Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Thu, 26 May 2022 03:19:34 IST

ముందస్తు కుట్ర!

twitter-iconwatsapp-iconfb-icon

 • పక్కా ప్లాన్‌తోనే భారీ విధ్వంసం.. వైసీపీ నేతల పాత్ర బట్టబయలు!
 • తమ పార్టీ కౌన్సిలరే చేశారన్న మంత్రి విశ్వరూప్‌
 • ఆ వెంటనే ఆయన ముఖ్య అనుచరుడు సాయి అరెస్టు
 • ప్రణాళిక ప్రకారమే విశ్వరూప్‌ ఇంటికి పెట్రోల్‌తో నిప్పు
 • కింది అంతస్తును మించి పై అంతస్తులో మంటల తీవ్రత
 • కాలిపోయిన మంత్రి గన్‌మెన్‌ రైఫిళ్లు
 • నిప్పుపెట్టేటప్పుడు పోలీసులు గాల్లో
 • కాల్పులు జరపకపోవడంపై అనుమానం
 • ముందురోజే ఎస్పీ ఆఫీసు వెనుక
 • అపార్టుమెంట్లో ఆందోళనకారులు?
 • మంత్రి ఉండే అద్దె ఇల్లు పూర్తిగా ధ్వంసం
 • నిర్మాణంలో ఉన్న సొంత ఇంటికి స్వల్పంగా నష్టం
 • పెట్రోలు, కర్రలు, రాడ్లు ముందే సిద్ధం
 • అంతా ఓ నేత కనుసన్నల్లోనే?


(కాకినాడ-ఆంధ్రజ్యోతి): అమలాపురంలో విధ్వంసం వెనుక పక్కా ప్రణాళిక ఉందా.. కోనసీమ జిల్లా సాధన సమితి ముసుగులో అధికార పార్టీకి చెందిన నేత అనుచరులు కుట్రకు తెరతీశారా.. పోలీసులు, ఆందోళనకారులు పరస్పరం దాడులు చేసుకుంటున్న సమయంలో.. ఆ నేత పురమాయించిన మనుషులు ఇళ్లకు నిప్పుపెట్టి అమలాపురాన్ని రణరంగంగా మార్చేశారా..? మంత్రి విశ్వరూప్‌ నివాసానికి నిప్పు పెట్టిన ఘటనలో అక్కడ కనిపిస్తున్న ఆనవాళ్లు.. గుర్తుపట్టడానికి వీల్లేనంత స్థాయిలో కాలిబూడిదైన తీరు.. చూస్తుంటే అవుననే సమాధానం వస్తోంది. పక్కా ప్రణాళికతోనే దాడి జరిగిందని.. ఇందులో వైసీపీ నేతల ప్రత్యక్ష ప్రమేయం ఉందని బట్టబయలైంది. తమ పార్టీ కౌన్సిలర్‌ హస్తం ఉందని సాక్షాత్తూ మంత్రి విశ్వరూపే చెప్పడం దీనికి తార్కాణం. మంత్రి ముఖ్య అనుచరుడైన అన్యం సాయిని పోలీసులు అరెస్టు చేయడం గమనార్హం. వైసీపీకి చెందిన ఓ కీలక నేత కనుసన్నల్లోనే ఇదంతా జరిగినట్లు ప్రచారం జరుగుతోంది.


అందరికీ తెలిసే జరిగిందా?

