ప్రజల సిరులు ప్రైవేటు పాలు

ABN , First Publish Date - 2021-09-16T06:19:21+05:30 IST

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన దరిమిలా లాభాలు ఆర్జిస్తున్న ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరించే లేక అమ్మివేసే (దీనినే -వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ అంటారు) ప్రక్రియను ప్రత్యేక శ్రద్ధాసక్తులతో...

ప్రజల సిరులు ప్రైవేటు పాలు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన దరిమిలా లాభాలు ఆర్జిస్తున్న ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరించే లేక అమ్మివేసే (దీనినే -వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ అంటారు) ప్రక్రియను ప్రత్యేక శ్రద్ధాసక్తులతో అమలు చేసేందుకు కృషి చేస్తూ ఉంది. దేశ ప్రజానీకానికి పలువిధాలుగా సేవలందిస్తున్న ప్రభుత్వరంగ సంస్థలు భారతీయ రైల్వేలు, ఎయిర్‌పోర్టులు, సీపోర్టులు, పవర్‌గ్రిడ్‌, ట్రాన్స్‌మిషన్‌ లైన్లు, జాతీయ రహదార్లు మున్నగువాటిని దేశీయ, విదేశీ బడా కార్పోరేట్‌ కంపెనీలకు అప్పగించడం కోసం ‘మానిటైజేషన్‌ పైప్‌ లైన్‌’ విధానాన్ని శరవేగంగా అమలుచేసేందుకు పూనుకున్నది. గతంలో నష్టాలతో నడుస్తున్న ప్రభుత్వరంగ సంస్థలలో కొంతవాటాను కానీ, సంస్థను పూర్తిగా కానీ అమ్మివేసే ప్రక్రియ ఆర్థిక సంస్కరణలలో భాగంగా కొనసాగుతూ వస్తోంది. 2014కి పూర్వం పదేండ్లు అధికారంలో ఉన్న యూపీఏ ప్రభుత్వాల హయాంలో ఆ ప్రైవేటైజేషన్‌ ప్రక్రియ నిదానంగా కొనసాగుతూ వచ్చింది. కొన్ని సంస్థలలో 25శాతం లోపు పబ్లిక్‌ ఇష్యూ ద్వారా కొంతమేరకు ప్రైవేటీకరణ జరిగింది. 


2019 సార్వత్రిక ఎన్నికలలో లోక్‌సభలో తిరుగులేని మెజారిటీ సాధించిన బిజెపి ప్రభుత్వరంగ సంస్థలను, ప్రభుత్వ ఆస్తుల (ప్రజా ఆస్తులు)ను కారుచౌకగా బడా పెట్టుబడిదారులకు అప్పజెప్పేందుకు దృఢనిశ్చయంతో ముందుకు సాగుతోంది. ఈ అమ్మకాలను సదరు ప్రభుత్వరంగ సంస్థలలో పనిచేస్తున్న కార్మికులు, ఉద్యోగులకు మాత్రమే సంబంధించిన వ్యవహారంగా ప్రజలు భావించకూడదు. స్వాతంత్య్రం పొందిన తొలినాళ్ళలో టాటా, బిర్లా లాంటి కొద్దిమంది బడా పారిశ్రామికవేత్తలు తప్ప, దేశం పారిశ్రామికంగా అభివృద్ధి చెందేందుకు అవసరమైన పెట్టుబడులు పెట్టగల స్థోమత ప్రైవేట్‌రంగానికి లేకపోయింది. తత్కారణంగా విద్యుదుత్పత్తి, ట్రాన్స్‌మిషన్‌, రైల్వేలు, జాతీయ రహదారులు, పెట్రోలియం, ఫార్మాస్యూటికల్‌, నౌకాశ్రయాలు, ఎయిర్‌పోర్టులు, వంటి వాటిలో ప్రభుత్వరంగ సంస్థలు ఏర్పాటయ్యాయి. ప్రజలు పన్నుల రూపంలో చెల్లించిన ధనం, బ్యాంకుల నుంచి రుణాలు, కార్మికులు, ఉద్యోగుల శ్రమ వగైరాలతో ఈ సంస్థలు అభివృద్ధి చెందాయి. వివిధ రాష్ట్రాలలో ప్రభుత్వరంగ సంస్థల ఏర్పాటు వల్ల కొంతమేరకు అభివృద్ధి వికేంద్రీకరణ జరగడంతోపాటు, వాటికి అనుబంధంగా ప్రైవేట్‌ రంగంలో కొన్ని పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. ఉదాహరణకు హైదరాబాద్‌లో ఐడిపిఎల్‌ ఏర్పాటు  కావడంతో అనంతరకాలంలో పలు ఫార్మాస్యూటికల్‌ సంస్థలు ఏర్పాటయ్యాయి. దీనితో హైదరాబాదుకు విశిష్టస్థానం లభించింది. ప్రభుత్వరంగ సంస్థలయినందున రిజర్వేషన్‌ సూత్రాన్ననుసరించి ఎస్‌సి, ఎస్‌టి వర్గాలకు చెందిన వారికి ఉపాధి లభించి, కొంతమేరకు సామాజిక న్యాయం జరిగింది. 


