‘గడప గడపకు’ నిలదీస్తున్నారు!

ABN , First Publish Date - 2022-08-09T08:54:39+05:30 IST

‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమం ద్వారా తమ పథకాలను ప్రచారం చేసి ఓట్లు రాబట్టాలని వైసీపీ ప్రజా ప్రతినిధులకు పార్టీ అధినేత జగన్‌రెడ్డి అప్పగించిన బాధ్యత బూమెరాంగ్ అయింది.

‘గడప గడపకు’ నిలదీస్తున్నారు!

‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమం ద్వారా తమ పథకాలను ప్రచారం చేసి ఓట్లు రాబట్టాలని వైసీపీ ప్రజా ప్రతినిధులకు పార్టీ అధినేత జగన్‌రెడ్డి అప్పగించిన బాధ్యత బూమెరాంగ్ అయింది. తన పథకాలు చూసి గడప గడపలో పూల బాటలు వేస్తారు అనుకొన్నారు పాపం జగన్‌రెడ్డి. కానీ వైసీపీ నాయకులు ఏ తలుపు తట్టినా, ఏ గడప ముంగిట నిలబడినా, ప్రజలు ‘ఎందుకు వచ్చారు? ఏం చేశారని వచ్చారు? మా గడప తొక్కవద్దు’ అని ఛీత్కరిస్తున్నారు. ఒక్క గడపలో కూడా కూర్చోమని గుక్కెడు మంచినీళ్లు ఇచ్చిన దిక్కు లేదు. నేనున్నాను, నేను విన్నాను అంటూ బులిపించిన వారు ఇప్పుడు ఎక్కడ ఉన్నారయ్యా, ఏం విన్నారయ్యా అని గడప గడపనా నిలబడి గర్జిస్తున్నారు ప్రజలు.


‘గడప, గడపకి మన ప్రభుత్వం’ కార్యక్రమంలో వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు మింగుడుపడని సన్నివేశాలను చవిచూస్తున్నారు. ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక వెన్నుచూపి పారిపోతున్నారు. తలరాతలు మారుస్తానని ప్రజలకు ఎన్నో ఆశలు కల్పించి అధికారంలోకి వచ్చిన జగన్ పరిపాలనపై మూడేళ్లు గడిచే సరికే భ్రమలు తొలగిపోయాయి. అధికార పార్టీ నాయకులు, అధికారులు తాము ‘ప్రజా సేవకులం’ అన్న విషయాన్ని విస్మరించి పట్టపగ్గాలు లేకుండా డబ్బు మేటలు కూడబెడుతూ ప్రజాభక్షకులుగా మారితే, అరాచకంతో రాష్ట్రాన్ని నాశనం చేస్తుంటే ప్రజలు మాత్రం ఎన్నాళ్ళు భరిస్తారు?


ప్రభుత్వ అసమర్థ, అసంబద్ధ, అహంకార విధానాలు, వాటి ఫలితంగా తాము మోయాల్సి వస్తున్న భారాలతో ప్రజలు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. మాపై పన్నులు వేసి, అన్నిటికి ధరలు పెంచి మా డబ్బు తీసుకొని మాకే ఇస్తున్నారు తప్ప మాకు అదనంగా మీరేమి ఇస్తున్నారని ఆర్థిక మంత్రి బుగ్గనని నిలదీస్తే నీళ్ళు నమిలారు మంత్రి. సిపిఎస్ రద్దు చేసిన తర్వాతనే ‘గడప, గడప’కు రావాలని కొందరు టీచర్లు స్పష్టం చేశారు. మరికొందరు మా ఇంటికి రావద్దని గేట్లకు బోర్డులు పెట్టారు. రైతులు ఎక్కడ సంతోషంగా ఉన్నారని, ధాన్యం అమ్మిన డబ్బులు నాలుగు నెలలు అయినా రాలేదని, కనీస మద్దతు ధర దక్కడం లేదని రైతులు గర్జించారు. ప్రభుత్వం పట్ల తీవ్ర వ్యతిరేకత ఉందని గ్రహించిన చాలా మంది ఎమ్మెల్యేలు ముఖం చాటేశారు. ప్రజల ఛీత్కారాలతో ప్రభుత్వ పెద్దలకు ముచ్చెమటలు పడుతున్నాయి.


అప్పులు చేసి సంక్షేమం పేరిట ప్రజాధనాన్ని విచ్చలవిడిగా పంచిపెడుతూ రాష్ట్ర భవిష్యత్తు బలిపెట్టింది ఈ ప్రభుత్వం. ఇబ్బడిముబ్బడిగా అప్పులు చేయడానికి ఎప్పటికప్పుడు కేంద్రప్రభుత్వ అనుమతి కోరడం తప్ప, రాష్ట్ర ఆదాయాన్ని పెంచడం, తెచ్చిన అప్పులు తీర్చడంపై ఏం చర్యలు తీసుకుంటారో మాత్రం చెప్పడం లేదు. రాష్ట్రం ఆర్థిక సంక్షోభం నుంచి ఎలా బయటపడుతుందో ఆర్థిక నిపుణులకు కూడా అర్థం కావడం లేదు. ఈ మూడేళ్ళలో అప్పుచేసిన అయిదు లక్షల కోట్లలో ఒక లక్ష కోట్లు ఖర్చుచేసి ఉన్నట్లయితే రాష్ట్రంలో ఉన్న అన్ని సాగు నీటి ప్రాజెక్టుల నిర్మాణం దాదాపు పూర్తయి రాష్ట్రం సస్యశ్యామలం అయ్యేది. అటువంటి ఆలోచనలు చేయకుండా మళ్లీ అధికారంలోకి రావడం కోసం రూపొందించిన పథకాల కోసం అప్పులు తెచ్చి పంచిపెడుతూ, పైపెచ్చు గత ప్రభుత్వం ఖాళీ ఖజానా అప్పగించిందని అబద్ధాలు చెబుతూ నెట్టుకువస్తున్నారు. 


