ప్రశాంతమే ఆయన భూషణం..

ABN , First Publish Date - 2020-09-06T17:04:20+05:30 IST

తీర్పు చెప్పే వాళ్లను ప్రశ్నించకూడదా? అందుకు సుప్రీంకోర్టు జడ్జిలు అతీతులా? అనుకున్నాడేమో ప్రశాంత్‌భూషణ్‌.. సందర్భం వచ్చినప్పుడల్లా సీజేలను ప్రశ్నిస్తూనే ఉన్నాడు. ఈ మధ్య చీఫ్‌ జస్టిస్‌ బోబ్డే అత్యంత ఖరీదైన హార్లీడేవిడ్‌సన్‌ బైకుపై మాస్కు, హెల్మెట్‌ లేకుండా కూర్చున్నాడు అంటూ ప్రశాంత్‌ ట్వీట్‌ చేశాడు...

ప్రశాంతమే ఆయన భూషణం..

తీర్పు చెప్పే వాళ్లను ప్రశ్నించకూడదా? అందుకు సుప్రీంకోర్టు జడ్జిలు అతీతులా? అనుకున్నాడేమో ప్రశాంత్‌భూషణ్‌.. సందర్భం వచ్చినప్పుడల్లా సీజేలను ప్రశ్నిస్తూనే ఉన్నాడు. ఈ మధ్య చీఫ్‌ జస్టిస్‌ బోబ్డే అత్యంత ఖరీదైన హార్లీడేవిడ్‌సన్‌ బైకుపై మాస్కు, హెల్మెట్‌ లేకుండా కూర్చున్నాడు అంటూ ప్రశాంత్‌ ట్వీట్‌ చేశాడు. అది దేశవ్యాప్తంగా సంచలనమైంది. కోర్టు ధిక్కరణ వరకు వెళ్లింది. ఈ మధ్యనే ఆయనపై సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. రూపాయి చెల్లించు, లేదంటే మూన్నెళ్లు జైల్లో కూర్చో.. అంది. ఇంతకూ నిత్యం వివాదాల్లో కనిపించే ప్రశాంత్‌భూషణ్‌ నేపథ్యం ఏంటి? ఆయన న్యాయవాదిగా ఎవరి పక్షం?...





అది అలహాబాదు కోర్టు..

బయట విలేకర్లు.. లోపల న్యాయవాదులతో కిక్కిరిసి ఉంది.. గంభీరమైన వాతావరణం.. ఒక కీలకమైన కేసు విచారణకు రాబోతోంది.. తీర్పులు, న్యాయాన్యాయాలను పక్కనపెడితే.. అధికారంలో ఉండే నాయకులపై వాదించేందుకు ఏ న్యాయవాది ముందుకు వస్తాడు? అందునా ఆమె దేశ ప్రధాని.. మహా మొండిఘటం.. ఇందిరాగాంధీ. ఆ రోజుల్లో ఆమె చెప్పిందే వేదం.. చేసిందే శాసనం. రాయ్‌బరేలీలో ఆమె చేతిలో ఓడిపోయిన ప్రత్యర్థి అభ్యర్థి రాజ్‌నరైన్‌ కోర్టుకు ఎక్కాడు. ఎన్నికల్లో అవకతవకలు జరిగాయన్నది ఆయన అభియోగం. 

