ప్రేమ నటించి.. డబ్బు కోసం వేధించి

ABN , First Publish Date - 2022-08-06T08:53:43+05:30 IST

ఆమె అతడిని నమ్మితే..

ప్రేమ నటించి.. డబ్బు కోసం వేధించి

  • కుమార్తె మృతికి కారణమయ్యాడని ఓ యువకుడిపై తండ్రి కేసు
  • జీతం డబ్బులు దాచానని ఇంట్లో చెప్పి అతడికే ఇచ్చిన యువతి! 
  • లోన్‌ తీసుకొని ఆ డబ్బూ అతడి ఖాతాలోనే.. అకస్మాత్తుగా గుండెనొప్పితో మృతి
  • ఫోన్‌ పరిశీలిస్తే వివరాలు లభ్యం.. 45 రోజుల తర్వాత మృతదేహం వెలికితీత
  • పోస్టుమార్టం నిర్వహణ.. 

మిర్యాలగూడ, ఆగస్టు 5: ఆమె అతడిని నమ్మితే.. అతడేమో ఆమెను వంచించాడా? ఆమెతో చనువు పెంచుకొని, ఆమెను వేధించి జీతం డబ్బులు, లోన్‌ డబ్బులు తీసుకొని ఒత్తిడికి గురిచేసి చివరికి ఆమె మృతికి కారణమయ్యాడా? మృతురాలి తండ్రి ఇదే ఆరోపణ చేస్తున్నాడు! చనిపోయిన 45 రోజుల తర్వాత ఆమె ఫోన్‌ను పరిశీలించిన కుటుంబసభ్యులు.. అందులో అతడితో తన కూతురు ఉన్న ఫొటోలు, అతడికి ఇచ్చిన డబ్బు వివరాలు ఉండటంతో ఖంగుతిన్నారు. డబ్బు కోసం వేధించడంతోనే తమ కూతురు చనిపోయిందదని ఆరోపిస్తూ, సదరు యువకుడిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఖననం చేసిన ఆమె మృతదేహాన్ని 45 రోజుల తర్వాత  వెలికితీయించి పోస్టుమార్టం చేయించారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో ఈ ఘటన జరిగింది. బాధిత కుటుంబసభ్యుల సమాచారం ప్రకారం..  మిర్యాలగూడ బాపూజీనగర్‌కు చెందిన గోన శ్రీనివాసరావు, యాదమ్మ దంపతులు కూలి పని చేసుకుంటారు. వీరికి ఇద్దరు కుమార్తెలు. పెద్దకుమార్తె ప్రవళిక  బీటెక్‌ పూర్తి చేసి స్థానికంగా ప్రైవేట్‌ ఉద్యోగం చేస్తోంది. జూన్‌ 19వ తేదీన తల్లి, చెల్లి, మేనమామ కుటుంబ సభ్యులతో కలిసి శ్రీశైలం, మద్దిమడుగు క్షేత్రాల దర్శనానికి వెళ్లింది. 


మరుసటి రోజు మేనమామ స్వగ్రామం చందంపేట మండలం వెల్మగూడెం గ్రామానికి అంతా చేరుకున్నారు. అదేరోజు రాత్రి ప్రవళిక గుండెనొప్పిగా ఉందని చెప్పడంతో దేవరకొండ ఆస్పత్రికి తరలించారు. కాగా వైద్యులు ఆమె అప్పటికే చనిపోయిందని చెప్పడంతో మృతదేహాన్ని స్వగ్రామమైన మిర్యాలగూడకు తరలించి శ్మశానవాటికలో పూడ్చివేశారు. ఇరవై రోజుల క్రితం ప్రవళిక ఉపయోగించిన ఫోన్‌ను ఆమె సోదరి చూసింది. అందులో అదే కాలనీకి చెందిన పందిరి మహేశ్‌ అనే యువకుడితో ప్రవళిక చనువుగా మెలిగినట్లు, ఎక్కువసార్లు మాట్లాడినట్లు, చాటింగ్‌ చేసినట్లు, అతడి బ్యాంకు ఖాతాకు ప్రవళిక అనేక మార్లు ఫోన్‌పే ద్వారా వేలల్లో నగదును బదిలీ చేసినట్లు గుర్తించింది. ఈ క్రమంలోనే మిర్యాలగూడ ఎస్బీఐ సిబ్బంది... యువతి నంబర్‌కు ఫోన్‌ చేసి ప్రవళిక రుణంగా తీసుకున్న నగదు తిరిగి చెల్లించాలని చెప్పటంతో రూ.50 వేల వరకు లోన్‌ తీసుకున్నట్లు తల్లిదండ్రులకు తెలిసింది. నెలవారీ జీతం డబ్బులు ఇంట్లో ఇవ్వకుండా బ్యాంకులో దాచానని గతంలో ప్రవళిక తమతో చెప్పడం, ఆ నగదును ఆమె మహేశ్‌ ఖాతాకు బదిలీ చేసినట్లు తేలడంతో తల్లిదండ్రుల్లో అనుమానం మొదలైంది. మహేశ్‌ తన కుమార్తెతో ప్రేమగా నటించి, డబ్బుల కోసం వేధించి ఆమె మృతికి కారణమయ్యాడని మిర్యాలగూడ వన్‌టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ప్రవళిక చందంపేటలో మృతి చెందటంతో అక్కడ ఫిర్యాదు చేయాలన్న సూచన మేరకు ఈ నెల 2వ తేదీన చందంపేట పోలీసులకు తండ్రి శ్రీనివాసరావు ఫిర్యాదు చేశారు.  ఆ మేరకు మిర్యాలగూడ తహసీల్దార్‌ అనిల్‌కుమార్‌, ఆర్‌ఐ శ్యామ్‌, చందంపేట ఎస్‌ఐ యాదయ్య, మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రి వైద్యులు శంకర్‌నాయక్‌, సద్గుణరాజుల సమక్షంలో 45రోజుల క్రితం పూడ్చిన గోతిని తవ్వి మృతదేహానికి పోస్టుమార్టం చేశారు. యువతి శరీరభాగాల నమూనాలు కొన్నింటిని సేకరించి వైద్య పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపినట్లు పోలీసులు తెలిపారు. 

Updated Date - 2022-08-06T08:53:43+05:30 IST