ఎక్సైజ్‌లో అడ్డగోలు పదోన్నతులు!

ABN , First Publish Date - 2020-02-20T10:29:33+05:30 IST

ఎక్సైజ్‌ శాఖలో కింది స్థాయి పదోన్నతుల్లో నిబంధనలకు పాతర వేస్తున్నారు. సీనియర్లను కాదని జూనియర్లను అందలమెక్కిస్తున్నారు.

ఎక్సైజ్‌లో అడ్డగోలు పదోన్నతులు!

  • సీనియర్లను కాదని జూనియర్లకు అందలం
  • కావాల్సిన వారి కోసం మారిపోయిన నిబంధనలు!
  • మార్కుల మెరిట్‌తో ప్రమోషన్లు
  • నిస్పృహలో కానిస్టేబుళ్లు

హైదరాబాద్‌(ఆంధ్రజ్యోతి): ఎక్సైజ్‌ శాఖలో కింది స్థాయి పదోన్నతుల్లో నిబంధనలకు పాతర వేస్తున్నారు. సీనియర్లను కాదని జూనియర్లను అందలమెక్కిస్తున్నారు. పదోన్నతులు కావాలనుకున్న వారికి అనుకూలంగా నిబంధనలను మార్చి ప్రమోషన్లు కల్పిస్తున్నారు. దీంతో 23 ఏళ్లుగా పని చేస్తున్నా.. పదోన్నతులు రాక కానిస్టేబుళ్లు తీవ్ర నిరాశా నిస్పృహలకు గురవుతున్నారు. పోలీసు శాఖలో ఉంటే.. తమకు ఇప్పటికే హెడ్‌ కానిస్టేబుల్‌గా, ఏఎ్‌సఐగా పదోన్నతులు లభించేవని వారు వాపోతున్నారు. 1995లో ఆంధ్రప్రదేశ్‌ స్పెషల్‌ పోలీస్‌ కింద ఎంపికైన 2151 మంది కానిస్టేబుళ్లు 1996లో ఎక్సైజ్‌ శాఖకు డిప్యుటేషన్‌పై వచ్చారు. కాగా, ఎక్సైజ్‌ శాఖ వీరిని విలీనం (మెర్జ్‌) చేసుకుంటూ 2007 ఆగస్టు 17న జీవో నంబర్‌ 1103ను జారీ చేసింది. అప్పటి నుంచి వీరిని ఎక్సైజ్‌ కానిస్టేబుళ్లుగానే పరిగణిస్తున్నారు. అనంతరం వీరికి పదోన్నతులు కల్పించేందుకు వయసు ఆధారంగా సీనియారిటీ జాబితాను రూపొందిస్తూ ఎక్సైజ్‌ శాఖ 2009 మే 28న ఉత్తర్వులు జారీ చేసింది. ఆ మేరకు హెడ్‌ కానిస్టేబుల్‌ పోస్టులు ఖాళీ అయినప్పుడల్లా ఈ జాబితా ఆధారంగా పదోన్నతులు కల్పిస్తూ వస్తున్నారు. ఇలా పలు జిల్లాల్లో కలిపి మొత్తం 81 మందికి హెడ్‌ కానిస్టేబుళ్లుగా పదోన్నతులు కల్పిచారు. కానీ, ఇటీవల పదోన్నతుల నిబంధనలు మార్చడం మిగిలిన వారి పాలిట శాపంగా మారింది.


మార్కుల మెరిట్‌తో కొత్త నిబంధన


ఇంతకుముందు వయసు ఆధారంగా రూపొందించిన సీనియారిటీ జాబితాను పక్కన పెట్టి.. ‘మెరిట్‌’ ప్రాతిపదికన జాబితాను రూపొందించారు. కానిస్టేబుళ్ల ఎంపిక సందర్భంగా నిర్వహించిన పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా జాబితాను రూపొందించి పదోన్నతులు కల్పిస్తున్నారు. దీంతో 2014 తర్వాత ఎంపికైన కానిస్టేబుళ్లు పదోన్నతులు పొందుతున్నారు. హెడ్‌ కానిస్టేబుల్‌ పోస్టులు ఖాళీ అయినప్పుడల్లా ఇలాంటివారికే పదోన్నతులు కల్పిస్తూ భర్తీ చేస్తున్నారు. దీంతో 1996 నుంచి ఎక్సైజ్‌ శాఖలో పని చేస్తున్న కానిస్టేబుళ్లకు పదోన్నతులు లభించడం లేదు. వాస్తవానికి అప్పట్లో రాత పరీక్ష లేకుండా దేహదారుఢ్య పరీక్ష ఆధారంగానే పోలీసు శాఖ కానిస్టేబుళ్లను ఎంపిక చేసింది. దీంతో 1996 బ్యాచ్‌ కానిస్టేబుళ్లకు మార్కుల మెరిట్‌ నిబంధన వర్తించడం లేదు. ఫలితంగా వారికి ప్రమోషన్లు నిలిచిపోయాయి. 2014 తర్వాత వచ్చినవారు సీనియారిటీపరంగా, వయసు పరంగా జూనియర్లు అయినప్పటికీ.. వారికి పదోన్నతులిస్తూ అందలమెక్కిస్తున్నారని సీనియర్లు వాపోతున్నారు. తాము ఏళ్లతరబడి కానిస్టేబుళ్లుగానే మగ్గిపోవాల్సి వస్తుందని, చాలా మంది కానిస్టేబుళ్లుగానే రిటైరవుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 


ఆ ఇద్దరు అధికారుల వల్లే..


‘మెరిట్‌’ ప్రాతిపదికన జాబితాను తయారు చేయడం వెనుక అసలు కథ వేరుగా ఉందని కానిస్టేబుళ్లు ఆరోపిస్తున్నారు. నాంపల్లి ఎక్సైజ్‌ కమిషనరేట్‌లో డిప్యుటేషన్‌పై పని చేస్తున్న ఓ సహకార శాఖ అధికారిణి, కానిస్టేబుళ్ల సంఘం నాయకుడు కలిసి ఈ కొత్త నిబంధనతో నోట్‌ ఫైల్‌ను తయారు చేశారని చెప్పారు. ఈ నోట్‌ ఫైల్‌పై ఎక్సైజ్‌ డైరెక్టర్‌ సర్ఫ్‌రాజ్‌ అహ్మద్‌తో సంతకం తీసుకుని, జిల్లాల్లోని ఎక్సైజ్‌ సూపరింటెండెంట్ల(ఈఎ్‌స)లకు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల ఆధారంగా ‘మెరిట్‌’ నిబంధనను అమలు చేస్తూ ఈఎ్‌సలు కానిస్టేబుళ్లకు పదోన్నతులు కల్పిస్తున్నారు. తమకు అనుకూలంగా ఉన్నవారి కోసమే ఆ ‘ఇద్దరు’ మెరిట్‌ నిబంధనను ముందుకు తెచ్చారని ఎక్సైజ్‌ కానిస్టేబుళ్లందరూ బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. ఇందుకోసం పదోన్నతులు పొందుతున్న కానిస్టేబుళ్ల నుంచి ఒక్కొక్కరి వద్ద రూ.65 వేల చొప్పున వసూలు చేస్తున్నారన్న చర్చ జరుగుతోంది. 

Updated Date - 2020-02-20T10:29:33+05:30 IST