ప్రస్థానత్రయ భాష్యాలు

ABN , First Publish Date - 2020-09-04T06:29:34+05:30 IST

పరిపూర్ణ జ్ఞానం లేని దశ, పరిపక్వ వ్యక్తిత్వం లేని ఘట్టం డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జీవితంలో కానరావు. అందు వల్లనే కావచ్చు. నాకు అప్పుడప్పుడు...

ప్రస్థానత్రయ భాష్యాలు

ప్రాచీనార్వాచీన శాస్త్రాలలో తనకు గల అపార పరిజ్ఞానాన్ని ప్రస్థాన త్రయానికి భాష్యం చెప్పడానికి డాక్టర్ రాధాకృష్ణన్ వినియోగించారు. అందుకే ఆయన వ్రాసినవి కేవలం భాష్యాలు కావు. అవి విజ్ఞాన భాండాగారాలు. ప్రాచీన చింతనకు నవీనార్థాలను ప్రవచిస్తాయి. గతానికి జీవాన్ని పోసి, వర్తమానానికి సార్థక్యాన్ని కల్పించి , భవిష్యత్తుకు కరదీపికలను సమకూర్చుతాయి. పాండిత్య ప్రదర్శనకు కాక, కర్తవ్య నిర్దేశానికై ఉద్దేశించబడిన భాష్యాలవి.


పరిపూర్ణ జ్ఞానం లేని దశ, పరిపక్వ వ్యక్తిత్వం లేని ఘట్టం డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జీవితంలో కానరావు. అందు వల్లనే కావచ్చు. నాకు అప్పుడప్పుడు అనిపిస్తూవుంటుంది -కర్ణుడు సహజ కుండలాలతో పుట్టినట్టు, ఆయన శిరోవేష్ఠవంతో జన్మించారేమో అని!


ఇంగ్లీషులోకి ప్రస్థానత్రయం (భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు) అను వాదం, వాటిపై వ్యాఖ్యానం; దమ్మపదం అనువాదం, దానికి కూడా భాష్యం... -ఈ కృషి ఆచార్యత్రయం సరసన డాక్టర్ రాధాకృష్ణన్‌కు స్థానం సంపాదించి పెట్టింది. నిజానికి వారి కృషి కంటే ఈయనదే గొప్పది. అది గీర్వాణ భాషలో జరగగా, ఇది మ్లేచ్ఛ భాషలో జరిగిందని ఈసడించనక్కరలేదు. ఎవరితోనో సంభాషిస్తూ డాక్టర్ రాధాకృష్ణన్ స్వయంగా అన్నట్టు మధ్యయుగంలో కాక, ఆధునిక కాలంలో ఆదిశంకరాచార్యుడు తన రచనలు చేసి ఉంటే, ఇంగ్లీషునే ఆయన విధిగా వినియోగించుకొని ఉండేవారు. హైందవ ధర్మాన్ని, దాని దార్శనిక శాస్త్రాలను, వాటి సందేశాన్ని ప్రచారం చేయడానికి మన దేశంలోనే కాక, దేశ దేశాలలో ఆయన తన పీఠాలను నెలకొల్పి ఉండేవారు. హిందూ ధర్మ శాస్త్రాలకే కాక, ప్రాక్ప్రతీచీ దర్శనాలన్నింటికి మధ్య సమన్వయ సాధనకు యత్నించి ఉండేవారు. ఈ బృహత్తర కృషికి ఆయనకు, డాక్టర్ రాధాకృష్ణన్‌కు వలె, నేడు ప్రపంచ భాషగా చెల్లుతున్న ఇంగ్లీషు అవసరమై ఉండేది. 


