కుళ్లిన కూరగాయలతో విద్యుదుత్పత్తి
ABN , First Publish Date - 2021-02-01T08:02:44+05:30 IST
మార్కెట్లలో కుళ్లిపోయిన కూరగాయలను ఏం చేస్తారు? సాధారణంగా.. రైతులు, కమీషన్ ఏజెంట్లు, వ్యాపారులు అలాంటి వ్యర్థాలను ఎక్కడికక్కడే పారేస్తారు..
బోయిన్‌పల్లి మార్కెట్‌లో విజయవంతంగా ట్రయల్‌రన్
రోజూ.. 10 టన్నుల చెత్తతో 500 యూనిట్ల విద్యుత్తు
30 కిలోల బయో ఇంధనం ఉత్పత్తి ఇందుకు అదనం
ఏజీఆర్ టెక్నాలజీ దన్నుతో కొనసాగుతున్న ప్రాజెక్టు
‘మన్‌కీబాత్’లో ప్రశంసలు కురిపించిన ప్రధాని మోదీ
త్వరలో నగర మార్కెట్లకు విస్తరణ.. కేంద్రం వెన్నుదన్ను
కేంద్రం ద్వారా 2 కోట్లు.. రాష్ట్రం నుంచి కోటి నిధులు
‘‘మార్కెట్‌లో కుళ్లిపోయిన కూరగాయలను చెత్తకుండీల్లో పారేయకుండా.. వాటి ద్వారా విద్యుత్తు ఉత్పత్తి చేస్తున్నారు..! వ్యర్థాల నుంచి బంగారాన్ని తయారు చేస్తున్నారు..’’
‘‘హైదరాబాద్‌లోని బోయిన్‌పల్లి మార్కెట్ తన బాధ్యతలను నెరవేర్చే విధానం నాకు చాలా సంతృప్తినిచ్చింది. అక్కడ ప్రతిరోజూ 10 టన్నుల మేర కుళ్లిపోయిన కూరగాయలు, వ్యర్థాలు తయారవుతున్నాయి. వాటిని విద్యుత్తు ఉత్పత్తికి వాడుతున్నారు. ప్రతిరోజూ 500 యూనిట్ల విద్యుత్తు ఉత్పత్తి అవుతోంది. ఈ విద్యుత్తే మార్కెట్‌కు కాంతినిస్తోంది..’’
‘‘బోయిన్‌పల్లి మార్కెట్‌లో వ్యర్థాల నుంచి విద్యుత్తు ఉత్పత్తి ప్రక్రియ ద్వారా రోజూ 30 కిలోల జీవ ఇంధనం ఉత్పత్తి అవుతోంది. దాన్ని మార్కెట్ క్యాంటీన్‌లో ఆహార పదార్థాలను వండటానికి ఉపయోగిస్తున్నారు. ఇది అద్భుతమైన ప్రయత్నం..’’
- బోయిన్‌పల్లి మార్కెట్‌పై ‘మన్‌కీబాత్’లో ప్రధాని మోదీ
బోయిన్‌పల్లి, జనవరి 31 (ఆంధ్రజ్యోతి): మార్కెట్లలో కుళ్లిపోయిన కూరగాయలను ఏం చేస్తారు? సాధారణంగా.. రైతులు, కమీషన్ ఏజెంట్లు, వ్యాపారులు అలాంటి వ్యర్థాలను ఎక్కడికక్కడే పారేస్తారు..! ఫలితంగా మార్కెట్లు అపరిశుభ్రంగా తయారవుతుంటాయి. స్థానిక సంస్థల పారిశుధ్య కార్మికులు వచ్చి, సేకరించేదాకా.. చిత్తడిగా తయారవుతాయి. కానీ.. బోయిన్‌పల్లిలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ వ్యవసాయ మార్కెట్ అందుకు భిన్నం..! రాష్ట్ర మార్కెటింగ్ శాఖ ఇక్కడ వ్యర్థాల నుంచి విద్యుత్తును ఉత్పత్తి చేసే ప్లాంట్‌ను ట్రయల్ రన్‌లో భాగంగా ఏర్పాటు చేసింది. ఇక్కడి చెత్త, వ్యర్థాలు, కుళ్లిన కూరగాయలు విద్యుత్తును, బయో ఇంధనాన్ని ఉత్పత్తి చేస్తున్నాయి. స్వయానా ప్రధాని మోదీ ఈ ప్రక్రియను ‘మన్‌కీబాత్’లో మెచ్చుకున్నారు. ‘‘చెత్త నుంచి బంగారాన్ని సృష్టిస్తున్నారు’’ అంటూ ప్రశంసించారు.
