బియ్యం గింజపై ప్రచారం!

ABN , First Publish Date - 2021-07-06T09:13:50+05:30 IST

మీ బియ్యం మీవే.. మా బియ్యం మావే.. అనే ధోరణితో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేదలకిచ్చే రేషన్‌ బియ్యం విషయంలో పోటాపోటీగా ప్రచారం చేసుకుంటున్నాయి

బియ్యం గింజపై ప్రచారం!

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోటాపోటీ

వేర్వేరుగా పీడీఎస్‌, పీఎంజీకేఏవై కోటాల పంపిణీ

నాణ్యమైన బియ్యం ఇస్తున్నామంటున్న రాష్ట్రం

ఉచితంగా ఇస్తున్నామంటున్న కేంద్ర ప్రభుత్వం

రేషన్‌ షాపుల్లో మోదీ ఫొటోతో బ్యానర్లు


పేదలకు ఇస్తున్న బియ్యంపైనా ప్రచారానికి తెరలేచింది. రేషన్‌కార్డుదారులకు మేం సార్టెక్స్‌ బియ్యాన్ని ఇస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా చెప్పుకొంటుంటే.. కరోనా కష్టకాలంలో ఉచితంగా బియ్యం ఇస్తున్నామంటూ కేంద్రం ప్రధాని మోదీ ఫొటోతో  రేషన్‌షాపుల్లో బ్యానర్లు ఏర్పాటు చేస్తోంది.


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

మీ బియ్యం మీవే.. మా బియ్యం మావే.. అనే ధోరణితో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేదలకిచ్చే రేషన్‌ బియ్యం విషయంలో పోటాపోటీగా ప్రచారం చేసుకుంటున్నాయి. మేం సార్టెక్స్‌ చేసిన నాణ్యమైన బియ్యం ఇస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం రెగ్యులర్‌ పీడీఎస్‌ గురించి చెబుతుంటే, కరోనా వల్ల పేదలపై ఎలాంటి భారం పడకుండా పూర్తి ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తున్నామని కేంద్ర ప్రభుత్వం అంటోంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ అన్న యోజన (పీఎంజీకేఏవై) పథకం కింద ఇచ్చే ఉచిత బియ్యం పంపిణీకి సంబంధించి ఈ నెల ప్రతి రేషన్‌ షాపులో మోదీ ఫొటోతో బ్యానర్లు కట్టాలని ఆదేశాలు జారీచేసింది. రేషన్‌ గోడౌన్లలోనూ బ్యానర్లు ప్రదర్శించాలని నిర్దేశించింది. ఏ పథకం కింద బియ్యం ఇస్తున్నారో ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని ఆ ఆదేశాల్లో పేర్కొంది. దీనికోసం ప్రత్యేకంగా రూపొందించిన బ్యానర్లను రాష్ర్టాలకు పంపింది. బ్యానర్‌పై రేషన్‌ షాపు నంబరు, ఊరి పేర్ల ముద్రించారు. దీంతో ఎవరు ఏ బియ్యం ఇస్తున్నారో కార్డుదారులకు అర్థమవుతుందని పేర్కొంటున్నారు.


వ్యతిరేకత వస్తుందనే వేర్వేరుగా..

గతేడాది లాక్‌డౌన్‌ సమయంలోనూ రెండు కోటాలు వేర్వేరుగా బియ్యం పంపిణీ చేసినా ఈ విధంగా ప్రచారం జరగలేదు. కానీ, ఈసారి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయంలో పోటీకి దిగాయి. వాస్తవానికి మే, జూన్‌ నెలలతోనే కేంద్రం ఉచిత రేషన్‌కు ముగింపు పలుకుతుందని రాష్ట్రం భావించింది. కానీ, ఉచితాన్ని కేంద్రం నవంబరు వరకు పొడిగించడంతో తాము సార్టెక్స్‌ చేసిన నాణ్యమైన బియ్యాన్ని పేదలకు ఇస్తున్నామని, రెండు కోటాల్లో అవి ఇవ్వాలంటే ఆ స్థాయిలో నిల్వలు తమ వద్ద లేవని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి తెలిపింది. రెండు రకాలు ఒకేసారి ఇస్తే రాష్ట్రం ఇచ్చే సార్టెక్స్‌ బియ్యం, కేంద్రం ఇచ్చే నాన్‌ సార్టెక్స్‌ బియ్యం కలిసిపోతాయని, అప్పుడు పేదల్లో వ్యతిరేకత వస్తుందని ఊహించి రెండు కోటాలను వేర్వేరుగా పంపిణీ చేయాలని రాష్ట్రం నిర్ణయించింది.


