మహా జాతరకు సర్వం సిద్ధం

ABN , First Publish Date - 2022-02-15T07:25:16+05:30 IST

మేడారం మహాజాతరకు సర్వం సిద్ధమైంది. మాఘ పౌర్ణమి సందర్భంగా

మహా జాతరకు సర్వం సిద్ధం

  • రేపటి నుంచే మేడారం జాతర.. ముస్తాబైన కోన
  • విధుల్లో 30 వేల మంది ఉద్యోగులు, సిబ్బంది 
  • 21 లక్షల మందిని తరలించేందుకు ఆర్టీసీ సిద్ధం
  • హైదరాబాద్‌, కరీంనగర్‌, మహబూబ్‌నగర్‌..
  • వరంగల్‌ ఆర్ట్స్‌ కాలేజీ నుంచి హెలికాప్టర్‌ సేవలు
  • ఆర్టీసీ కార్గో ద్వారా ‘బంగారం’ మొక్కుల చెల్లింపులు
  • 30 మంది ఉంటే.. కాలనీలకే ప్రత్యేక బస్సులు
  •  

హైదరాబాద్‌, భూపాలపల్లి, ములుగు, గుండాల, బర్కత్‌పుర, తాడ్వాయి, వేములవాడ, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి): మేడారం మహాజాతరకు సర్వం సిద్ధమైంది. మాఘ పౌర్ణమి సందర్భంగా బుధవారం నుంచి శనివారం వరకు నాలుగు రోజులపాటు అంగరంగ వైభవంగా జరగనున్న ఈ జాతరకు కోటి మందికి పైగా భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆసియాలోనే అతిపెద్దదైన గిరిజన జాతరగా పేరున్న మేడారంలో అటెండర్‌ మొదలు సీనియర్‌ ఐఏఎస్‌ దాకా.. అధికార యంత్రాంగమంతా కొలువుదీరింది. జాతర  నాలుగు రోజులూ.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డి మేడారం పర్యవేక్షణలో ఎక్కువ సమయం కేటాయిస్తారు. మంత్రులు సత్యవతిరాథోడ్‌, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఇంద్రకరణ్‌రెడ్డి, గిరిజన సంక్షేమం, రెవెన్యూ, దేవాదాయశాఖల చీఫ్‌లు, సీనియర్‌ అధికారులు ఇక్కడే ఉండి, పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తారు



భారీ బందోబస్తు

మేడారం జాతరలో పరిసర ప్రాంతాలన్నీ ఎలకా్ట్రనిక్‌ నిఘా పరిధిలోకి వెళ్లనున్నాయి. 10,500 మంది పోలీసులు బందోబస్తు విధుల్లో ఉన్నా.. అధునాతన సాంకేతికతతో కంట్రోల్‌ రూం నుంచి నిఘా కొనసాగనుంది. పాత నేరస్థులు, నక్సలైట్లు, నేరగాళ్ల ఆచూకీని కనిపెట్టేందుకు ఫేషియల్‌ రికగ్నేషన్‌ కెమెరాలను వినియోగిస్తున్నారు. అదనపు డీజీ నాగిరెడ్డిని శాంతిభద్రతల పరిరక్షణకు నియమించారు. వీరికి తోడుగా.. ములుగు  కలెక్టర్‌, అదనపు కలెక్టర్‌, భద్రాచలం ఐటీడీఏ పీవో, ములుగు ఎస్పీ సంగ్రామ్‌ సింగ్‌, వరంగల్‌, కరీంనగర్‌, రామగుండం పోలీస్‌ కమిషనర్లు, అదనపు కమిషనర్లతో పాటు మరో 10 మంది ఐపీఎ్‌సలు జాతరలో విధులు నిర్వర్తించనున్నారు.


మొత్తం 30 వేల మంది అధికారులు, సిబ్బంది మేడారం విధుల్లో ఉంటారు. జాతర కోసం ఆర్టీసీ 3,845 బస్సులను నడుపుతోంది. 21 లక్షల మంది భక్తులను తరలించేందుకు సిద్ధమైంది. నార్లాపూర్‌ వరకు ప్రైవేటు వాహనాల్లో వచ్చే భక్తులను గద్దెల వరకు ఉచితంగా తరలించేందుకు 30 బస్సులను నడపనుంది. కొవిడ్‌ నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ 35 శిబిరాలను, టీటీడీ కల్యాణ మండపంలో 50 పడకలతో, ఇంగ్లిష్‌ మీడియం స్కూల్‌లో మరో 10 పడకలతో తాత్కాలిక ఆస్పత్రులను ఏర్పాటు చేసింది. 150 మంది వైద్యులు నిరంతరం అందుబాటులో ఉంటారు. 50 లక్షల మాస్కులను పంపిణీ చేయనుంది.10 లక్షల యాంటీజెన్‌ కిట్లను అందుబాటులో ఉంచింది. ప్రభుత్వం కేటాయించిన రూ.75 కోట్ల నిధులతో అభివృద్ధి పనులు దాదాపు పూర్తయ్యాయి. 6,140 తాత్కాలిక మరుగుదొడ్లు, 460 బీవోటీలను ఏర్పాటు చేశారు.


