ప్రజాసంబంధాల మేరునగధీరుడు

ABN , First Publish Date - 2020-03-26T05:30:00+05:30 IST

పబ్లిక్ రిలేషన్స్ (ప్రజా సంబంధాలు) అనే మాట కాలక్రమేణా... ఏదో తప్పుడు పనికి పెట్టిన పేరులా రూపుదిద్దుకుంది. యాజమాన్య నిర్వహణలో అది ఒక కీలకమైన, వ్యూహాత్మక ప్రక్రియ అయినప్పటికీ, పీఆర్ అనగానే చిన్నచూపు ...

ప్రజాసంబంధాల మేరునగధీరుడు

నివాళి  చామల వెంకట నరసింహ రెడ్డి (1933– 2020)


నల్గొండ జిల్లాలోని తన స్వగ్రామంలో అయన ఒక ట్రస్టు ఏర్పాటుచేసి సాంఘిక, ఆధ్యాత్మిక సేవ చేసేవారు. వృత్తిలో రాణిస్తున్న వారికోసం తన పేరిట ప్రతి ఏడాదీ ఒక అవార్డు ప్రదానం చేసి సంతృప్తి పడేవారు. పీఆర్ వృత్తి వ్యాప్తి, నాణ్యతలకోసం అహరహం తపించిన మేరునగధీరుడు డాక్టర్ నరసింహ రెడ్డి లేనిలోటు తీర్చలేనిది. క్రికెట్‌లో టెండూల్కర్ మాదిరిగా పీఆర్‌లో ఆయన వేసిన ముద్ర సదా నిలిచిపోతుంది. ఆయన ఆశయాలు, అభిప్రాయాలు ఈ వృత్తిలో ఉన్నవారికి ఎల్లవేళలా మార్గదర్శకంగా ఉంటాయి.


పబ్లిక్ రిలేషన్స్ (ప్రజా సంబంధాలు) అనే మాట కాలక్రమేణా... ఏదో తప్పుడు పనికి పెట్టిన పేరులా రూపుదిద్దుకుంది. యాజమాన్య నిర్వహణలో అది ఒక కీలకమైన, వ్యూహాత్మక ప్రక్రియ అయినప్పటికీ, పీఆర్ అనగానే చిన్నచూపు చూడడం జరుగుతోంది. నిజానికి కార్పొరేట్ కమ్యూనికేషన్స్‌లో పబ్లిక్ రిలేషన్స్, అందులో మీడియా రిలేషన్స్, ముఖ్యమైన అంగాలుగా ఉన్నాయి. సమయానుకూలమైన వ్యూహప్రతివ్యూహాలతో సంస్థల పరువు ప్రతిష్ఠలు, యజమాని పేరుప్రఖ్యాతులు పెంచడమే కాకుండా, అనుకోకుండా తలెత్తే సంక్షోభాల గండం గట్టెక్కించే వృత్తి నిపుణులు పీఆర్ఓలు. 


పీఆర్ ప్రాముఖ్యతను రాజకీయ నాయకులు, ఉన్నత స్థాయి అధికారులు, సంస్ధల అధిపతులు, విశ్వవిద్యాలయాలు అర్థంచేసుకునేలా చేసిన వృత్తి నిపుణుడు, బహుగ్రంథకర్త, ఆచార్యుడు, నిత్య కృషీవలుడు డాక్టర్ చామల వెంకట నరసింహ రెడ్డి. తెలుగు సంవత్సరాది నాడు 87 ఏళ్ళ వయస్సులో కన్నుమూసిన ఆయన నలుగురు హేమాహేమీలైన ముఖ్యమంత్రుల దగ్గర ప్రెస్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వహించి మెప్పించారు. పీఆర్ పై అయన పాతికకు పైగా పుస్తకాలు రచించారు. వివిధ పత్రికలో వందలాది వ్యాసాలు ప్రచురించి, అనేక అవార్డులు అందుకున్నారు. 


