గెలిస్తే అన్న క్యాంటీన్లు తెరుస్తాం: అచ్చెన్న

ABN , First Publish Date - 2021-03-04T08:52:34+05:30 IST

కార్పొరేషన్లు, మునిసిపాలిటీల్లో టీడీపీ గెలిస్తే అన్న క్యాంటీన్లు మళ్ళీ తెరుస్తామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు బుధవారం ప్రకటించారు. పురపాలక

గెలిస్తే అన్న క్యాంటీన్లు తెరుస్తాం: అచ్చెన్న

అమరావతి, మార్చి 3(ఆంధ్రజ్యోతి): కార్పొరేషన్లు, మునిసిపాలిటీల్లో టీడీపీ గెలిస్తే అన్న క్యాంటీన్లు మళ్ళీ తెరుస్తామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు బుధవారం ప్రకటించారు. పురపాలక ఎన్నికల కోసం తమ పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టోలో ప్రధాన వాగ్దానం ఇదేనని, దానికి తమ పార్టీ కట్టుబడి ఉందని తెలిపారు. ‘‘అన్న క్యాంటీన్లలో రోజూ మూడు పూటలా కలిపి 6 లక్షల మంది ఆహారం తినేవారు. వైసీపీ ప్రభుత్వం రాజకీయ కక్షతో వీటిని మూసివేసి పేదల నోటికాడ కూడును లాగేసింది’’ అని అచ్చెన్న విమర్శించారు. కాగా.. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి పార్టీ నిర్ణయాలకు, విధానాలకు విరుద్ధంగా వ్యవహరిస్తే, క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని అచ్చెన్నాయుడు హెచ్చరించారు. పార్టీ అనుమతి లేకుండా ఎవరైనా వ్యక్తిగత ప్రకటనలు జారీ చేసినా, పార్టీకి నష్టం చేకూర్చే పనులు చేసినా, క్రమశిక్షణ చర్యలు తప్పవన్నారు. 


‘అనంత’ మహిళా నేతకు ఉద్వాసన

పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు అనంతపురం పార్లమెంట్‌ తెలుగు మహిళ అధ్యక్ష బాధ్యతల నుంచి ముషీరా బేగంను తొలగించినట్లు రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత బుధవారం ప్రకటించారు.


ఏకగ్రీవాల పేరుతో దొడ్డిదారి అక్రమాలు

‘‘ఎన్నికలను ఎదుర్కోవడం చేతగాక వైసీపీ ఏకగ్రీవాలు చేసుకోవడానికి పడరాని పాట్లు పడుతోంది. పోలీసులను అడ్డుపెట్టుకొని చేయించుకొన్న ఏకగ్రీవాలు గెలుపే కాదు. ప్రజల ముందుకు వెళ్లే దమ్ములేక ఆ పార్టీ ఈ పేరుతో దొడ్డిదారి అక్రమాలకు ఒడిగట్టింది’’ అని తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాస రెడ్డి ఆరోపించారు. అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు తమ పదవులను కాపాడుకునేందుకు పంచాయతీ ఎన్నికల్లో అనేక అక్రమాలకు పాల్పడి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు గొల్లపూడిలో ఆరోపించారు. అభ్యర్థులే నామినేషన్లను ఉపసంహరించుకున్నారా? లేక అధికారులే వాటిని ఉపసంహరించారా? అనే దిశగా ఎస్‌ఈసీ విచారణ జరపాలని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబు డిమాండ్‌ చేశారు. 

Updated Date - 2021-03-04T08:52:34+05:30 IST