ఎక్కడైనా ఒకచోట పెట్రోల్‌ పోసి నిప్పంటిస్తే అక్కడ, దాని పరిసరాల్లోనే ప్రభావం కనిపిస్తుంది. కానీ విశ్వరూప్‌ ఇంటి బయట, ప్రహారీ గేటు లోపల బైకులు బుగ్గిపాలయ్యాయి. ఆరు పోలీసు గన్లు   సగానికిపైగా కాలిపోయాయి. సింహద్వారం బొగ్గయింది. హాల్లో కుర్చీలు, ఫ్యాన్లు, సీలింగ్‌, కిచెన్‌, కబోర్డులు, ఫ్రిజ్‌ అన్నీ బుగ్గయిపోయాయి. అయితే కింది అంతస్తులో నిప్పుబెడితే మంటల తీవ్రత పై అంతస్తులో అధికంగా ఉండడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రోజ్‌ఉడ్‌తో తయారుచేసిన బెడ్‌రూం, హాలు తలుపులు కాలిపోయి బొగ్గులుగా మారాయి.. సీలింగ్‌ కాలిపోయి, ఫ్యాన్లు, ఏసీలకు నిప్పు ఎలా అంటుకుంటుంది.. రెండు అంతస్తుల్లోని విద్యుత్‌ వైరింగ్‌ మొత్తం ఎందుకు మసైపోతుంది..? ఇదంతా చూస్తే పక్కా ప్రణాళిక ప్రకారం తీరిగ్గా పెట్రోల్‌ పోసి తగలబెట్టినట్లు స్పష్టంగా తెలిసిపోతోంది. పైగా 15-20 లీటర్ల పెట్రోల్‌ వాడి ఉంటారు. ఒక్కో చోట పోస్తూ ఇల్లు కాల్చాలంటే అక్కడ ఆందోళనకారులు కనీసం 20 నిమిషాలు గడపాలి. పైగా అది మంత్రి ఇల్లు. భద్రతా సిబ్బంది ఉంటారు. అలాంటి ఇంట్లో పారిపోకుండా అంతసేపు గడపడం అసాధ్యం. మరోపక్క ఆందోళనలు మధ్యాహ్నం మూడు గంటల తర్వాత మొదలై నాలుగు గంటల తర్వాత తీవ్ర రూపం దాల్చాయి. 


మంత్రి ఇంటికి 5.30 సమయంలో నిప్పు పెట్టారు. అంటే రెండున్నర గంటల సమయంలో అన్ని లీటర్ల పెట్రోల్‌ను బాటిళ్లలో తెచ్చి నిప్పంటించడం సాధ్యమేనా? మంత్రి ఇంటివద్ద నలుగురు గన్‌మెన్‌ రోజంతా కాపలా కాస్తారు. అలాంటప్పుడు ఆందోళనకారులు పెట్రోలు బాటిళ్లు, రాడ్లతో వచ్చి.. కింద, పై అంతస్తుల్లో పెట్రోల్‌ పోసి నిప్పంటిస్తే భద్రతా సిబ్బంది గాల్లోకైనా కాల్పులు జరపకపోవడం పలు సందేహాలకు తావిస్తోంది. పోలీసులు కూడా కనీసం లాఠీచార్జి చేసే ప్రయత్నం చేయలేదు. చివరకు అగ్నిమాపక శాఖ కార్యాలయానికి కూడా సమాచారమివ్వలేదు. దీనినిబట్టి అందరికి తెలిసే ఇంత విధ్వంసమూ జరిగిందని అర్థమవుతోందని రాజకీయ వర్గాలు అంటున్నాయి. మంత్రి విశ్వరూప్‌ తాను ఇప్పుడున్న ఇంటికి కొన్ని కిలోమీటర్ల దూరంలోనే సుమారు రూ.5 కోట్లతో కొత్త ఇల్లు నిర్మిస్తున్నారు. ఇది ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ఆందోళనకారులకు తెలిసే అవకాశం లేదు. కేవలం ఆయన గురించి తెలిసిన వారికే సమాచారం ఉంటుంది. అక్కడకు వెళ్లి కేవలం నిర్మాణంలో ఉన్న ఇంటికి అడ్డంగా కట్టిన పరదాలు మాత్రమే కాల్చారు.


కక్షతో కాల్చినట్లు ఉంది!

మంగళవారం సాయంత్రం 5.30 సమయంలో విశ్వరూప్‌ ఇంటికి నిప్పంటించగా.. బుఽధవారం ఉదయం 11 గంటల వరకు ఇంట్లో కొన్ని వస్తువులు కాలుతూనే ఉన్నాయి. వాస్తవానికి ఈ ఇంట్లో ఆయన అద్దెకు ఉంటున్నారు. స్థానికంగా వీరభద్రరావుకు చెందిన వ్యక్తి ఇల్లు ఇది. అంతా తగులబడిపోయి.. ఎందుకూ పనికి రాకుండా మారిన ఈ గృహాన్ని చూసిన వీరభద్రరావు.. ఎవరో కక్షకట్టి కాల్చినట్లుగా ఉందని ‘ఆంధ్రజ్యోతి’తో అన్నారు. ఇంట్లో అంతా రోజ్‌వుడ్‌ వాడానని, అవన్నీ కాలిపోయి బూడిదయ్యాయని చెప్పారు. పెట్రోల్‌లో ఏదో రసాయనం కలిపితే తప్ప ఈ స్థాయిలో విధ్వంసం జరగదని అనుమానం వ్యక్తంచేశారు. కింద, పైన వరండా, గదుల్లో టైల్స్‌ కూడా ముక్కలు ముక్కలుగా ఎవరో గునపం, సుత్తితో కొట్టినట్లు పూర్తిగా ముక్కలై ఉండడం గమనార్హం.