వ్యూహాత్మక ప్రజాసంబంధాలు పేరిట ఆయన పునఃముద్రణ చేసిన ఆంగ్ల పుస్తకం దేశ విదేశాల్లో విశేష ఆదరణ పొందింది. దాని తెలుగు అనువాదం కూడా ఎంతో పేరు తెచ్చుకుంది. తొమ్మిదో పడికి చేరువైనా, అనారోగ్యం ఇబ్బంది పెట్టినా అయన తుది శ్వాస వీడే వరకూ 'పీఆర్- మీడియా రిలేషన్స్' అనే పుస్తకం కోసం పనిచేస్తూ వచ్చారు. డాక్టర్ రెడ్డి సంపాదకత్వంలో చాలా ఏళ్లుగా వస్తున్న ‘పీ ఆర్ వాయిస్’ వృత్తి  నిపుణులకు కరదీపికలా నిలిచింది. జర్నలిజంలో భాగంగా ఉండే పీఆర్ ను విడిగా ఒక సబ్జెక్టుగా బోధించాలని, అందులో లోతైన పరిశోధన జరగాలని గట్టిగా వాదించే ఆయన డాక్టర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఈ ప్రయోగం విజయవంతంగా చేశారు. అయన ఆధ్వర్యంలో పీఆర్ మీద చక్కని, నాణ్యమైన పాఠ్య పుస్తకాలు వెలువడ్డాయి. 


వివిధ దేశాల్లో పర్యటించి పీఆర్ పై ప్రసంగాలు చేసిన ఆయనను పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా (పీ ఆర్ ఎస్ ఐ) వంటి సంస్థలు జీవితకాలపు  సాఫల్య అవార్డుతో సముచితంగా సత్కరించాయి. మానేజ్మెంట్‌లో కీలకమైన ప్రజా సంబంధాల ఆవశ్యకత, అందులో జాతీయ అంతర్జాతీయ పరిణామాల గురించి ప్రతి వేదిక మీదా మాట్లాడడమే కాకుండా ఆచరణలో ఈ వృత్తికి పూర్తిగా అంకితమైన డాక్టర్ రెడ్డిని ‘పీ ఆర్ గురు’ గా ‘పీ ఆర్ భీష్మపితామహుడు’ గా పిలుస్తారు. పబ్లిక్ రిలేషన్స్ పై పలు శిక్షణ తరగతులు నిర్వహించిన అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ఆస్కీ)లో అయన చేసిన బోధనకు వివిధ రాష్ట్రాల నుంచి హాజరైన ఉన్నత ఉద్యోగుల నుంచి ప్రసంశలు లభించాయి. 


జర్నలిజం, పీఆర్ కవలలని చెప్పే ఆయన ఈ పవిత్రమైన వృత్తిలోని వచ్చేవారికి  పుస్తకపఠనాసక్తి ఉండాలని చెబుతూ ఉండేవారు. ‘‘పీఆర్ రంగంలో పనిచేసేవారికి రాత నైపుణ్యం ఉండాలి. రాయరానోళ్లు ఈ వృత్తిలోకి వస్తున్నారయ్యా...,’’ అని ఆయన బాధపడేవారు. ఏ సందేహంతో ఆయన దగ్గరకు వెళ్లినా ప్రేమతో మార్గదర్శకత్వం చేసేవారు. అట్లాగే, ఇంత వయస్సులోనూ తనకు భాష, సాంకేతికపరమైన సమస్యలు ఉంటే తనకన్నా వయస్సులో చిన్నవారైనా అవమానం అనుకోకుండా ఫోన్ చేసి మాట్లాడేవారు. 


నల్గొండ జిల్లాలోని తన స్వగ్రామంలో అయన ఒక ట్రస్టు ఏర్పాటుచేసి సాంఘిక, ఆధ్యాత్మిక సేవ చేసేవారు. వృత్తిలో రాణిస్తున్న వారికోసం తన పేరిట ప్రతి ఏడాదీ ఒక అవార్డు ప్రదానం చేసి సంతృప్తి పడేవారు. పీఆర్ వృత్తి వ్యాప్తి, నాణ్యతలకోసం అహరహం తపించిన మేరునగధీరుడు డాక్టర్ నరసింహ రెడ్డి లేనిలోటు తీర్చలేనిది. క్రికెట్‌లో టెండూల్కర్ మాదిరిగా పీఆర్‌లో ఆయన వేసిన ముద్ర సదా నిలిచిపోతుంది. ఆయన ఆశయాలు, అభిప్రాయాలు ఈ వృత్తిలో ఉన్నవారికి ఎల్లవేళలా మార్గదర్శకంగా ఉంటాయి.

సూరావఝల రాము

(సీనియర్‌ జర్నలిస్టు, ‘ఆస్కీ’ ప్రజాసంబంధాల విభాగం అధిపతి)

Updated Date - 2020-03-26T05:30:00+05:30 IST