 50 పరుగులు సాధించింది. కానీ మరుసటి ఓవర్‌లోనే అతడు అశ్విన్‌కు చిక్కాడు. దీనికి తోడు పూరన్‌తో సమన్వయం లోపించిన మయాంక్‌ (5) అనవసరంగా రనౌటయ్యాడు. ఆ తర్వాత పూరన్‌ బ్యాట్‌ ఝుళిపించారు. తొమ్మిదో ఓవర్‌ వేసిన తుషార్‌ను ఈసారి పూరన్‌ 6,4,4తో 15 పరుగులు రాబట్టాడు. ఇదే ధాటిని కొనసాగించిన తను 27 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసినా ఆ వెంటనే కీపర్‌ పంత్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. అప్పటికి 42 బంతుల్లో పంజాబ్‌ విజయానికి 35 పరుగులు మాత్రమే అవసరం. అయితే గెలవాల్సిన మ్యాచ్‌లను కూడా ఓడే అలవాటున్న పంజాబ్‌ ఇప్పుడేం చేస్తుందా అనిపించింది. అనుకున్నట్టుగానే మ్యాక్స్‌వెల్‌ అనవసర షాట్‌కు వెళ్లి క్యాచ్‌ అవుట్‌ కావడంతో ఉత్కంఠ పెరిగింది. కానీ 19వ ఓవర్‌లో నీషమ్‌ సిక్సర్‌తో 10 పరుగులు సాధించి పంజాబ్‌ విజయంతో మ్యాచ్‌ను ముగించింది.


ధవన్‌ ఒక్కడే..

ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ ఇన్నింగ్స్‌లో ఓపెనర్‌ ధవన్‌ బ్యాటింగ్‌ జోరు తప్ప చెప్పుకోవడానికి ఏమీ లేదు. మరోసారి ఫామ్‌ను నిరూపించుకుంటూ అంతా తానై జట్టును నడిపించాడు. తొలి ఓవర్‌ నుంచే బౌలర్లపై ఎదురుదాడికి దిగి చకచకా పరుగులు రాబట్టాడు. అయితే మరో ఎండ్‌లో ఇతర బ్యాట్స్‌మెన్‌ విఫలం కావడంతో జట్టు భారీ స్కోరుపై ప్రభావం పడింది. మధ్య ఓవర్లలో పంజాబ్‌ కట్టడి చేయగలిగింది. మ్యాక్స్‌వెల్‌ వేసిన ఇన్నింగ్స్‌ ఆరంభ ఓవర్‌లోనే గబ్బర్‌ 4,6తో 13 పరుగులు రాబట్టాడు. కానీ ఓపెనర్‌ పృథ్వీ షా (7) మళ్లీ విఫలమై నాలుగో ఓవర్‌లోనే అవుటయ్యాడు. అటు ధవన్‌ మాత్రం పంజాబ్‌ బౌలర్లను సునాయాసంగా ఎదుర్కొంటూ దాదాపు ఓవర్‌కో బౌండరీతో జోరు ప్రదర్శించాడు. ఈ దశలో కెప్టెన్‌ శ్రేయాస్‌ (14), పంత్‌ (14), స్టొయినిస్‌ (9) నిరాశపర్చడంతో భారీ భాగస్వామ్యాలు ఏర్పడలేదు. కానీ గబ్బర్‌ దూకుడును మాత్రం ఏ బౌలర్‌ కూడా అడ్డుకోలేకపోయాడు. దీంతో చివరి వరకు క్రీజులో నిలిచిన అతడు 57 బంతుల్లోనే వరుసగా రెండో శతకాన్ని పూర్తి చేసి ఔరా.. అనిపించుకున్నాడు.


స్కోరుబోర్డు

ఢిల్లీ: పృథ్వీ షా (సి) మ్యాక్స్‌వెల్‌ (బి) నీషమ్‌ 7; ధవన్‌ (నాటౌట్‌) 106; శ్రేయాస్‌ (సి) రాహుల్‌ (బి) ఎం.అశ్విన్‌ 14; పంత్‌ (సి) మయాంక్‌ (బి) మ్యాక్స్‌వెల్‌ 14; స్టొయినిస్‌ (సి) మయాంక్‌ (బి) షమి 9; హెట్‌మయెర్‌ (బి) షమి 10; ఎక్స్‌ట్రాలు: 4; మొత్తం: 20 ఓవర్లలో 164/5; వికెట్ల పతనం: 1-25, 2-73, 3-106, 4-141, 5-164; బౌలింగ్‌: మ్యాక్స్‌వెల్‌ 4-0-31-1; షమి 4-0-28-2; అర్ష్‌దీప్‌ సింగ్‌ 3-0-30-0; నీషమ్‌ 2-0-17-1; ఎం.అశ్విన్‌ 4-0-33-1; రవి బిష్ణోయ్‌ 3-0-24-0.

పంజాబ్‌: కేఎల్‌ రాహుల్‌ (సి) సామ్స్‌ (బి) అక్షర్‌ 15; మయాంక్‌ (రనౌట్‌/అశ్విన్‌/పంత్‌) 5; గేల్‌ (బి) ఆర్‌.అశ్విన్‌ 29; పూరన్‌ (సి) పంత్‌ (బి) రబాడ 53; మ్యాక్స్‌వెల్‌ (సి) పంత్‌ (బి) రబాడ 32; హుడా (నాటౌట్‌) 15; నీషమ్‌ (నాటౌట్‌) 10; ఎక్స్‌ట్రాలు: 8; మొత్తం: 19 ఓవర్లలో 167/5; వికెట్ల పతనం: 1-17, 2-52, 3-56, 4-125, 5-147; బౌలింగ్‌: డానియల్‌ సామ్స్‌ 4-0-30-0, రబాడ 4-0-27-2; అక్షర్‌ పటేల్‌ 4-0-27-1; తుషార్‌ దేశ్‌పాండే 2-0-41-0; ఆర్‌.అశ్విన్‌ 4-0-27-1; స్టొయినిస్‌ 1-0-14-0.


1

ఐపీఎల్‌ చరిత్రలో వరుసగా రెండు సెంచరీలు సాధించిన ఏకైక బ్యాట్స్‌మన్‌ శిఖర్‌ 

ధవన్‌. అయితే ఓ లీగ్‌లో ఎక్కువ శతకాలు (4) బాదిన రికార్డు కోహ్లీ పేరిట ఉంది.


4

ఐపీఎల్‌లో ధవన్‌కిది వరుసగా నాలుగో హాఫ్‌ సెంచరీ. ఇలా వరుసగా నాలుగు అర్ధ శతకాలు కొట్టిన ఆటగాడిగా కోహ్లీ, విలియమ్సన్‌తో కలిసి ధవన్‌ రెండో స్థానంలో ఉన్నాడు. 


5

ఐపీఎల్‌లో ఐదు వేల పరుగులు పూర్తి చేసిన ఐదో బ్యాట్స్‌మన్‌ ధవన్‌. 

Updated Date - 2020-10-21T08:43:36+05:30 IST