అమ్మలను తీసుకువచ్చేది వీరే

సమ్మక్క, సారలమ్మ పూజారులు దేవదూతలు. కనిపించని దైవానికి నడిచొచ్చే ప్రతినిధులు వాళ్లు. జాతరలో వారి మాటే శాసనం. రెండేళ్లు వనంలో ఉండే దైవాలు.. వీరి  సాయంతో జన ప్రవేశంచేసి, భక్త కోటికి ఆశీస్సులు అందిస్తారు. సమ్మక్క ఆగమనం జాతరలో ముఖ్యమైన ఘట్టం. సమ్మక్క పూజారి కొక్కెర కృష్ణయ్య చిలుకలగుట్ట నుంచి అమ్మవారిని గద్దెలపైకి తీసుకువస్తారు. కిష్టయ్య 2012 నుంచి ఈ విధులు చేపట్టారు. ఇక సారలమ్మ రాకతో మేడారం జాతర ప్రారంభమవుతుంది. సారలమ్మ ప్రధాన పూజారిగా కాక సారయ్య వ్యవహరిస్తారు. కన్నెపల్లిలోని పూజా మందిరం నుంచి సారలమ్మ రూపమైన పసుపు, కుంకుమలను వెదురుబుట్టలో మేడారంలోని గద్దెపైకి తీసువస్తారు. ఆయన 2002 నుంచి ఈ విధుల్లో ఉన్నారు.


సమ్మక, సారలమ్మ కంటే ముందే జంపన్న, నాగులమ్మలు గద్దెల పైకి వస్తారు. జంపన్నవాగు ఒడ్డున ఉండే గద్దెపైకి జంపన్న ప్రతిరూపమైన పడిగను కన్నెపల్లి నుంచి పాయం సురేశ్‌, నార్లాపూర్‌లో ఉండే నాగులమ్మ రూపాన్ని తలపతి ఊకె చంద్రయ్య తీసుకువస్తారు. ఇక గంగారం మండలం పూనుగొండ్లలో కొలువైన పగిడిద్దరాజు పూజారిగా పెనుక బుచ్చిరాములు, ఏటూరునాగారం మండలం కొండాయిలో కొలువైన గోవిందరాజులుకు పూజారిగా దబ్బకట్ల గోవర్ధన్‌లు వ్యవహరిస్తున్నారు. పగిడిద్దరాజు ఆగమనంతో జాతర తంతు ప్రారంభమవుతుంది. భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా గుండాల మండలం వేపల గడ్డకు చెందిన పగిడిద్దరాజు వంశీయులు(అర్రెం) ఆయనను గద్దెల వరకు తీసుకువస్తారు. ఆ తర్వాత జాతర జరిగే నాలుగు రోజులు ఇక్కడి పూజారులే రాజులుగా వ్యవహరిస్తారు. 


 జాతరలో పుణ్యస్నానాలతో పాటు శివసత్తుల పూనకాలతో జంపన్న వాగు ఉప్పొంగుతుంది. ప్రతి భక్తుడూ ఇక్కడ స్నానాలు చేసి, పక్కనే ఉన్న ఉన్న జంపన్న గద్దె వద్ద తొలి మొక్కు చెల్లిస్తారు. మేడారం జాతర అధికారికంగా ప్రారంభానికి ఒక్క రోజు ముందుగానే(మంగళవారం) జంపన్న గద్దెకు చేరుకోనున్నారు. జాతరలో ఈ వాగు కుంభమేళా సమయంలో గంగానదిని తలపిస్తుంది. అందుకే.. ఈ జాతరను తెలంగాణ కుంభమేళా అని పిలుస్తుంటారు.  మేడారం పరిసరాల్లో ఏర్పాటు చేసే 22 వైన్స్‌షాపుల కోసం తాడ్వాయి ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో మద్యం నిల్వలను సిద్ధం చేశారు. ఆదివాసీ సంఘాలు, మేడారం పూజారుల సంఘాలు నిర్వహిస్తాయి. 



వెళ్లలేకపోతే.. మేమున్నాం: ఆర్టీసీ 

మేడారం జాతరకు వెళ్లలేని భక్తులకు.. అతితక్కువ చార్జీలతో సమ్మక్క, సాలరమ్మలకు బంగారం(బెల్లం) మొక్కులు చెల్లించే సేవలను మంగళవారం నుంచి టీఎ్‌సఆర్టీసీ కల్పించనుంది. హైదరాబాద్‌లో ఉండే భక్తులు సమీపంలోని డిపోల్లో బడా బస్టాండ్లు, పర్యాటక ప్రదేశాల్లో ఏర్పాటు చేసిన కౌంటర్లలో రూ. 200 చెల్లిస్తే.. ఐదు కిలోల బంగారాన్ని అమ్మవార్లకు పంపుతారు. ఇతర వివరాలకు 040-30102829, 040-681553333లలో సంప్రదించవచ్చు. నగరంలో 30 మంది ఒక గ్రూపుగా ఏర్పడితే.. వారి కాలనీలు, అపార్ట్‌మెంట్‌ల నుంచే మేడారం గద్దెల వరకు ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేస్తామని సంస్థ ఈడీ వెంకటేశ్వర్లు వెల్లడించారు. ఇతర వివరాలకు 99592 26117, 99592 26127, 99592 26129 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.

