ప్రగతి భవన్‌ ముట్టడి ఉద్రిక్తం

ABN , First Publish Date - 2020-08-13T07:52:51+05:30 IST

పరీక్షల నిర్వహణకు షెడ్యూల్‌ విడుదల చేయడాన్ని నిరసిస్తూ ఎన్‌ఎ్‌సయూఐ నాయకులు

ప్రగతి భవన్‌ ముట్టడి ఉద్రిక్తం

  • పరీక్షల షెడ్యూల్‌పై ఎన్‌ఎస్‌యూఐ నిరసన... 
  • పీపీఈ కిట్లు ధరించి బైఠాయించిన నేతలు
  • ఇనుప గ్రిల్స్‌ ఎక్కి లోపలికి దిగిన ఓ విద్యార్థి
  • అరెస్టు చేసి పీఎ్‌సకు తరలించిన పోలీసులు
  • పోలీసులతో వాగ్వాదానికి దిగిన జగ్గారెడ్డి
  • విద్యార్థులంటే విలువ లేదా?: ఉత్తమ్‌
  • 18న రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు: భట్టి

హైదరాబాద్‌, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): పరీక్షల నిర్వహణకు షెడ్యూల్‌ విడుదల చేయడాన్ని నిరసిస్తూ ఎన్‌ఎ్‌సయూఐ నాయకులు ప్రగతి భవన్‌ను ముట్టడించడం ఉద్రిక్తతకు దారి తీసింది. బుధవారం ఉదయం పీపీఈ కిట్లు ధరించి ఓ డీసీఎంలో అక్కడికి చేరుకున్న విద్యార్థి సంఘం నేతలు, కార్యకర్తలు... ఒక్క సారిగా ఆందోళన చేపట్టారు. పెద్దపెట్టున నినాదాలు చేస్తూ లోపలకి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఓ విద్యార్థి ఇనుప గ్రిల్స్‌ ఎక్కి లోపలకు దిగాడు. అప్పటికే అప్రమత్తమైన పోలీసులు ఆ విద్యార్థిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో మిగతా నాయకులందరూ అక్కడే రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్న పోలీసులు.. వారందరినీ లాగి పడేశారు. వ్యాన్‌లో ఎక్కించి గోషామహల్‌ పీఎ్‌సకు తరలించారు. అనంతరం ఎన్‌ఎ్‌సయూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూర్‌ వెంకట్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని రకాల పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్‌ చేశారు. టెస్ట్‌లు చేయకుండా ప్రభుత్వం ప్రజలను మభ్యపెడుతోందని ఆరోపించారు.  పరీక్షల అంశం కోర్టులో ఉండగా షెడ్యూల్‌ జారీ చేయడం దారుణమని అన్నారు. విద్యార్థుల ప్రాణాలను ఫణంగా పెట్టి పరీక్షల షెడ్యూల్‌ విడుదల చేయడాన్ని నిరసిస్తూ ప్రగతి భవన్‌ ముట్టడికి యత్నించినట్లు తెలిపారు. కాగా, పోలీసుల అదుపులో ఉన్న ఎన్‌ఎ్‌సయూఐ అధ్యక్షుడు వెంకట్‌, కార్యకర్తలకు పరామర్శించడానికి ఎమ్మెల్యేలు జగ్గారెడ్డి, శ్రీధర్‌బాబు, వీహెచ్‌, అనిల్‌ కుమార్‌, విక్రమ్‌గౌడ్‌ తదితరులు గోషామహల్‌ స్టేడియానికి వెళ్లారు. అయితే, పోలీసులు వారిని అనుమతించలేదు. దీంతో కొందరు నేతలు గేట్‌పైకి ఎక్కి లోపలకి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన జగ్గారెడ్డి.. వారితో వాగ్వాదానికి దిగారు. ‘మమ్మల్ని చంపండి.. కేసీఆర్‌నే ఏలుకోమనండి’ అని వ్యాఖ్యానించారు. డీజీపీ మహేందర్‌రెడ్డి సంగతి తెలుసు.. తాము అధికారంలో ఉన్నప్పుడు ఆయన సెల్యూట్‌ కొట్టిన సంగతి విస్మరించొద్దని దుయ్యబట్టారు. అనంతరం గాంధీభవన్‌లో మీడియాతో ఆయన మాట్లాడుతూ సమైక్య రాష్ట్రంలోనూ ఇలాంటి పరిస్థితి చూడలేదని అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ తమ ప్రభుత్వం స్వేచ్ఛ ఇచ్చిదని గుర్తు చేశారు. సీఎంను కలిసి సమస్యలు చెప్పుకొనే అవకాశం లేకనే విద్యార్థులు ప్రగతి భవన్‌ను ముట్టడించారని అన్నారు. 


అరెస్టులు.. ప్రజాస్వామ్య విరుద్ధం

విద్యార్థి నేతల అరెస్టులు.. ప్రసాజ్వామ్య విరుద్ధమని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వ్యాఖ్యానించారు. కోర్టు పరిధిలో ఉండగా పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం పూనుకోవడమేంటని ప్రశ్నించారు. విద్యార్థుల ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని ఓ ప్రకటనలో దుయ్యబట్టారు. ఎన్‌ఎ్‌సయూఐ అధ్యక్షుడు వెంకట్‌ సహా నాయకులందరినీ వెంటనే విడిచి పెట్టాలని డిమాండ్‌ చేశారు. పోరాటానికి తెగిస్తే ఖాకీల కాపలాలు, ఇనుప కంచెలూ ఆపలేవని ఎంపీ రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. కేసీఆర్‌ గడీని ముట్టడించిన ఎన్‌ఎ్‌సయూఐ కార్యకర్తలకు అభినందనలని ట్విటర్‌లో పేర్కొన్నారు. విద్యార్థులు, యువతతో పెట్టుకున్న వారెవరూ ఎక్కువ రోజులు అధికారంలో ఉండరని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. అరెస్టు చేసిన ఎన్‌ఎ్‌సయూఐ కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని, లేని పక్షంలో తామే ప్రగతిభవన్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. కాగా, ఎన్‌ఎ్‌సయూ కార్యకర్తల పట్ల ప్రభుత్వం వ్యవహరించిన తీరు, కరోనా కట్టడిలో వైఫల్యాలను నిరసిస్తూ 18న యూత్‌కాంగ్రె్‌స, ఎన్‌ఎ్‌సయూఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించనున్నట్లు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు. ఎన్‌ఎ్‌సయూఐ కార్యకర్తలు సంఘ విద్రోహ శక్తులు కాదని, విద్యార్థులు ఆందోళన చేస్తే అరెస్టు చేస్తారా? అని ప్రశ్నించారు. 



Updated Date - 2020-08-13T07:52:51+05:30 IST