14 వరకు డోర్‌ డెలివరీ.. 15 నుంచి షాపుల్లో

ఈ నెల 2 నుంచి 14 వరకు రెగ్యులర్‌ పీడీఎ్‌సలో సార్టెక్స్‌ బియ్యాన్ని డోర్‌ డెలివరీ విధానంలో పంపిణీ చేసి, 15వ తేదీ నుంచి పీఎంజీకేఏవై బియ్యాన్ని రేషన్‌ షాపుల్లో పంపిణీ చేయనున్నారు. వేర్వేరుగా ఇవ్వడం వల్ల తాము ఇచ్చేవి నాణ్యమైన బియ్యం అని, కేంద్రం ఇచ్చేవి నాణ్యమైనవి కాదనే విషయం పేదలకు తెలియాలని జగన్‌ ప్రభుత్వం ఆశిస్తోంది. రెండూ ఒకేసారి ఇస్తే కేంద్రం ఉచితంగా ఇస్తున్నప్పుడు రెగ్యులర్‌ పీడీఎస్‌ కోటాను రాష్ట్రం కూడా ఉచితంగానే ఇవ్వొచ్చు కదా అనే ప్రశ్నలు కార్డుదారుల నుంచి వస్తాయనే భయం కూడా దీనికి కారణంగా భావిస్తున్నారు. మరోవైపు తాము ఉచితంగా ఇస్తున్నామనే విషయం ప్రజలకు తెలియాలని కేంద్రం తాపత్రయపడుతోంది. అయితే, మొత్తం 1.47 కోట్ల రేషన్‌కార్డుల్లో ఎన్‌ఎ్‌ఫఎ్‌సఏ పరిధిలో ఉన్న 88 లక్షల కార్డులకే కేంద్రం బియ్యం ఇస్తోందని, మిగిలిన 59లక్షల కార్డులకు ఇచ్చే రేషన్‌ భారం మొత్తం తామే భరిస్తున్నామని రాష్ట్రప్రభుత్వం అంటోంది.


మళ్లీ పంపిణీకి డీలర్లు సిద్ధమేనా..?

కాగా, రేషన్‌ను మళ్లీ షాపుల్లో పంపిణీ చేసే విధానాన్ని తీసుకురావడంపై డీలర్లు ఘాటుగా స్పందిస్తున్నారు. దశాబ్దాలుగా డీలర్ల ద్వారా జరుగుతున్న పంపిణీని వైసీపీ ప్రభుత్వం డోర్‌ డెలివరీ అంటూ తమకు దూరం చేసిందని వారంతా ఆందోళనలో ఉన్నారు. ‘ఇప్పుడు కూడా డోర్‌ డెలివరీనే చేయించుకోండి. మీకు కావాలన్నప్పుడు ఇవ్వడానికి డీలర్లు సిద్ధంగా ఉండాలా?’ అని డీలర్లు ప్రశ్నిస్తున్నారు. అయితే పీఎంజీకేఏవై కోటాను కూడా డోర్‌ డెలివరీ చేయిస్తే వాహనాల డ్రైవర్లకు అదనంగా రూ.5వేలు ఇవ్వాల్సి ఉంటుంది. ఆ భారం తగ్గించుకునేందుకే రాష్ట్ర ప్రభుత్వం పీఎంజీకేఏవై కోటాను డీలర్లకు అప్పగించింది. 

Updated Date - 2021-07-06T09:13:50+05:30 IST