పైలెట్ ప్రాజెక్టు గ్రాండ్ సక్సెస్
కుళ్లిన కూరగాయల నుంచి విద్యుత్తు ఉత్పత్తికి మార్కెటింగ్ శాఖలో పుట్టిన ఆలోచనే.. బోయిన్‌పల్లి మార్కెట్‌లో విద్యుత్తు ఉత్పత్తి ప్లాంట్‌కు బీజం పడేలా చేసింది. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎ్‌సఐఆర్) పరిధిలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ) రూపొందించిన అధునాతన అన్‌ఎయిరోబిక్ గ్యాస్ లిఫ్ట్ రియాక్టర్(ఏజీఆర్) టెక్నాలజీకి.. ఆహుజా ఇంజనీరింగ్ కంపెనీ తన టాలెంట్‌ను జోడించి ఈ పైలెట్ ప్రాజెక్టును ఏడాది క్రితం సాకారం చేసింది. అనతికాలంలోనే ఈ ప్లాంట్ దేశవ్యాప్తంగా అన్ని మార్కెట్లను ఆకట్టుకుంది. ఎందరెందరో దీనిపై అధ్యయనానికి వస్తున్నారు. ప్రధాని మన్‌కీబాత్ తర్వాత.. బోయిన్‌పల్లి మార్కెట్ ప్రభ మరింత వెలుగుతోంది. ఐఐసీటీ రూపొందించిన ఏజీఆర్ టెక్నాలజీలో కుళ్లిన కూరగాయలను తొలుత బయోగ్యా్‌సగా.. ఆ తర్వాత విద్యుత్తుగా మారుస్తున్నారు. ఇలా ప్రతిరోజూ పది టన్నుల కుళ్లి కూరగాయలతో 500 యూనిట్ల విద్యుత్తు ఉత్పత్తి అవుతోంది. ఈ ప్రక్రియలో వచ్చిన వ్యర్థాల నుంచి 30 బయో ఇంధనం కూడా తయారవుతోంది. ఇలా.. గత ఏడాది జనవరిలో ప్రారంభమైన ప్లాంట్.. నిరాటంకంగా విద్యుత్తును ఉత్పత్తి చేస్తోంది.
తొలినాళ్లతో కొంత మోతాదుతో ప్రారంభించిన వ్యర్థాల వినియోగం ఇప్పుడు 10 టన్నులకు చేరుకుంది. దీన్ని 15 టన్నులకు పెంచితే.. రోజుకు 800 యూనిట్ల దాకా విద్యుత్తును ఉత్పత్తి చేయవచ్చు. ప్రస్తుతం ఇక్కడ ఉత్పత్తి అవుతున్న 500 యూనిట్ల కరెంటును మార్కెట్ అవసరాలకు వినియోగిస్తున్నారు. బయో ఇంధనాన్ని క్యాంటీన్‌లో వంటల తయారీకి వాడుతున్నారు. మిగతా వ్యర్థాలను పంటపొలాల్లో ఎరువులుగా వినియోగించుకోవచ్చు. ఐఐసీటీ-ఆహుజా సంయుక్తంగా ఇదివరకే 15 ప్లాంట్లను ఏర్పాటు చేసినా.. వాటితో పోలిస్తే బోయిన్‌పల్లి ప్లాంట్‌కు ప్రత్యేకత ఉంది. మిగతా ప్లాంట్లు రోజుకు ఒక క్వింటా నుంచి గరిష్ఠంగా 5 టన్నుల దాకా వ్యర్థాలను మాత్రమే ప్రాసెస్ చేయగలవు. బోయిన్‌పల్లి ప్లాంట్ సామర్థ్యం వాటికంటే చాలా ఎక్కువ. నిజానికి బోయిన్‌పల్లి మార్కెట్‌లో రోజుకు 5 టన్నుల వ్యర్థాలు వస్తాయి. మిగతా ఐదు టన్నులను ఇతర మార్కెట్ల నుంచి తరలిస్తున్నారు.