మోదీ సర్కార్ కొద్ది సంవత్సరాలుగా ప్రభుత్వరంగ సంస్థలకు ఉన్న రిజర్వ్‌ను, మిగులు మొత్తాలను వ్యూహాత్మకంగా ఉపసంహరిస్తూ వాటి విలువ తగ్గేందుకు పావులు కదిపింది. ప్లానింగ్‌ కమిషన్‌ స్థానంలో ఏర్పాటైన ‘నీతి ఆయోగ్‌’కు ఏఏ సంస్థలను ప్రైవేటీకరించాలో సూచించాల్సిన బాధ్యతను అప్పగించింది. 38 సంస్థలను ప్రైవేటీకరించాలని, 26 సంస్థలను మూసివేయాలని, 10 సంస్థలను అమ్మివేయాలని నీతి ఆయోగ్‌ సూచించింది. 50శాతం షేర్‌ హోల్డింగ్‌ కన్నా తక్కువ శాతాన్ని ప్రైవేటీకరించినప్పుడు ప్రభుత్వ ఆధ్వర్యంలోనే సంస్థ కొనసాగుతుంది. సదరు సంస్థకు మార్కెట్‌లో షేర్‌ వాల్యూ ప్రకారం కొంత ధనం చేకూరుతుంది. ప్రభుత్వరంగ సంస్థను అమ్మినపుడు, మేనేజ్‌మెంట్‌ మార్పిడి జరిగినపుడు సదరు సంస్థ రిజర్వ్‌ ప్రైస్‌ లెక్కించేటప్పుడు, ఆ సంస్థకు ఉన్న భూమి, ఇతర భౌతిక ఆస్తుల మార్కెట్‌ విలువను కూడా జోడించాలని డిజిన్వెస్ట్‌మెంట్‌ కమిషన్‌ సూచించింది. కేంద్రప్రభుత్వ ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తి కాంతదాస్‌ 2016 మార్చి 4న చేసిన ఒక ప్రకటనలో పిఎస్‌యుని అమ్మేస్తున్నప్పుడు సందర్భంలో, యాజమాన్యం ప్రభుత్వం నుంచి కొనుగోలుదారునికి మారిన సందర్భంలో భూమి విలువను కూడా రిజర్వ్‌ప్రైస్‌లో చేర్చుతామని స్పష్టంగా చెప్పారు. అయితే మోదీ ప్రభుత్వం విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌, బిపిసిఎల్‌ వంటి పలు సంస్థల స్ట్రాటజిక్‌ అమ్మకాల విషయంలో ఈ సూత్రాన్ని విస్మరించడం పలు అనుమానాలకు తావిస్తోంది. విమానాశ్రయాల ప్రైవేటీకరణ సందర్భంగా ఒకే సంస్థకు రెండింటిని మించి ఇవ్వరాదని ఉన్నతస్థాయి కమిటీ చేసిన సిఫారసును ప్రక్కనపెట్టి గౌతమ్ అదానీకి 6 ఎయిర్‌పోర్టులను కట్టబెట్టడం, సిబిఐతో దాడులు నిర్వహించి ప్రైవేట్‌ సంస్థ యాజమాన్యాలను భయపెట్టి సదరు సంస్థలను అదానీ ఖాతాలోకి వెళ్ళేట్లు కృషిచేయడం వంటి కారణాల వల్ల ఆ రెండు సంస్థలను గౌతమ్ అదానీ, ముఖేష్‌ అంబానీ, అనిల్‌ అంబానీలకు కట్టబెట్టేందుకే మోదీ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నట్లు ప్రజలు భావిస్తున్నారు. 


