ప్రజాహితమే ‘పరిపాటి’గా...

ABN , First Publish Date - 2022-04-07T07:01:43+05:30 IST

స్వాతంత్ర్యోద్యమ లక్ష్యాల స్ఫూర్తితో స్వాతంత్ర్యానంతర రాజకీయ ఉద్యమాలలో పాల్గొన్న ఉదాత్త నాయకుడు పరిపాటి జనార్ధనరెడ్డి. నమ్మిన ప్రమాణాలను వదులుకోలేక చివరి దశలో రాజకీయాలకు దూరంగా...

ప్రజాహితమే ‘పరిపాటి’గా...

పరిపాటి జనార్ధనరెడ్డి : (1935-–2022)

స్వాతంత్ర్యోద్యమ లక్ష్యాల స్ఫూర్తితో స్వాతంత్ర్యానంతర రాజకీయ ఉద్యమాలలో పాల్గొన్న ఉదాత్త నాయకుడు పరిపాటి జనార్ధనరెడ్డి. నమ్మిన ప్రమాణాలను వదులుకోలేక చివరి దశలో రాజకీయాలకు దూరంగా ఉన్న ఈ అరుదైన నాయకుడు గత నెల 28న హైదరాబాదులో మరణించారు.


కరీంనగర్ జిల్లా వీణవంక మండలం పోతిరెడ్డిపల్లికి చెందిన జనార్ధనరెడ్డి విద్యార్థి దశ నుంచే ఉద్యమాల పట్ల, రాజకీయాల పట్ల ఆసక్తి కనపరిచారు. వీరి అన్న పరిపాటి ఉమారెడ్డి (1929-2013)  సోషలిస్ట్ నాయకులు. వరంగల్ మేయర్ గా, ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆయన ప్రేరణతో ఉస్మానియా యూనివర్సిటీలో ఎం.ఎ పూర్తిచేసి 24 ఏళ్లకే జమ్మికుంట నుంచి సమితి అధ్యక్ష పదవికి నామినేట్ అయ్యారు. ఆ తర్వాత వరుసగా రెండుసార్లు హుజురాబాదు తాలుకా సమితి ప్రెసిడెంట్ గా ఎన్నికలలో పోటీ చేసి గెలిచారు.