 

4 ప్రాంతాల నుంచి హెలికాప్టర్‌లో జాతరకు

భక్తులు మేడారం జాతరకు హెలికాప్టర్‌లో వెళ్లవచ్చు. మంగళవారం ఈ సేవలను పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ ప్రారంభించనున్నారు. బేగంపేట్‌ విమానాశ్రయం, కరీంనగర్‌, మహబూబ్‌నగర్‌ నుంచి హెలికాప్టర్‌ సేవలు అందుబాటులోకి వస్తాయి. హనుమకొండ ఆర్ట్స్‌ కాలేజీ నుంచి ఇప్పటికే సేవలు ప్రారంభమయ్యాయి.


‘మీ సేవ’ ద్వారా ప్రసాదం

సమ్మక్క, సారలమ్మ జాతర ప్రసాదాన్ని మీసేవ ద్వారా అందించేందుకు  ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందని ఈ-సేవ హైదరాబాద్‌ జిల్లా మేనేజర్‌ రజిత తెలిపారు. సమీపంలోని మీ-సేవా కేంద్రంలో రూ.225 చెల్లిస్తే.. కొరియర్‌ ద్వారా నేరుగా వారి ఇళ్లకే అమ్మవార్ల ప్రసాదాన్ని పంపుతామని వివరించారు.


 రాజన్నకూ మేడారం తాకిడి

మేడారం నేపథ్యంలో వేములవాడ రాజన్నకు భక్తుల తాకిడి పెరిగింది. మేడారం వెళ్లే భక్తుల్లో చాలా మందికి.. ఒకట్రెండ్రోజుల ముందు రాజన్నను దర్శించుకోవడం ఆనవాయితీ. సోమవారం 30 వేల మంది వచ్చారు. 




ముఖ్య ఘట్టాలు

16న కన్నెపల్లి నుంచి సారలమ్మ, పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజు, కొండాయి నుంచి గోవిందరాజులు గద్దెకు వస్తారు

17న చిలకలగుట్ట నుంచి సమ్మక్కను గద్దెకు తీసుకువస్తారు

18న భక్తజనం మొక్కులు చెల్లిస్తారు

19వ తేదీ సాయంత్రం సమ్మక్క, సారలమ్మ వనప్రవేశంతో జాతర ముగుస్తుంది




18న సీఎం కేసీఆర్‌ రాక

మేడారం జాతరకు సీఎం కేసీఆర్‌ కుటుంబ సమేతంగా వస్తున్నారని మంత్రులు సత్యవతి రాథోడ్‌, ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. ఈ నెల 18న అమ్మవార్లను సీఎం దర్శించుకుంటారని చెప్పారు. జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని చెప్పారు. భక్తుల వాహనాలకు 34 ప్రాంతాల్లో పార్కింగ్‌ సదుపాయం కల్పించామని వివరించారు. జాతర విధుల్లో అన్ని విభాగాలు కలిపి 40 వేల మంది సిబ్బంది విధుల్లో ఉన్నారని చెప్పారు.  జాతరకు గతంలో 3,300 బస్సులు నడపగా.. ఈ సారి ఆ సంఖ్యను 3800కి పెంచామని ఆర్టీసీ ఛైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌ చెప్పారు.  


వేడుకకు ముందే అర కోటి భక్తజనం


జాతర ప్రారంభానికి ముందే మేడారానికి భక్తులు పోటెత్తుతున్నారు.  రోజూ లక్షల్లో భక్తులు వస్తున్నారు. ఇప్పటి వరకు 50 లక్షల మందికి పైగా భక్తులు మేడారాన్ని సందర్శించారని అధికారులు పేర్కొన్నారు. ఆదివారం 12 లక్షల మంది, సోమవారం 7 లక్షల మంది భక్తులు మేడారానికి వచ్చినట్లు తెలిపారు. గతంలో ఇలా ముందస్తు దర్శనాలు 25 లక్షలకు మించి ఉండేవి కాదని, కొవిడ్‌ కారణంగా సెలవుల పొడిగింపు వల్ల భక్తుల తాకిడి పెరిగిందని వివరించారు. వాహనాల తాకిడి కూడా పెరగడంతో ట్రాఫిక్‌ పోలీసులు పలుచోట్ల వన్‌వేను అమలు చేస్తున్నారు.


Updated Date - 2022-02-15T07:25:16+05:30 IST