జీహెచ్‌ఎంసీకి తగ్గిన పనిభారం
గతంలో మార్కెట్లలోని వ్యర్థాలను జీహెచ్‌ఎంసీ తరలించేది. బోయిన్‌పల్లి మార్కెట్లో బయోగ్యాస్, విద్యుత్తు ఉత్పత్తి యూనిట్ ఏర్పాటుతో జీహెచ్‌ఎంసీకి పనిభారం తగ్గడమే కాకుండా.. రవాణా చార్జీలు ఆదా అవుతున్నాయి. మిగతా మార్కెట్లలోని వ్యర్థాలను కూడా విద్యుత్తు ఉత్పత్తికి వినియోగిస్తే.. ఈ ఖర్చు మరింత తగ్గుతుంది. ఇందుకోసం మార్కెటింగ్ శాఖ ఇప్పటికే ప్రణాళికలు రూపొందించింది. రూ. 2 కోట్ల కేంద్ర నిధులు, రూ. కోటి రాష్ట్ర నిధులతో ఈ ప్లాంట్ సేవలను విస్తరించాలని నిర్ణయించింది. ప్రస్తుతం పైలెట్ ప్రాజెక్టుగా ఉన్న ఈ యూనిట్‌ను వీలైనంత త్వరలో అధికారికంగా ప్రారంభించేందుకు కసరత్తు మొదలుపెట్టింది.
దేశవ్యాప్తంగా ఇదే ఆలోచన?
దేశంలో 2,477 ప్రధాన మార్కెట్లు, 4,843 సబ్-మార్కెట్లు ఉన్నాయి. వీటిల్లో 30 శాతానికి పైగా కూరగాయలు వృథా అవుతున్నాయని అంచనా. అంటే.. ప్రతిరోజూ కొన్ని వేల టన్నుల వ్యర్థాలు డంపింగ్ యార్డులకు తరలిపోతున్నాయి. అన్ని చోట్లా కుళ్లిన కూరగాయలతో విద్యుత్తును ఉత్పత్తి చేస్తే.. చెత్త తరలింపునకు రవాణా ఖర్చులు తగ్గడమే కాకుండా.. మార్కెట్లు పరిశుభ్రంగా ఉంటాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో కేంద్ర శాస్త్రసాంకేతిక శాఖ పరిధిలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ బోయిన్‌పల్లిపై ప్రత్యేక దృష్టిసారించింది.
కాలనీల్లోనూ వినియోగించుకోవచ్చు
బోయిన్‌పల్లి మార్కెట్ యార్డులో బయోగ్యాస్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి మాత్రమే కొనసాగుతుంది. భవిష్యత్తులో బయోగ్యాస్ ద్వారా బయో కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్(సీఎన్‌జీ) లేదా కంప్రెస్డ్ బయో నేచురల్ గ్యాస్(సీబీజీ) ప్లాంట్లను నెలకొల్పే అవకాశాలున్నాయి. నగరాల్లో గ్యాస్ పంపిణీ నెట్‌వర్క్‌కు అనుసంధానిస్తూ.. ఈ వ్యర్థాలను బయో పీఎన్‌జీగా కూడా వాడుకోవచ్చు. కాలనీ సంఘాలు, ప్రైవేటు సంస్థలు కూడా ఇలాంటివే చిన్న యూనిట్లను ఏర్పాటు చేసుకోవచ్చు. రూ. 10 లక్షల నుంచి రూ. 12 లక్షల పెట్టుబడితో.. రోజుకు 100 కిలోల వ్యర్థాలను ప్రాసెస్ చేసే యూనిట్లను ఏర్పాటు చేయవచ్చు.
- సందీప్, ఆహుజా కంపెనీ ఇంజనీర్
సంవత్సరానికి రూ. 50 లక్షలు ఆదా
పైలెట్ ప్రాజెక్టుగా ఉన్న బోయిన్‌పల్లి మార్కెట్ బయో ఎనర్జీ ప్లాంట్ పూర్తిస్థాయిలో వినియోగానికి వస్తే.. ప్రతి సంవత్సరం రూ. 50 లక్షలకు పైగా ఆదా అయ్యే అవకాశాలున్నాయి. ప్రస్తుతం విద్యుత్తు ఖర్చులు రూ. 5 లక్షల వరకు ఆదా అవుతున్నాయి. ఈ ప్రాజెక్టు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తే.. ఆ ఆదా రూ. 30 లక్షలకు పెరుగుతుంది. చెత్త తరలింపు సమస్యకు పూర్తిస్థాయిలో పరిష్కారం లభించినట్లవుతుంది. త్వరలో అధికారికంగా పూర్తిస్థాయి ప్రాజెక్టును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పెద్దల చేతుల మీదుగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం.
- టి.ఎన్.శ్రీనివాస్, బోయిన్‌పల్లి మార్కెట్ చైర్మన్