ఏ లాయరు ముందుకు రాని ఆ కేసును వాదించేందుకు ఒక లాయర్‌ నల్లకోటు తొడుక్కుని బయలుదేరాడు. గొంతులేని వాళ్లకు ఆయన గొంతు. ఆరడుగుల ఆజానుభాహువుడు.. చేతిలో ఫైళ్ల కట్టను పట్టుకుని కోర్టులోకి అడుగుపెట్టాడు. ప్రధానికి వ్యతిరేకంగా వాదించే లాయరు. ఏం జరుగుతుందోనని అందరూ కళ్లప్పగించి చూస్తున్నారు. ఆ దృశ్యంలోని గంభీరత, ప్రాధాన్యం తెలిసేంత వయసులేని ఓ కుర్రాడు మాత్రం.. కోర్టు హాల్లో కూర్చుని పరిశీలిస్తున్నాడు. ఆ కేసు విచారణలో ఒకటి మాత్రం అర్థమైంది. మన దేశంలో ఎవరు ఏ స్థాయిలో, ఎంత పెద్ద పదవుల్లో ఉన్నాసరే.. కోర్టులో నిలబెట్టవచ్చు. తప్పు చేశారనిపిస్తే న్యాయం కోరవచ్చు.. అన్నది మాత్రం తెలిసింది. ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా కోర్టులో వాదించిన ఆ పెద్దాయన శాంతిభూషణ్‌. ఆయన వాదోపవాదాల్ని గ్యాలరీలో కూర్చుని శ్రద్ధగా వింటున్న ఆ కుర్రాడు ప్రశాంత్‌భూషణ్‌. ఇద్దరూ తండ్రీకొడుకులు. 

ఒక్క క్లాసు పీకకుండా తను చెప్పాల్సింది కొడుక్కు చెప్పాడు ఆ తండ్రి. న్యాయవ్యవస్థకున్న శక్తి ఏమిటో కళ్లకు కట్టినట్లు చూపించిన నాన్నకు ధన్యవాదాలు చెప్పుకున్నాడు ప్రశాంత్‌భూషణ్‌. అయితేగియితే లాయరే అవ్వాలి. కుళ్లిపోయిన వ్యవస్థతో, అవినీతి అనకొండలతో, పర్యావరణాన్ని పీక్కుతింటున్న కార్పొరేట్లతో చెడుగుడు ఆడాలని అప్పుడే ప్రతిన పూనాడు. మానవహక్కులకు తనొక దిక్కు అవ్వాలనుకున్నాడు. 

