టీ-హబ్‌ 2 సిద్ధం

ABN , First Publish Date - 2022-06-23T08:44:17+05:30 IST

స్టార్ట్‌పలకు కేంద్రంగా నిలుస్తున్న టీ-హబ్‌ మరింత విస్తరించనుంది.

టీ-హబ్‌ 2 సిద్ధం

  • 3.50 లక్షల చదరపు అడుగుల్లో 276 కోట్లతో నిర్మాణం పూర్తి 
  • 1500 స్టార్టప్‌లకు చోటు.. 28న ప్రారంభించనున్న కేటీఆర్‌


హైదరాబాద్‌, జూన్‌ 22 (ఆంధ్రజ్యోతి): స్టార్ట్‌పలకు కేంద్రంగా నిలుస్తున్న టీ-హబ్‌ మరింత విస్తరించనుంది. ఐటీ కారిడార్‌ రాయదుర్గంలో గత ఐదేళ్లుగా నిర్మాణంలో ఉన్న టీ-హబ్‌ రెండో దశ భవన నిర్మాణ పనులు పూర్తయ్యాయి. మూడెకరాల్లో రూ.276 కోట్లతో నిర్మించిన ఈ భవనాన్ని ఈనెల 28న ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ ప్రారంభించనున్నారు. యూనికార్న్‌ స్టార్ట్‌పలు మీషో, స్విగ్గీ, ప్రిస్టిన్‌ కేర్‌, డెలివరీ వ్యవస్థాపకులతో పాటు సీక్యా క్యాపిటల్‌, యాక్సిల్‌, ఎండియా పార్ట్‌నర్స్‌, కలారి క్యాపిటల్‌ వంటి వెంచర్‌ పెట్టుబడిదారులు, మారుతి సుజూకి, కోటక్‌ మహీంద్ర బ్యాంక్‌, ఎస్‌ఏపీ వంటి కార్పొరేట్‌ దిగ్గజాలు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. నూతన భవనంలో ఒకేసారి 1500 స్టార్ట్‌పలకు చోటు కల్పించవచ్చని ఐటీశాఖ వర్గాలు తెలిపాయి. 


స్టార్ట్‌పలతో పాటు వెంచర్‌ క్యాపిటలిస్టులకూ ఇందులో చోటు కల్పించనున్నామని ఆ వర్గాలు తెలిపాయి. టీ-హబ్‌ 2తో స్టార్ట్‌పల రంగంలో రాష్ట్ర ఖ్యాతి జాతీయ స్థాయిలో మరింత ఇనుమడిస్తుందని పేర్కొన్నాయి. కాగా టెక్నాలజీ రంగంలో వినూత్న ఆలోచనలున్న స్టార్ట్‌పలను ప్రోత్సహించాలన్న లక్ష్యంతో 2015 నవంబరులో టెక్నాలజీ హబ్‌ను (టీ-హబ్‌) ఏర్పాటు చేశారు. గచ్చిబౌలిలోని ట్రిపుల్‌ ఐటీ క్యాంప్‌సలో 70 వేల చదరపు అడుగుల్లో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో దీనిని ఏర్పాటు చేశారు. అనతి కాలంలోనే ఇది స్టార్ట్‌పలకు కేంద్రంగా నిలిచింది. వినూత్న ఆలోచనలున్న ఆవిష్కర్తలను గుర్తించి, విజయవంతమైన స్టార్ట్‌పలుగా ఎదిగేందుకు కావాల్సిన సహకారాన్ని ఇందులో అందిస్తారు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. టీ-హబ్‌ ద్వారా గత ఏడేళ్లలో 1200 స్టార్ట్‌పలకు సహకారం అందించారు. రూ.1800 కోట్ల నిధులను సమకూర్చారు. ఇక్కడి స్టార్ట్‌పలతో 2500 మందికి ఉపాధి అవకాశాలు లభించాయు. అయితే స్థలాభావంతో ఒకేసారి వందకు మించి స్టార్ట్‌పలకు అవకాశం లేకపోవడంతో.. విశాలమైన మరో భవనం నిర్మించాలని ప్రభుత్వం టీ-హబ్‌ 2కు ఐదేళ్ల క్రితం శంకుస్థాపన చేసింది. ఆ పనులు ఎట్టకేలకు ఇప్పుడు పూర్తయ్యాయి.

Updated Date - 2022-06-23T08:44:17+05:30 IST