ముందే ఆ అపార్ట్‌మెంట్లో దిగారా..?

మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు కలెక్టరేట్‌ వరకు ర్యాలీ నిర్వహించాలని జేఏసీ పిలుపిచ్చింది. అయితే ఉదయం 5 గంటల నుంచే అమలాపురం పట్టణాన్ని 405 మంది పోలీసులు అష్టదిగ్బంధం చేశారు. ఊళ్లోకి వచ్చే అన్ని దారుల వద్ద చెక్‌పోస్టులు పెట్టి తనిఖీ చేశారు. గుంపులుగా ఎవరూ రాకుండా 144 సెక్షన్‌ అమల్లోకి తెచ్చారు. దీంతో పట్టణం నిర్మానుష్యంగా మారింది. కానీ ఆ తర్వాత ఉన్నట్టుండి ఒక్కసారిగా మూడు వేల మంది వరకు అమలాపురంలో వివిధ ప్రదేశాల్లోకి ఎలా ప్రవేశించారనే దానిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికార వైసీపీ కీలకనేత  అనుచరుడికి అమలాపురం ఎస్పీ కార్యాలయం వెనుక ఓ అపార్ట్‌మెంట్‌ ఉంది. అందులో ముందురోజు రాత్రి అంటే సోమవారమే చాలా మంది వచ్చి అందులో మకాం వేసినట్లు తెలుస్తోంది. అలాగే లాడ్జీలు, హోటళ్లలో కూడా దిగారు. వీరి పేర్లేవీ రిసెప్షన్‌లో నమోదు చేయలేదు. అలాగే మంగళవారం పట్టణంలోని పెట్రోల్‌ బంకుల్లో సీసాల్లో పెట్రోల్‌ కొన్న ఆనవాళ్లు కూడా లేవు. దీనినిబట్టి ముందుగానే పెట్రోల్‌, రాడ్లు, కర్రలు సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది.


అన్యం సాయిపై ‘ఆంధ్రజ్యోతి’ కథనం అక్షర సత్యం

అమలాపురంలో విధ్వంసం వెనుక వైసీపీ నేతలు ఉన్నారని.. ‘పచ్చటి ప్రాంతంలో ప్రభుత్వ చిచ్చు’ శీర్షికన ఆంధ్రజ్యోతి కథనం ప్రచురించిన సంగతి తెలిసిందే. అదే అక్షరసత్యమైంది. ఆందోళనలు, రాళ్లదాడులు, ఇళ్లకు నిప్పు ఘటనల వెనుక అదృశ్య శక్తుల పాత్ర ఉందని ఏలూరు రేంజ్‌ డీఐజీ పాలరాజు కూడా వెల్లడించారు. ఆ తర్వాత మంత్రి విశ్వరూప్‌ మాట్లాడుతూ.. అమలాపురంలో కొందరు రౌడీషీటర్లు పెట్రోల్‌ బాటిళ్లు పట్టుకుని తమ ఇంటికి నిప్పు పెట్టారని.. కొందరు వైసీపీ కౌన్సిలర్‌తో కూడా మాట్లాడారని.. ఆ కాల్‌ రికార్డులన్నీ తన వద్ద ఉన్నాయని చెప్పారు. ఆ తర్వాత సాయంత్రం 4 గంటలకు మంత్రికి ముఖ్య అనుచరుడైన అన్యం సాయిని పోలీసులు అరెస్టు చేశారు. ఉద్యమానికి పిలుపిచ్చి.. ఆందోళనలు, ఉద్రిక్తతలు, విధ్వంసంలో ఇతడి ప్రమేయం ఉన్నట్లు నిర్ధారించుకుని అదుపులోకి తీసుకున్నారు. ఇతడు మంత్రి విశ్వరూ్‌పకు అనుచరుడని ‘ఆంధ్రజ్యోతి’ ముందే చెప్పింది. సాయి ఈ నెల 20న కలెక్టరేట్‌ వద్ద కోనసీమ జిల్లా పేరునే ఉంచాలని జరిగిన ఆందోళనలో నెత్తిన పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. మంగళవారం నాటి ఘటనల అనంతరం సాయిని బుధవారం అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, కోనసీమ ఎమ్మెల్యేలతో పాటు పలువురు ఐఏఎస్‌ అధికారులతో సాయి దిగిన ఫొటోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.