Abn logo
Jul 28 2021 @ 01:25AM

ప్రీమియర్‌ ఎనర్జీస్‌ రూ.1,000 కోట్ల పెట్టుబడులు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): సోలార్‌ ఫోటో వోల్టాయిక్‌ (పీవీ) సెల్స్‌, మాడ్యూల్స్‌ను తయారు చేస్తున్న ప్రీమియర్‌ ఎనర్జీస్‌ వచ్చే రెండేళ్లలో రూ.1,000-1,200 కోట్ల పెట్టుబడులతో 2 గిగావాట్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని సమకూర్చుకోవాలని భావిస్తోంది. ప్రస్తుతం కంపెనీ చేతిలో ఒక గిగావాట్‌ ఉత్పత్తి సామర్థ్యం ఉందని.. దీన్ని 3 గిగావాట్లకు పెంచుకోవాలని భావిస్తున్నామని ప్రీమియర్‌ ఎనర్జీస్‌ ఎండీ చిరంజీవ్‌ సలుజా తెలిపారు. వచ్చే నాలుగు నెలల్లో రూ.500 కోట్లు, వచ్చే ఆర్థిక సంవత్సరంలో మరో రూ.500 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు చెప్పారు. మొత్తం 3 గిగావాట్లలో మాడ్యూల్స్‌ తయారీ సామ ర్థ్యం 1.75 గిగావాట్లు, సెల్స్‌ సామర్థ్యం 1.25 గిగావాట్లు ఉంటుందన్నారు. రూ.483 కోట్లతో హైదరాబాద్‌ సమీపంలో ఏర్పాటు చేసిన కొత్త తయారీ యూనిట్‌ను గురువారం తెలంగాణ పరిశ్రమల మంత్రి కే తారక రామారావు ప్రారంభించనున్న సందర్భంగా ఆయన మాట్లాడారు. 750 మెగావాట్ల మాడ్యూల్స్‌, 750 మెగావాట్ల సెల్స్‌ ఉత్పత్తి సామర్థ్యంతో దీన్ని ఏర్పాటు చేశారు.