విద్యార్థులు చదువుకునేందుకు కాలేజీలు లేని రోజుల్లో 1965లో జమ్మికుంటలో ఆదర్శ డిగ్రీ కళాశాలను కేవీ నారాయణరెడ్డితో కలిసి స్థాపించారు. కాగజ్ నగర్ మొదలుకొని జనగామ వరకు రైలుమార్గంలో ఉన్న విద్యార్థులకు ఈ కాలేజీలో చదువుకునే అవకాశం కలిగింది. 1982లో ఇది ప్రభుత్వ యాజమాన్యంలోకి వెళ్ళింది. జమ్మికుంట పట్టణానికి చాలాకాలం తాగునీటి సమస్య తీవ్రంగా ఉండేది. సరాబు రాంగోపాల్ రావు సహకారంతో మానేర్ నది నుంచి పైప్ లైన్ వేయించి ఆ సమస్యను అధిగమించారు. ఆ రోజుల్లో కుష్టువ్యాధి కూడా ఒక భయంకరమైన సమస్య. వీరు లెప్రా సొసైటీలో సభ్యులై 1968లో హిందూ కుష్టు నివారణ్ సంఘ్ స్థాపించారు. దాని ఆధ్వర్యంలో 30 పడకల ఆసుపత్రిని, కుష్టువ్యాధిగ్రస్తుల పిల్లల కోసం జమ్మికుంటలో ఆశ్రమ పాఠశాలను స్థాపించారు. కరీంనగర్ జిల్లా తనుగుల గ్రామంలోనూ నల్గొండ జిల్లా రెడ్లరేపాక, మల్కాపూర్ గ్రామాల్లోను కుష్టు వ్యాధిగ్రస్తులకు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. 1974లో గ్రామ నవనిర్మాణ సమితి అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించి వ్యవసాయం, ఆరోగ్యం, విద్య, గ్రామీణాభివృద్ధి రంగాలలో గ్రామీణ ప్రజలకు సేవలందించారు. 1978లో జమ్మికుంటలో లాల్ బహదూర్ ఇండస్ట్రియల్ కో ఆపరేటివ్ సొసైటీ స్థాపించారు. ఇందులో భాగంగా అట్టపెట్టెల తయారీ కేంద్రం, నూనె తయారీ కేంద్రం, ఐ.టి.ఐ., టైప్ ఇన్‌స్టిట్యూట్ వంటివి స్థాపించి యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించారు. స్వయం సమృద్ధిలో భాగంగా వావిలాల గ్రామంలో పీవీ నరసింహారావుతో కలిసి ఖాదీ ప్రతిస్థాన్, భాగ్యనగర్ ఖాదీ ప్రతిస్థాన్ ఏర్పాటు చేశారు. వీటికి వ్యవస్థాపక అధ్యక్షులుగా ఉన్నారు. 1989 ఆగస్ట్ 15న రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి హోదాలో డిల్లీలో వావిలాల గ్రామంలో తయారైన త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. 1992 నుంచి కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ సహకారంతో జమ్మికుంటలో కృషి విజ్ఞాన కేంద్రాన్ని స్థాపించి వ్యవసాయాభివృద్ధికి తోడ్పడ్డారు. ఈ ప్రాంత అభివృద్ధిలో కృషి విజ్ఞాన కేంద్రం పాత్ర గణనీయమైనది. ‘సాధన’ అనే స్వచ్ఛంద సంస్థకు, హైదరాబాదు రైటర్స్, పబ్లిషర్స్ అండ్ ప్రింటర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా కూడా జనార్ధనరెడ్డి పనిచేశారు.


1969 నాటి తెలంగాణ ఉద్యమ సమయంలో చురుకుగా పాల్గొని జగిత్యాల సబ్ జైలులో శిక్ష అనుభవించారు. హుజురాబాదు సమితి అధ్యక్షులుగా 1959 నుంచి 1971 వరకు పనిచేశారు. 1972లో కమలాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలిచారు. 1977లో హన్మకొండ పార్లమెంటు నియోజకవర్గం నుంచి జనతా పార్టీ అభ్యర్థిగా పీవీ నరసింహారావుపై పోటీ చేసి ఓడిపోయారు. 1978 లో జనతా పార్టీ టికెట్ పై కమలాపూర్ నుంచి తిరిగి గెలుపొందారు. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించినందుకు వ్యతిరేకంగా జయప్రకాశ్ నారాయణ్ నేతృత్వంలోని లోక్ సంఘర్ష్ సమితిలో చేరి అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు మాటని కూడా కాదని సత్యాగ్రహం చేశారు. ఫలితంగా ముషీరాబాదు జైలులో ఒక సంవత్సరం శిక్ష అనుభవించారు. ఆ కాలంలో ఆంధ్రప్రదేశ్ మొత్తంలో మీసా చట్టం కింద అరెస్ట్ అయిన ఏకైక ఎమ్మెల్యే జనార్ధనరెడ్డి మాత్రమే. ఎన్.టి. రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించినపుడు జనార్ధనరెడ్డిని ఆహ్వానించారు. కానీ వారు వెళ్లలేకపోయారు. అయితే 1984లో తెలుగుదేశం పార్టీలో చేరి అప్పుడే కొత్తగా పెట్టిన స్టేట్ డెవలప్ మెంట్ కమిటీ నెల్లూరు విభాగానికి ఇన్‌చార్జ్‌గా వ్యవహరించారు. అయితే ఆ సంవత్సరమే జరిగిన ఆగస్ట్ సంక్షోభం తర్వాత క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నారు.


