పృథ్వీ షో

ABN , First Publish Date - 2021-04-30T09:01:49+05:30 IST

కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై ఎప్పుడు ఆడినా పరుగుల వరదపారించడం ఢిల్లీ క్యాపిటల్స్‌ యువ ఓపెనర్‌ పృథ్వీ షా (41 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్సర్లతో 82)కు అలవాటు...

పృథ్వీ షో

  • కేకేఆర్‌పై చెలరేగిన ఓపెనర్‌
  • ఢిల్లీ ఘనవిజయం 

అహ్మదాబాద్‌: కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై ఎప్పుడు ఆడినా పరుగుల వరదపారించడం ఢిల్లీ క్యాపిటల్స్‌ యువ ఓపెనర్‌ పృథ్వీ షా (41 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్సర్లతో 82)కు అలవాటు. గురువారం జరిగిన మ్యాచ్‌లోనూ అతడి బ్యాట్‌ గర్జించింది. దీంతో ఢిల్లీ 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కేకేఆర్‌ 20 ఓవర్లలో 6 వికెట్లకు 154 పరుగులు చేయగలిగింది. రస్సెల్‌ ధాటికి చివరి మూడు ఓవర్లలో జట్టు 42 పరుగులు సాధించింది. గిల్‌ (38 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌తో 43) రాణించగా చివర్లో రస్సెల్‌ (27 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 45 నాటౌట్‌) అదరగొట్టి పరువు కాపాడాడు. అక్షర్‌, లలిత్‌ యాదవ్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదనలో ఢిల్లీ 16.3 ఓవర్లలో 3 వికెట్లకు 156 పరుగులు చేసి గెలిచింది. ధవన్‌ (47 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌తో 46) సహకారం అందించాడు. కమిన్స్‌కు మూడు వికెట్లు దక్కాయి. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా పృథ్వీ షా నిలిచాడు.


తొలి ఓవర్‌లో 6 ఫోర్లు..: లక్ష్య ఛేదనలో ఢిల్లీ బ్యాటింగ్‌ సంచలన రీతిలో ఆరంభమైంది. పేసర్‌ శివమ్‌ మావికి ఇన్నింగ్స్‌ తొలి ఓవర్‌లోనే ఓపెనర్‌ పృథ్వీ షా చుక్కలు కనిపించేలా ఆడాడు. తొలి బంతిని అతడు వైడ్‌ వేయగా.. ఆ తర్వాత వరుసగా ఆరు బంతుల్లో 4,4,4,4,4,4తో మొతేరాను మోతెక్కించాడు. ఈ ఒక్క ఓవర్‌లోనే 25 పరుగులు వచ్చా యి. ఆ తర్వాత కూడా అతడి పరుగుల వేట ఎక్కడా ఆగలేదు. నాలుగో ఓవర్‌లో వరుసగా 4,6 బాదడంతో పవర్‌ప్లేలో ఈ సీజన్‌లో అత్యధిక పరుగులు (67) చేసిన జట్టుగా నిలిచింది. ఈ జోరుతో 18 బంతుల్లోనే షా అర్ధసెంచరీ కూడా పూర్తి చేశాడు. ఏ బౌలర్‌ను కూడా వదలకుండా అతడు బౌండరీలతో హోరెత్తించాడు. అటు బంతికో పరుగు చొప్పున సాధించిన ధవన్‌ 14వ ఓవర్‌లో అవుట్‌ కావడంతో తొలి వికెట్‌కు 132 పరుగుల భారీ భాగస్వామ్యం ముగిసింది. ఇక విజయానికి 9 పరుగుల దూరంలో కమిన్స్‌ 16వ ఓవర్‌లో పృథ్వీ షా, పంత్‌ (16)ను అవుట్‌ చేసినా ఢిల్లీ 16.3వ ఓవర్‌లోనే మ్యాచ్‌ను ముగించింది.