మూడేళ్లుగా ఎమ్మెల్యేల ముఖం చూడటానికి ఇష్టపడని జగన్‌రెడ్డి ఇప్పుడు ముఖమంతా చిరునవ్వు పులుముకొని ప్రతి ఎమ్మెల్యేతో మాట్లాడటం మొదలు పెట్టారు. ‘గడప, గడపకూ...’ కార్యక్రమంలో భాగంగా రానున్న నెలరోజుల్లో ఏడు సచివాలయాలను ఎమ్మెల్యేలు సందర్శించాలని, ఆగస్టులో కనీసంగా 16 రోజులు, గరిష్ఠంగా 21రోజుల పాటు పాల్గొనాలంటూ జగన్ ఆదేశించడంపై ఎమ్మెల్యేలు విస్తుపోతున్నారు. ఇప్పటివరకు వారికి నిధులు, అధికారాలు లేవు. దానితో నియోజకవర్గ సమస్యలు ఎక్కడికక్కడే పేరుకుపోయివున్నాయి. వారు పోటీ చేసే సమయంలో, స్థానిక పరిస్థితుల ఆధారంగా ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించి వాటి అమలుకు కృషి చేస్తామని ప్రకటించి ఉన్నారు. అవేమీ పూర్తి కాలేదు. ఇప్పుడు ప్రజలు వాటిపైనా నిలదీస్తున్నారు. అంతా సచివాలయ వ్యవస్థతోనే సంక్షేమం కొనసాగుతోంది. దీనిపైనా ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారు. తామంతా అలంకార ప్రాయంగా ఉన్నామని వాపోతున్నారు.


వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, లెఫ్టినెంట్‌ గవర్నర్లతో ప్రధానమంత్రి మోదీ అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్‌ పాలక మండలి సమావేశాన్ని సద్వినియోగం చేసుకోవడంలోనూ సీఎం జగన్‌ విఫలమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన అనేక కీలక సమస్యలను ప్రస్తావించడం చేత కాలేదు. అంతేకాదు నీతి ఆయోగ్‌ సమావేశ లక్ష్యానికి అనుగుణంగా అవసరమైన విలువైన సలహాలు, సూచనలు ఇవ్వకుండా తానూ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి డబ్బాకొట్టుకొని వచ్చారు. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వారి, వారి రాష్ట్రాల సమస్యలను గట్టిగా ప్రస్తావించగా జగన్మోహన్ రెడ్డి మాత్రం రాష్ట్రంలో ఉన్న సమస్యలేవీ లేవనెత్తలేదు. ప్రత్యేక హోదాపై కానీ, విభజన హామీలు, పోలవరం ప్రాజెక్టుకు రావాల్సిన నిధులు గురించి అడగలేదు. గోదావరి వరదల వల్ల కలిగిన నష్టాన్ని వివరించి వరద సాయం కోరలేదు.


జగన్‌రెడ్డి అధికారంలోకి వచ్చి మూడేళ్లు దాటినా ఇది సాధించామని చెప్పుకునే పరిస్థితి లేదు? పరిశ్రమలు, కంపెనీలు ఏర్పాటు కోసం వివిధ రాష్ట్రాలు పోటీపడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మాత్రం ఆ దిశగా కనీస ప్రయత్నాలు చెయ్యలేదు. కర్ణాటకకు టెస్లా కంపెనీ, ఉత్తరప్రదేశ్‌కు సాంసంగ్‌ మొబైల్‌ తయారీ కేంద్రం, తమిళనాడు, తెలంగాణలకు అమెజాన్‌ కేంద్రాలు వచ్చాయి. రియల్‌ ఎస్టేట్‌ రంగంలో పెట్టుబడులు పెట్టేవారు సైతం ఆంధ్రప్రదేశ్‌ను పరిగణనలోకి తీసుకోకపోవడం సిగ్గుచేటు. చంద్రబాబుపై ఉన్న ద్వేషంతో ప్రగతిబాట పట్టిన రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారు. అమరావతిపై పగపట్టి పడగొట్టారు. పూర్తి కావచ్చిన పోలవరాన్ని కలగా మిగిల్చారు. అభివృద్ధిని నిలిపివేసి ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశారు. ఎవరేమన్నా నవ్యాంధ్ర నాశనమైంది. అందుకే నేడు ప్రభుత్వానికి గడప గడపనా వ్యతిరేకత ఎదురవుతోంది. ‘మాది జనరంజక, సంక్షేమ పాలన’ అని తాము భ్రమించినంత వరకూ ఫర్వాలేదు. ప్రజల్ని కూడా మభ్యపెట్టగలమనుకున్నారు. అది సాధ్యం కాదని వారికి ఇప్పుడిప్పుడే తెలుస్తోంది.


యనమల రామకృష్ణుడు

టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు

Updated Date - 2022-08-09T08:54:39+05:30 IST