ధరణిలో సమస్యలేంటి?

ABN , First Publish Date - 2022-05-20T08:59:17+05:30 IST

ధరణిలో లోపాలు/సమస్యలపై ఆలస్యంగానైనా ప్రభుత్వం కళ్లు తెరిచింది.

ధరణిలో సమస్యలేంటి?

హైదరాబాద్‌, మే 19 (ఆంధ్రజ్యోతి): ధరణిలో లోపాలు/సమస్యలపై ఆలస్యంగానైనా ప్రభుత్వం కళ్లు తెరిచింది. ధరణి కారణంగా రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులేంటో తెలియజేయాలంటూ భూపరిపాలన ప్రధాన కమిషనర్‌ కార్యాలయం(సీసీఎల్‌ఏ) అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది. జిల్లా, మండలం, గ్రామం, సర్వే నంబర్‌, ప్రభావితమైన విస్తీర్ణం, ఎంత మంది రైతులపై ప్రభావం ఉంది? సమస్య ఏంటి? పరిష్కారం ఏంటి? వంటి వివరాలను తెలియజేయాలని సూచిస్తూ గురువారం ఒక ప్రొఫార్మాను కలెక్టర్లకు పంపింది. దీంతో జిల్లా కలెక్టర్లంతా తహసీల్దార్లకు ఆ ప్రొఫార్మాను పంపించి... ధరణి కారణంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలేంటో గుర్తించాలని నిర్దేశించారు.  అన్ని జిల్లాల నుంచి ప్రొఫార్మాలను క్రోడీకరించిన తర్వాత.. పూర్తి నివేదికను సీఎం కేసీఆర్‌కు అందజేయనున్నారు. ప్రధానంగా ఏమేం సమస్యలున్నాయో గుర్తించి, ఏకకాలంలో వాటిని పరిష్కరించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.


ధరణిపై ఫిర్యాదుల వెల్లువ

ధరణి అమల్లోకి వచ్చి 20 నెలలు పూర్తవుతుండగా.. దీనివల్ల కలిగే మేలు కన్నా కీడే అధికంగా ఉందన్న విమర్శలు వ్యక్తమయ్యాయి. రిజిస్ట్రేషన్‌ కాగానే రెవెన్యూ రికార్డుల్లో వివరాల నమోదు(మ్యుటేషన్‌)కు తప్ప.. మరే ప్రయోజనం లేదన్న వాదనలు వినిపించాయి. ధరణిని తీసుకొచ్చే క్రమంలోనే రెవెన్యూ వ్యవస్థను ప్రభుత్వం కుప్పకూల్చింది. క్షేత్రస్థాయిలో ఏ సమస్య వచ్చినా పరిష్కరించలేని నిస్సహాయ స్థితిలోకి యంత్రాంగాన్ని నెట్టింది. చివరికి జిల్లా కలెక్టర్‌ కూడా ఏ సమస్యపైనా నిర్ణయం తీసుకోలేని దుస్థితి. భూపరిపాలనలో కీలకంగా భావించే సీసీఎల్‌ఏ కూడా సుప్తచేతనావస్థలోకి వెళ్లింది. ధరణిలో లోపాలు, సమస్యలపై 20 నెలల్లోనే అక్షరాలా 5.17 లక్షల ఫిర్యాదులు అందాయి. ఇందులో 2,07,229దాకా పెండింగ్‌ మ్యుటేషన్లపై రాగా... భూముల సమస్యలపై 1,73,718 దాకా వచ్చాయి. తమ భూములను నిషేధిత జాబితాలో పెట్టారని 51,794 మంది నివేదించుకున్నారు. వాట్సప్‌ నంబర్‌కు సమస్యలు నివేదించాలని సీసీఎల్‌ఏ ప్రకటించగా.. లక్షకు పైగా విజ్ఞప్తులు వచ్చాయి. వాస్తవానికి తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సర్వీసెస్‌ అసోసియేషన్‌(ట్రెసా) కూడా 2020 డిసెంబరు 16న ధరణిలో సమస్యలను సవివరంగా ప్రభుత్వానికి నివేదించింది. ఆ తర్వాత డిప్యూటీ కలెక్టర్ల సంఘం కూడా ప్రభుత్వానికి ఓ నివేదిక ఇచ్చింది. కానీ, వీటిని ప్రభుత్వం పట్టించుకోలేదు. ఫలితంగా 20నెలల్లో 20మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. అయితే, తాము అధికారంలోకి వస్తే ధరణిని రద్దు చేస్తామని ‘వరంగల్‌ డిక్లరేషన్‌’లో కాంగ్రెస్‌ పేర్కొనడం, క్షేత్రస్థాయిలో దీనికి భారీగా మద్దతు వస్తుండడంతో ప్రభుత్వంలో కదలిక వచ్చింది. ధరణి రద్దు కూడా రాజకీయ మేనిఫెస్టోలో ఎజెండాగా మారే పరిస్థితి రావడంతో నష్ట నివారణ చర్యలపై సర్కార్‌ దృష్టి సారించినట్లు తెలుస్తోంది.


