ప్రెస్‌క్లబ్‌ ఎన్నికల ఫలితాలు ప్రకటించొద్దు

ABN , First Publish Date - 2022-03-18T09:22:25+05:30 IST

తీవ్ర ఉత్కంఠ, అనేక వివాదాలకు కారణమైన హైదరాబాద్‌ ప్రెస్‌క్లబ్‌ ఎన్నికల ఫలితాలు వెల్లడించవద్దని సిటీ సివిల్‌ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

ప్రెస్‌క్లబ్‌ ఎన్నికల ఫలితాలు ప్రకటించొద్దు

ఎన్నికల అధికారికి హైదరాబాద్‌ సివిల్‌ కోర్టు ఆదేశం

హైదరాబాద్‌, మార్చి 17 (ఆంధ్రజ్యోతి): తీవ్ర ఉత్కంఠ, అనేక వివాదాలకు కారణమైన హైదరాబాద్‌ ప్రెస్‌క్లబ్‌ ఎన్నికల ఫలితాలు వెల్లడించవద్దని సిటీ సివిల్‌ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇటీవల హైదరాబాద్‌ ప్రెస్‌క్లబ్‌, దాని కార్యవర్గం కోసం ఎన్నికలు నిర్వహించగా వాటి ఫలితాలను తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకూ ప్రకటించరాదని ఎన్నికల అధికారులకు కోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు సిటీ సివిల్‌ కోర్టు 10వ అదనపు చీఫ్‌ జడ్జి  జయరాజు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నిక నిర్వహణలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో ఫలితాలను ప్రకటించడంలో కొంత జాప్యం జరిగినా ఎటువంటి నష్టం జరగదని పేర్కొన్న కోర్టు... ప్రెస్‌క్లబ్‌తోపాటు ఎన్నికల అధికారికి అత్యవసరంగా నోటీసులు జారీ చేసింది. ఫలితాలు ప్రకటించొద్దన్న మధ్యంతర పిటిషన్‌పై తదుపరి విచారణను ఏప్రిల్‌ 6కు న్యాయస్థానం వాయిదా వేసింది. ప్రెస్‌క్లబ్‌ ఎన్నికల నిర్వహణలో అవకతవకలు జరిగాయంటూ నవీన్‌కుమార్‌ యారా దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తి జయరాజు ఈ మేరకు ఆదేశాలిచ్చారు. ఏప్రిల్‌ 13కు కేసు విచారణను వాయిదా వేశారు.

Updated Date - 2022-03-18T09:22:25+05:30 IST