ప్రజల సుదీర్ఘ పోరాటం, ఎంపీలు, -ఎంఎల్‌ఎల రాజీనామాలు, 32మంది ఆంధ్రుల ప్రాణత్యాగం ఫలితంగా ఏర్పాటైన ఉక్కు ఫ్యాక్టరీని ఈనాడు నూటికి నూరుశాతం అమ్మివేయడం గానీ, మూసివేయడం గానీ జరుగుతుందని ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్‌ పదేపదే ప్రకటిస్తున్నారు. దాదాపు 20వేల ఎకరాలు స్టీల్‌ప్లాంట్‌ కింద ఉంది. ఆ భూమి బుక్‌వాల్యూను రూ.56 కోట్లుగా ప్రభుత్వం లెక్కవేస్తోంది. మార్కెట్‌ విలువ కనీసం రూ.60 వేల కోట్లు ఉంటుంది. సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నప్పటికీ వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ రిజర్వ్‌ప్రైస్‌ గురించి సమాచారాన్ని కేంద్రం ప్రకటించకపోవటం దుర్మార్గం. అలాగే లక్షల కోట్లు రూపాయల ఆస్తులతో వేలకోట్లు లాభాలను ఆర్జిస్తున్న 2వ అతి పెద్ద చమురు సంస్థ బిపిసిఎల్‌ను కొద్ది వేల కోట్ల రూపాయలకే అమ్మివేయాలనుకోవడం అత్యంత దురదృష్టకరం. ప్రభుత్వ ఆస్తుల అమ్మకం ద్వారా లభించే ధనాన్ని తిరిగి నూతనంగా మౌలిక వసతులు కల్పించేందుకు, విద్యా, వైద్య రంగాలలో ఖర్చుచేయడానికి వినియోగిస్తామని ప్రభుత్వం చెబుతోంది. దీర్ఘకాలం కిందట అత్యంత తక్కువ ధరలలో భూములను, పరిశ్రమలను, మౌలిక వసతులను ఏర్పాటు చేసుకుని, అభివృద్ధి చేసినవాటిని 25 నుంచి 50 సంవత్సరాల కాలవ్యవధితో కారుచౌకగా బదలాయిస్తూ, ఇప్పుడు కొత్తగా మౌలిక వసతులను పెంపొందిస్తామని చెప్పడం కంటే నయవంచన మరొకటి ఉండదు. 