ఇవీ ప్రధాన సమస్యలు

ధరణి రావడానికి ముందు ప్రభుత్వ భూములు, వివాదాస్పద భూముల రిజిస్ట్రేషన్‌ జరిగినా... వాటి మ్యుటేషన్‌ను అడ్డుకునే అధికారం తహసీల్దార్‌కు ఉండేది. కానీ, ధరణి వచ్చాక రికార్డులు సరిగ్గా ఉంటే తిరస్కరించడానికి వీల్లేదన్న నిబంధనతో ప్రభుత్వ భూముల మ్యుటేషన్‌ జరగకుండా అడ్డుకునే అవకాశం పోయింది. 


రిజిస్ట్రేషన్‌ తర్వాత మ్యుటేషన్‌కు దరఖాస్తు చేసుకుంటే... ఆ గ్రామంలోనే నోటీసు అతికించి.. అభ్యంతరాలు కోరే అవకాశం లేకుండా పోయింది. 


అన్యాయంగా మ్యుటేషన్‌ జరిగిందని, జారీ చేసిన పాస్‌పుస్తకం రద్దు చేయాలని ఎవరైనా ఆర్డీవోకు, జాయింట్‌ కలెక్టర్‌కు గతంలో నివేదించే అవకాశం ఉండగా... ధరణిలో ఆ అవకాశమే లేదు. అభ్యంతరాలుంటే కోర్టులో సవాల్‌ చేసుకోవాల్సిందే.


సక్సేషన్‌కు(ఫౌతీకి) దరఖాస్తులు వస్తే... సంబంధిత రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ ఆ గ్రామానికి వెళ్లి... సంబంధిత రైతుకు సంతానమెంత...? సమర్పించిన వివరాలు సరైనవేనా?అని ఆరా తీసి... అభ్యంతరాలు రాకపోతేనే ఫౌతీ(సక్సేషన్‌) చేసేవారు. ధరణి వచ్చాక ఆ పరిస్థితి లేదు. కుటుంబ అఫిడవిట్‌ను ప్రామాణికంగా చేసుకొని సక్సేషన్‌ చేయాల్సిందే. వివాదాలు ఉంటే నేరుగా జిల్లా కోర్టు లేదా సివిల్‌ కోర్టులో అప్పీలు చేసుకోవాలి. 


వారసత్వంగా సంక్రమించిన భూమిని ఆస్తిదారు కుమారులు, ఇతర కుటుంబ సభ్యుల అనుమతి లేకుండా విక్రయించడానికి వీల్లేదు. అయితే ధరణిలో ఇవేమీ పట్టించుకోకుండా ఎవరి పేరు మీద ఆస్తి ఉంటే... కుటుంబసభ్యుల అనుమతి లేకుండానే విక్రయించుకోవడానికి అవకాశం ఉంది. 


భూరికార్డుల నవీకరణ సందర్భంగా రికార్డుల్లో చేరని రైతుల వివరాల నమోదుకు చాన్సే లేదు.


రైతులు వ్యవసాయం చేసుకుంటున్నా...రికార్డుల్లో వ్యవసాయేతర భూములుగా ఉన్న వాటిని తిరిగి వ్యవసాయ భూములుగా మార్చుకొని, పాస్‌ బుక్కులు పొందే అవకాశం లేకుండా పోయింది.

ఒక సర్వే నంబర్‌లో 10 వేల ఎకరాల భూములు ఉంటే... రికార్డుల్లో 10,500 ఎకరాలుగా నమోదైన కేసులు ఉన్నాయి. వాస్తవ విస్తీర్ణం ఆధారంగా రికార్డులను సరిచేయడానికి ఆయా గ్రామాల్లో సర్వే జరగాలి. వేలాది గ్రామాల్లో ఈ సమస్య ఉన్నా.. ఇప్పటిదాకా పరిష్కరించలేదు. 


ఒక రైతుకు పది ఎకరాల భూమి ఉంటే... అందులో కొంత మేర ఇళ్లు, ఇళ్ల స్థలాలు ఉంటే... మొత్తం భూమి వ్యవసాయేతర భూమిగా రికార్డుల్లో చేరుతోంది. ఆయా భూములను వ్యవసాయ భూములుగా మార్చే ఆప్షన్‌ ధరణిలో లేదు.


ఇనామ్‌, సీలింగ్‌, టెనన్షీ, పీవోటీ, అసైన్‌మెంట్‌ చట్టాల ప్రకారం అధికారాలు ఉన్నప్పటికీ.. అధికారులు ఏ సమస్యనూ పరిష్కరించలేని పరిస్థితి. 


అసైన్డ్‌చట్టం ప్రకారం అసైనీలు చనిపోతే... ఆ భూములను వారి వారసుల పేర్ల మీదకు మార్చాలి. 20 నెలలు అవుతున్నా ధరణిలో అలాంటి ఆప్షన్‌ తీసుకురాలేదు.


Updated Date - 2022-05-20T08:59:17+05:30 IST