చివర్లో జోరు: టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా ఇన్నింగ్స్‌లో ఆరంభంలో ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌  నిలకడగా ఆడగా.. మిడిలార్డర్‌ మాత్రం దారుణంగా తడబడింది. చివర్లో రస్సెల్‌ మెరుపులతో జట్టు కాస్త గౌరవప్రదమైన స్కోరు అందుకుంది. తొలి 18 బంతుల్లో అతడు 16 పరుగు లు మాత్రమే సాధించగా.. ఆ తర్వాత 9 బంతుల్లోనే సిక్సర్లతో విరుచుకుపడి 29 పరుగులు రాబట్టాడు. అంతకుముందు నాలుగో ఓవర్‌లోనే ఓపెనర్‌ నితిశ్‌ రాణా (15) వికెట్‌ను కోల్పోగా గిల్‌ మాత్రం ఈసారి ఓపిగ్గా క్రీజులో నిలిచాడు. తొలి 10 ఓవర్లలో 69/1తో స్కోరు పటిష్ఠంగానే కనిపించినా మిడిలార్డర్‌ ఒక్కసారిగా తడబడింది. రాహుల్‌ త్రిపాఠి (19)ని స్టొయినిస్‌ అవుట్‌ చేయడంతో రెండో వికెట్‌కు 44 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఇక కోల్‌కతాకు అసలు షాక్‌ 11వ ఓవర్‌లో తగిలింది. మూడు బంతుల తేడాతో మోర్గాన్‌, నరైన్‌లను లలిత్‌ యాదవ్‌ డకౌట్‌గా వెనక్కి పంపాడు. ఇక చక్కగా కుదురుకున్న గిల్‌ను 13వ ఓవర్‌లో అవేశ్‌ అవుట్‌ చేయడంతో కేకేఆర్‌ కంగుతింది.  ఆ తర్వాత 17 ఓవర్‌లో దినేశ్‌ కార్తీక్‌ను అక్షర్‌ ఎల్బీగా పెవిలియన్‌కు చేర్చాడు. దీనిపై అతడు డీఆర్‌ఎ్‌సకు వెళ్లినా లాభం లేకపోయింది. ఇక రస్సెల్‌ చివర్లో బ్యాట్‌ ఝుళిపిస్తూ భారీగా పరుగులు రాబట్టాడు. 19వ ఓవర్‌లో 4,6,6తో 18 రన్స్‌ సాధించాడు. ఇక ఆఖరి ఓవర్‌లో 13 పరుగులు వచ్చాయి. దీంతో జట్టు స్కోరు 150 పరుగులు దాటింది.


స్కోర్‌బోర్డ్

కోల్‌కతా: నితీష్‌ (స్టంప్డ్‌) పంత్‌ (బి) అక్షర్‌ 15; గిల్‌ (సి) స్మిత్‌ (బి) అవేశ్‌ 43; రాహుల్‌ (సి) లలిత్‌ (బి) స్టొయినిస్‌ 19; మోర్గాన్‌ (సి) స్మిత్‌ (బి) లలిత్‌ 0; నరైన్‌ (బి) లలిత్‌ 0; రస్సెల్‌ (నాటౌట్‌) 45; కార్తీక్‌ (ఎల్బీ) అక్షర్‌ 14; కమిన్స్‌ (నాటౌట్‌) 11; ఎక్స్‌ట్రాలు: 7; మొత్తం: 20 ఓవర్లలో 154/6; వికెట్ల పతనం: 1-25, 2-69, 3-74, 4-75, 5-82, 6-109; బౌలింగ్‌: ఇషాంత్‌ 4-0-34-0; రబాడ 4-0-31-0; అక్షర్‌ 4-0-32-2; అవేశ్‌  4-0-31-1; లలిత్‌ 3-0-13-2; స్టొయినిస్‌ 1-0-7-1. 

ఢిల్లీ: పృథ్వీ షా (సి) నితీష్‌ (బి) కమిన్స్‌ 82; ధవన్‌ (ఎల్బీ) కమిన్స్‌ 46; పంత్‌ (సి) మావి (బి) కమిన్స్‌ 16; స్టొయినిస్‌ (నాటౌట్‌) 6; హెట్‌మయెర్‌ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు: 6; మొత్తం: 16.3 ఓవర్లలో 156/3; వికెట్ల పతనం: 1-132, 2-146, 3-150; బౌలింగ్‌: మావి 1-0-25-0; చక్రవర్తి 4-0-34-0; ప్రసిద్ధ్‌ 3.3-0-36-0; నరైన్‌ 4-0-36-0; కమిన్స్‌ 4-0-24-3. 


Updated Date - 2021-04-30T09:01:49+05:30 IST