మహిళా సంఘాలకు ‘పవర్‌’!

ABN , First Publish Date - 2020-03-22T10:42:02+05:30 IST

రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాల(ఎస్‌హెచ్‌జీ) ఆదాయ వనరులను మరింతగా పెంచాలని సర్కారు భావిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో వారి శక్తిని మరింత పెంచే ఉద్దేశంతో...

మహిళా సంఘాలకు ‘పవర్‌’!

  • వారితో సోలార్‌, విండ్‌ ప్రాజెక్టుల నిర్వహణ  
  • ఒక్కో ప్రాజెక్టుకు కనీసం రెండు వేల ఎకరాలు
  • భూములు సిద్ధం చేయాలని కలెక్టర్లకు ఆదేశం


అమరావతి, మార్చి 21(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాల(ఎస్‌హెచ్‌జీ) ఆదాయ వనరులను మరింతగా పెంచాలని సర్కారు భావిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో వారి శక్తిని మరింత పెంచే ఉద్దేశంతో పవర్‌ ప్రాజెక్టులు ఇవ్వాలనుకుంటోంది. సోలార్‌, పవన విద్యుత్‌ ప్రాజెక్టులను వారికి అప్పగించి నెలసరి ఆదాయమే భారీగా ఉండేలా కార్యాచరణ రూపొందిస్తోంది. ఈ మేరకు భూములను అన్వేషించాలంటూ జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. ఇప్పటికే రాష్ట్రంలో భారీగా సోలార్‌, విండ్‌ ప్రాజెక్టులు పనిచేస్తున్నాయి. బడా బడా కంపెనీలు ప్రభుత్వం నుంచి భూమితోపాటు అనేక ఆర్థిక రాయితీలు పొంది మరీ ప్రాజెక్టులను ఏర్పాటు చేసుకున్నాయి.


ఇప్పుడు ఎస్‌హెచ్‌జీలను ఈ వ్యాపారంలోకి దించి వారికి భారీ ఆదాయ వనరు చూపించాలని జగన్‌ సర్కారు భావిస్తోంది! రాష్ట్రంలో లక్షలాది ఎస్‌హెచ్‌జీలున్నాయి. వాటన్నింటికీ ప్రాజెక్టులు ఇవ్వలేరు. కనుక.. సగటున ఎన్ని గ్రూపులకు ఒక ప్రాజెక్టు ఇవ్వాలి? దాని పరిధిలో ఎంత మంది సభ్యులు ఉండాలో త్వరలో నిర్ణయించనున్నారు. సగటున ఒక్కో ప్రాజెక్టును 2వేల ఎకరాల్లో ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు, ఈ మేరకు జిల్లాల వారీగా భూములను గుర్తించాలని ప్రభుత్వం కలెక్టర్లను ఆదేశించింది. సోలార్‌, పవన విద్యుత్‌లకు ఎత్తైన కొండ ప్రాంతాలు, గాలి బాగా వీచేవి, ఉష్ణోగ్రతలు కూడా కాస్త ఎక్కువగా ఉన్నవి కావాలి. అలాంటి వాటిని గుర్తించి యుద్ధప్రాతిపదికన నివేదికలు ఇవ్వాలని సూచించింది.


ఆదాయంపై భారీ అంచనాలు

ప్రాజెక్టు అమల్లోకి వచ్చాక 2వేల ఎకరాలతో కూడిన ఒక యూనిట్‌పై సగటున ఒక్కో ఎకరంపై రూ.30వేల ఆదాయం రావాలని, ఇది కనీసం 30ఏళ్లపాటు కొనసాగుతుందని కలెక్టర్లకు ఇచ్చిన ఆదేశాల్లో పేర్కొన్నారు. అంటే, 30ఏళ్ల లీజు ప్రాతిపదికన భూములిస్తారనేది స్పష్టమవుతోంది. ఈ లెక్కన 2వేల ఎకరాలు ఉండే ఒక్కో యూనిట్‌పై నెలకు రూ.6కోట్ల ఆదాయం వస్తుంది. 30 ఏళ్లపాటు నికరాదాయం రూ.2,160 కోట్లపైనే. అయితే, ఇవన్నీ అధికారవర్గాలు రూపొందించిన అంచనా లెక్కలే. క్షేత్రస్థాయిలో ప్రాజెక్టులు ఏర్పాటై ఎస్‌హెచ్‌జీల నిర్వహణకు అవి వెళ్తేనే.. వాటిపై ఆశలు సజీవంగా ఉంటాయి. 


నేతల చేతికి వెళ్తే అంతే!

గ్రామీణ ప్రాంతాల్లో పవర్‌ ప్రాజెక్టులను నిర్వహించే శక్తి, సామర్థ్యం ఎస్‌హెచ్‌జీలకు ఎక్కడిది? వారు నిర్వహించలేకపోతున్నారనే సాకులు చూపి వాటిపై రాజకీయ నేతలు కన్నేసే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుందని అధికారవర్గాలు అనుమానిస్తున్నాయి. అయితే.. అలాంటి పరిస్థితి రాకుండా.. వాటిని క్షేత్రస్థాయిలో జెన్‌కో ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తుందని, దీనిపై ఎలాంటి అనుమానాలకు తావులేకుండా ఒప్పందాలు, తగిన జాగ్రత్తలు తీసుకుంటారని ఓ సీనియర్‌ అధికారి చెబుతున్నారు. 


గతంలోనూ.. ఇచ్చారు!

నిరుపేద మహిళల చేతికి పవర్‌ ప్రాజెక్టులు ఇవ్వడం రాష్ట్రంలో కొత్తేమీకాదు. గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో షెడ్యూల్డ్‌ ప్రాంతాల్లో గిరిజన మహిళలకు 2మెగావాట్ల సామర్థ్యం కలిగిన హైడల్‌ ప్రాజెక్టులను ఇచ్చారు. గిరిజన మహిళా గ్రూపులను ప్రత్యేకంగా గుర్తించి సీలేరు, ఇతర ప్రాంతాల్లోని హెడల్‌ ప్రాజెక్టులను అప్పగించారు. వాటిని గిరిజన విద్యుత్‌ సంస్థ (ట్రిప్‌కో) పర్యవేక్షించేది. ఆ తర్వాతి కాలంలో ట్రిప్‌కోనే నిర్వీర్యమైపోయింది. ప్రాజెక్టులు మహిళల చేయిదాటిపోయాయి. ఈ నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటే తప్ప.. సోలార్‌, విండ్‌ ప్రాజెక్టులు కూడా ఓ ఫార్సుగా మిగిలిపోక తప్పదని పాలకులు గ్రహించాలి.

Updated Date - 2020-03-22T10:42:02+05:30 IST