మోదీ ప్రభుత్వం ఇంతవేగంగా ప్రభుత్వరంగ సంస్థలను అమ్మాలనుకోవడం, ‘మానిటైజేషన్‌ పైప్‌లైన్‌’ అమలుచేయాలనుకోవడానికి బలమైన కారణం ఉంది. యుపిఎ ప్రభుత్వంలో కంటే మోదీ ప్రభుత్వంలో బడా కార్పొరేట్‌ సంస్థలకు చాలా హెచ్చుస్థాయిలో రుణాల మంజూరు ప్రక్రియ కొనసాగడమే కాక మొండిబాకీల పరిమాణం చాలా అధిక స్థాయికి చేరింది. 2013–14 నాటికి బ్యాంకులకు తిరిగి రాకపోవచ్చని భావించిన రుణాల మొత్తం రూ.2.05 లక్షల కోట్లుగా ఉండగా 2018–19 నాటికి ఆ మొత్తం 11.73లక్షల కోట్లకు పెరిగింది. మనదేశంలో బ్యాంకింగ్‌ వ్యవస్థ ద్వారా బట్వాడా అవుతున్న రూ.100 రుణంలో రూ.16లు కేవలం 20 అధిక స్థాయి రుణగ్రహీతల ఖాతాలకు వెళ్తోంది. 2018–19లో కూడా ఈ 20 ఖాతాల మొత్తం రుణాల పరిమాణం రూ.10.94 లక్షల కోట్ల నుంచి రూ.13.55 లక్షల కోట్లకు పెరిగింది. మొత్తం పారిశ్రామిక రంగంలో ఉన్న 10 కోట్ల చిన్న, సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలలో 30 కోట్ల మంది ఉపాధి పొందుతున్నారు. భారీ పరిశ్రమల రంగంలో కేవలం 1 కోటి మందికి ఉపాధి లభిస్తోంది. భారీ పారిశ్రామికరంగానికి రూ.24 లక్షల కోట్లు, సూక్ష్మ, చిన్న పరిశ్రమలకు 3.75 లక్షల కోట్లు, మధ్యతరహా పరిశ్రమలకు రూ.1.06 లక్షల కోట్లు రుణం లభించింది. మొత్తం పారిశ్రామికరంగానికి అందిన రుణ సదుపాయంలో 50శాతం పైన ఈ 20 అధికస్థాయి రుణగ్రహీతలకు లభించడం ఆశ్చర్యకరం. కార్పొరేట్లు లక్షల కోట్ల రూపాయలు తిరిగి చెల్లించనందున కేంద్రప్రభుత్వం రిజర్వ్‌ బ్యాంకు ద్వారా బ్యాంకులకు ‘క్యాపిటల్‌ ఇన్‌ఫ్యూజన్‌’ చేస్తూ ఉంటుంది. యుపిఎ ప్రభుత్వం ఏడేళ్లలో రూ.68,000 కోట్లు బ్యాంకులకు అందచేయగా మోదీ సర్కార్ కేవలం ఐదేళ్లలో రూ.3,20,000 కోట్లు ‘క్యాపిటల్‌ ఇన్‌ఫ్యూజన్‌’ కింద అందజేసింది. ప్రస్తుతం కేంద్రప్రభుత్వ రుణభారం జూన్‌ 2019లో రూ.88 లక్షల కోట్లుగా ఉండగా, జూన్‌ 2020 నాటికి రూ.101 లక్షల కోట్లకు పెరిగింది. ఈ నేపథ్యంలోనే నరేంద్ర మోదీ ప్రభుత్వం అడ్డగోలుగా లక్షలాది కోట్ల రూపాయల ప్రభుత్వరంగ ఆస్తులను, రిటైల్‌ ఫుడ్‌ రంగాన్ని బడా కార్పోరేట్లకు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తోంది. బ్రిటీష్‌ హయాంలో పలు రూపాలలో భారతీయ సంపదను తరలించుకుపోయిన కారణంగానే, కొద్ది శతాబ్దాల క్రితం ప్రపంచంలోనే అత్యధిక జిడిపి గల భారత్‌, స్వాతంత్య్రం పొందేనాటికి ఆర్థికంగా క్షీణదశకు చేరుకుంది. ఒకవైపు రైతులకు, మరొక వైపున సంఘటితశక్తి ద్వారా దీర్ఘకాల పోరాటాల ద్వారా శ్రామికవర్గం సాధించుకున్న ప్రయోజనాలకు భంగం కలిగిస్తూ నాలుగు లేబర్‌కోడ్‌లను తీసుకురావడం, మరొకవంక అత్యధికస్థాయిలో ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్లకు కట్టబెట్టడం వంటి దుర్విధానాల వల్ల కోట్లాది ప్రజానీకం ఆర్థిక పరిస్థితులు మరింత దిగజారే ప్రమాదం ఎంతైనా ఉంది. ఈ వాస్తవాన్ని అర్థం చేసుకుని, ఇప్పుడు రైతులు, పారిశ్రామిక కార్మికులు, ప్రజాసంఘాలు యావన్మంది ఏకమై, మానిటైజేషన్ ప్రక్రియకు అడ్డుకట్ట వేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. 

వడ్డే శోభనాద్రీశ్వరరావు

Updated Date - 2021-09-16T06:19:21+05:30 IST