ప్రస్థాన త్రయానికి డాక్టర్ రాధాకృష్ణన్ భాష్యం ఆధునిక దృష్టితో జరిగింది; అపూర్వ పాండితితో జరిగింది. సోక్రటీస్ మొదలు సాత్రే వరకు పాశ్చాత్య దార్శనిక శాస్త్రవేత్తల రచనలన్నీ ఆయనకు కంఠోపాఠం. భగవద్గీతను మననం చేసినంత శ్రద్ధాసక్తులతో ఆయన బైబిల్ మొదలైన క్రైస్తవ మతగ్రంథాలను అధ్యయనం చేశారు. చైనీస్ తత్వవేత్తలను గురించి ఆయనకు తెలియని విషయాలు తెలుసుకోదగినవి కావు. ఖురాన్ ఆయనకు కొట్టిన పిండి, సూఫీ తత్వాన్ని ఆయన మథించారు. 


అన్ని మత గ్రంథాలలోనే కాక, అన్ని దార్శనిక శాస్త్రాలలోనే కాక, తర్క మానసిక, సాంఘికాది శాస్త్రాలలో కూడా డాక్టర్ రాధాకృష్ణన్ మహా పండితుడు. మ్యాజినీ వలె మార్క్స్ ఆయనకు సుపరిచితుడు. రూసో వలె రస్సెల్ ఆయనకు సన్మిత్రుడు. బర్క్‌ వలె బ్రూమ్ ఆయనకు ఆత్మబంధువు. క్రొపాట్కిన్‌తో వలె క్రోచేతో ఆయనకెంతో సాన్నిహిత్యం. మిల్‌నే కాక మోర్లేని కూడా ఆయన చనువుగా పలకరించగలరు. ఫ్రేజర్ వలె ఫ్రాయిడ్‌తో ఆయన చర్చకు దిగగలరు. విశ్వ విశాలమైంది ఆయన పరిజ్ఞానం. ఒక మహా విజ్ఞాన సర్వస్వంతోనే ఆయనను పోల్చవచ్చు. 


ప్రాచీనార్వాచీన శాస్త్రాలతో తనకు గల అపార పరిజ్ఞానాన్ని ప్రస్థాన త్రయానికి భాష్యం చెప్పడానికి డాక్టర్ రాధాకృష్ణన్ వినియోగించారు. అందుకే ఆయన వ్రాసినవి కేవలం భాష్యాలు కావు. అవి విజ్ఞాన భాండాగారాలు. భిన్నత్వంలో అవి ఏకత్వాన్ని సాక్షాత్కరింపజేస్తాయి. వైరుధ్యాల మధ్య సమానత్వాన్ని సాధిస్తాయి. ప్రాచీన చింతనకు నవీనార్థాలను ప్రవచిస్తాయి. గతానికి జీవాన్ని పోసి, వర్తమానానికి సార్థక్యాన్ని కల్పించి, భవిష్యత్తుకు కరదీపికలను సమకూర్చుతాయి. పాండిత్య ప్రదర్శనకు కాక, కర్తవ్య నిర్దేశానికై ఉద్దేశించబడిన భాష్యాలవి. సిద్ధాంత రాద్ధాంతాల ప్రతిపాదనకు కాక, మానవోద్ధరణకై జగత్కళ్యాణానికై ఉద్ధిష్టమైనవి. అపూర్వమైనది వాటి సమ్యగ్దృష్టి. అసాధారణమైనది వాటి సందేశం.


రాష్ట్రపతి రాధాకృష్ణన్ ‘అద్వైతవాది’ అని కొందరంటారు. శంకరాద్వైతంలో, రామానుజాచార్యుల విశిష్టాద్వైతాన్ని కొంతవరకు మేళవింపజేస్తున్నారని కొందరంటారు. ‘వేదాంత పరిభాషను వాడినా ఆయన మానవవాది మాత్రమే’ అని నేనంటాను.

1963 సెప్టెంబర్ 5న ప్రచురితమైన

‘రాష్ట్రపతి రాధాకృష్ణన్’ పుస్తక పీఠిక నుంచి

Updated Date - 2020-09-04T06:29:34+05:30 IST