ప్రార్థనే ఆయుధం

ABN , First Publish Date - 2020-09-04T05:30:00+05:30 IST

‘అల్లాహ్‌ను ప్రార్థించే సమయంలో... ఆ ప్రార్థనను ఆయన తప్పకుండా స్వీకరిస్తాడని విశ్వసించాలి'...

ప్రార్థనే ఆయుధం

‘అల్లాహ్‌ను ప్రార్థించే సమయంలో... ఆ ప్రార్థనను ఆయన తప్పకుండా స్వీకరిస్తాడని విశ్వసించాలి'. 


‘‘మీరు నన్నే వేడుకోండి. మీ ప్రార్థనలను నేను స్వీకరిస్తాను’’ అని దివ్య ఖుర్‌ఆన్‌లో అల్లాహ్‌ ప్రకటించారు. ‘‘ఆరాధనకు సారం ప్రార్థన’’ లాంటిది అని దైవ ప్రవక్త మహమ్మద్‌ పేర్కొన్నారు. ప్రార్థన అనేది విశ్వాసి చేతిలో ఉన్న శక్తిమంతమైన ఆయుధం. దాని ముందు ఎంత పెద్ద ఆయుధాలైనా హీనమైనవే. ప్రార్థన గాయపడిన మనసుకు మందులా పని చేస్తుంది. పీడితులకు చేయూతనిస్తుంది. కష్టాల్లో ఉన్నవారికి మార్గదర్శిగా నిలుస్తుంది. 


‘‘ఓ మానవులారా! మీరందరూ దైవం ముందు యాచకులే. ఆయనపై ఆధారపడినవారే. ఆయనే స్తోత్రానికి అర్హుడు. దీనత్వం కారణంగానే మానవుడు అల్లాహ్‌ను ప్రార్థించే విషయంలో వివశుడవుతాడు. ప్రార్థన మానవుడికి ఎంతో ఆవశ్యకమైన అంశం. దేవుణ్ణి ప్రార్థించడం మానవుడి నైజం’’ అని దివ్య ఖుర్‌ఆన్‌లో అల్లాహ్‌ తెలిపారు. అర్థించడం, ఆధారపడడం అనే గుణాలు మానవుడి నైజంలోనే ఉన్నాయి. విశ్వంలో భాగ్యవంతుడు అల్లాహ్‌ మాత్రమే. మానవుడు తన అవసరాల కోసం మరో మానవుడిని ప్రార్థించడం తనను తాను మోసం చేసుకోవడమే. ఒక దీనుడు మరో దీనుడి కోరికలు తీర్చలేడు. దేవుణ్ణి వదిలేసి... జీవించిన లేదా మరణించిన మరో మానవుణ్ణి తన కోర్కెలు తీర్చాలని వేడుకోవడం ఎంతో బుద్ధిహీనమైన విషయం. 


‘‘అల్లాహ్‌ను ప్రార్థించే సమయంలో... ఆ ప్రార్థనను ఆయన తప్పకుండా స్వీకరిస్తాడని విశ్వసించాలి. ఎందుకంటే నిర్లక్ష్యపూరితమైన, సందేహంతో నిండిన మనసు నుంచి వెలువడే ప్రార్థనను అల్లాహ్‌ స్వీకరించడు’’ అని దైవ ప్రవక్త స్పష్టం చేశారు. 

విశ్వాసపూరితమైన ప్రార్థన ఎట్టి పరిస్థితుల్లోనూ తిరస్కరణకు గురికాదు. ప్రార్థించే వ్యక్తి కోరుకున్నది పొందుతాడు. లేదా రాబోయే ఆపద తప్పిపోతుంది. ఆ ప్రార్థన పరలోకంలో అతని కోసం గొప్ప ప్రతిఫలంగా మారుతుంది. కాబట్టి దైవాన్ని ప్రార్థించే వ్యక్తి ఏ విధంగానూ నష్టపోడు. 

- మహమ్మద్‌ వహీదుద్దీన్‌


Updated Date - 2020-09-04T05:30:00+05:30 IST