ప్రశాంత్‌ సున్నిత మనస్కుడు. మద్రాసు ఐఐటీలో సీటు వచ్చింది. ఒక సెమిస్టర్‌ కూడా పూర్తి కాకుండానే చెల్లిపై ఉన్న బెంగతో ఇంటికి వచ్చేశాడు. హోమ్‌సిక్‌ను భరించలేకపోయాడు. తనకు తత్వవేత్త కావాలన్న కోరిక ఎప్పటి నుంచో ఉండేది. తత్వ, ఆర్థిక, రాజకీయశాస్త్రల సమ్మిళిత బీఎస్సీ చేశాడు. ఉన్నత చదువుల కోసం ప్రిన్స్‌టన్‌ విశ్వవిద్యాలయానికి వెళ్లాడు. అక్కడ స్కాలర్‌షిప్‌ కూడా వచ్చింది. ఫిలాసఫీ ప్రధాన సబ్జెక్టు. అది కూడా పూర్తి చేయకుండా ఇండియాకు వచ్చేశాడాయన. లా ప్రాక్టీస్‌ మొదలుపెట్టాడు. ‘మా నాన్న వాదించిన ఓ హైప్రొఫైల్‌ కేసు (ఇందిరాగాంధీ కేసు) నాకు ప్రేరణ. అన్యాయంపై పోరాడేందుకు న్యాయవ్యవస్థను మించిన ఆయుధం మరొకటి లేదు..’ అంటారాయన. 1978లోనే ‘ద కేస్‌ దట్‌ షుక్‌ ఇండియా’ అనే పుస్తకం రాశాడు. దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన భోపోర్స్‌ కుంభకోణంపై.. ‘భోఫోర్స్‌ ద సెల్లింగ్‌ ఆఫ్‌ ఎ నేషన్‌’ (1990) మరో పుస్తకం రాశాడు. 1983లో లా ప్రాక్టీస్‌ మొదలుపెట్టాడు ప్రశాంత్‌భూషణ్‌. నాకు ఇప్పటికీ గుర్తు. ఆ రోజు పర్యావరణవేత్త వందనా శివ నా వద్దకు వచ్చింది. డూన్‌ వ్యాలీలో జరుగుతున్న మైనింగ్‌ను అడ్డుకోవాలంది. అలా తొలి ప్రజాప్రయోజన వాజ్యం (పిఐఎల్‌) వేశాం.. అని ఒక ఇంటర్వ్యూలో గుర్తుచేసుకున్నాడాయన. ఆయన వేసిన రెండో పిల్‌ - సిక్కు వ్యతిరేక అల్లర్ల బాధితులకు న్యాయం కావాలని. అక్కడి నుంచి ఆయన లాయర్‌ ప్రయాణం వేగంగా మొదలైంది. భోపాల్‌ గ్యాస్‌ దుర్ఘటన బాధితులకు పరిహారం కోరుతూ న్యాయసేవలు అందించాడు. ఆయన క్లయింట్లు అందరూ అభాగ్యులు, బాధితులు, హక్కులను, స్వేచ్ఛను కోల్పోయి.. న్యాయం కోసం అర్ధించే వాళ్లు. వీధుల్లోనూ, తోపుడుబండ్లతో బతికే చిరు వ్యాపారులు, పారిశుద్ధ్య కార్మికులు, రిక్షావాలాలు.. ఇలా ఎంతోమంది తరఫున వాదించాడు. మరోవైపు నిబంధనలు ఉల్లంఘించి, అవినీతికి పాల్పడే కార్పొరేట్‌ కంపెనీలకు చుక్కలు చూపించాడు. నర్మదా డ్యామ్‌, భోఫోర్స్‌, ఎన్‌రాన్‌, ప్రసారభారతి, ఎంటీఎన్‌ఎల్‌, సెబీ, వాక్సినేషన్‌, కశ్మీర్‌లో హక్కుల ఉల్లంఘన, ఆదివాసీల డిమాండ్లు, టూజీ స్పెక్ట్రమ్‌, రాడియా టేపులు, గోద్రా అనంతర అల్లర్ల కేసులు.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో కేసుల్లో న్యాయసేవల్ని అందించాడాయన. టూజీ స్పెక్ట్రమ్‌ కుంభకోణంలో రతన్‌టాటా, అనిల్‌అంబానీపై కూడా విచారణ చేయాలని డిమాండ్‌ చేశాడు. గోద్రా అనంతర అల్లర్ల కేసుల్లో కూడా అమికస్‌ క్యూరీగా ఉన్నాడు. 


ఎక్కడైతే సామాజిక ప్రయోజనం ఉంటుందో అక్కడ ప్రశాంత్‌భూషణ్‌ వాదన కనిపిస్తుంది. ప్రజాప్రయోజన వాజ్యాలు దాఖలు చేయడంలో ఆయన దిట్ట. జస్టిస్‌ పీఎస్‌ భగవతి 1986లో ప్రవేశపెట్టిన ప్రజాప్రయోజన వాజ్యానికి నిజమైన ప్రయోజనం తీసుకొచ్చిన అతికొద్దిమందిలో ప్రశాంత్‌ ఒకరు. ఆయన తన ముప్పయి ఏళ్ల న్యాయవాద వృత్తిలో సుమారు ఐదొందల పిల్‌లు దాఖలు చేశాడు. జనలోక్‌పాల్‌ బిల్లు ముసాయిదాను తయారుచేసింది కూడా ఆయనే. అన్నాహజారేతో కలిసి అవినీతి వ్యతిరేక ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నాడు. ఆయన ముక్కుసూటి తత్వానికి ఎన్నో వివాదాల్లో ఇరుకున్నాడు. వార్తల్లో వ్యక్తి అయ్యాడు. అయినాసరే, ఎవరేమనుకున్నా.. తను తనలానే ఉంటున్నాడు. ప్రశాంతంగానే అనుకున్నది చేస్తున్నాడు.  

 - సండే డెస్క్‌


Updated Date - 2020-09-06T17:04:20+05:30 IST