ఆనాటి ప్రముఖ సోషలిస్ట్ నాయకులు జార్జి ఫెర్నాండెజ్, రామ్ మనోహర్ లోహియా, జయప్రకాశ్ నారాయణ్, మధు లిమాయే వంటి ఉద్దండులతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉండేవి. జార్జ్ ఫెర్నాండెజ్ హైదరాబాద్ వచ్చినపుడల్లా జనార్ధన్‌రెడ్డి గృహంలోనే ఉండేవారు. కన్నాభిరాన్, కేశవరావు జాదవ్ వంటి వారి కార్యకలాపాలతో సంఘీభావం ఉండేది. వారు రాజకీయంగా చురుకుగా ఉన్న సమయంలో పట్లోళ్ళ ఇంద్రారెడ్డి, ఈటెల సమ్మయ్య, ఆవునూరి సమ్మయ్య, ముద్దసాని సత్యనారాయణ రెడ్డి వారికి అత్యంత సన్నిహితంగా ఉండేవారు. హుజురాబాదు తాలుకాలోని నేతలు పోల్సాని నరసింగరావు, దుగ్గిరాల వెంకటరావు, అలిగిరెడ్డి విశ్వనాథరెడ్డి, న్యాయవాది జగన్నాథ నాయుడు సర్పంచులు ఎర్రంరాజు కృష్ణంరాజు, పుల్ల ఏలియా వంటి వారితో జనార్ధనరెడ్డికి సన్నిహిత సంబంధాలుండేవి. జనార్ధనరెడ్డి సేవలకు కొంతవరకు గుర్తింపు లభించింది. 2019లో స్వామి రామానందతీర్థ ఇన్‌స్టిట్యూట్, హైదరాబాదు నుంచి పీవీ నరసింహారావు పేరిట ఏర్పాటు చేసిన కృషి విజ్ఞాన్ పురస్కారం అందుకున్నారు. 2006-07 సంవత్సరానికి గాను ఉత్తమ కృషి విజ్ఞాన కేంద్రం అవార్డును అప్పటి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్ పవార్ చేతుల మీదుగా అందుకున్నారు. జనార్ధనరెడ్డి స్థాపించిన సంస్థలలో కుష్టు నివారణ సంఘ్ వంటివి అవసరం లేకపోవడంతో అంతరించిపోగా కృషి విజ్ఞాన కేంద్రం, ఖాదీ కేంద్రాలు, కళాశాల వంటివి జాతీయస్థాయి కీర్తిని సంపాదించి ఇంకా కొనసాగుతున్నాయి. ఈ ప్రాంతం చైతన్యం వెనుక, ఈ ప్రాంతం ధాన్యాగారం, విత్తన భాండాగారం కావడం వెనుక జనార్ధనరెడ్డి కృషి ఉంది. వీరి గ్రామానికి కల్లుపల్లె అనే పేరు కూడా ఉండేది. అందుకని ప్రజలు కల్లుపల్లె జనార్ధనరెడ్డి అని ప్రేమగా పిలుచుకునేవారు. 24ఏళ్లకే రాజకీయాల్లో ప్రవేశించి 48ఏళ్లకే నిష్క్రమించారు. పన్నెండేండ్లు సమితి ప్రెసిడెంట్‌గా, పదేండ్లు శాసనసభ్యులుగా, అనేక సంస్థలకు వ్యవస్థాపక అధ్యక్షులుగా సేవలందించి ప్రజల మనిషిగా గుర్తింపు పొందారు. సమత-.. సంపన్నత అనే సామ్యవాద సిద్ధాంతం, స్వస్థత-.. సాక్షరత.. -స్వావలంబన..-సదాచారం అనే గాంధేయ సిద్ధాంతాలను తన జీవితాంతం పాటించారు. జనార్ధనరెడ్డి నిరాడంబరుడు, మితభాషి, సహనశీలురు.

డా. పుల్లూరి సంపత్ రావు

Updated Date - 2022-04-07T07:01:43+05:30 IST