1000 కోట్ల ఫీజులు హుష్‌కాకి!

ABN , First Publish Date - 2021-04-15T09:10:18+05:30 IST

పోస్ట్‌మెట్రిక్‌ స్కాలర్‌షి్‌పల విడుదల వ్యవహారం ఫార్స్‌గా మారింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ, దివ్యాంగ విద్యార్థులకు అందాల్సిన రూ. 1000 కోట్ల బకాయిలను 22 నెలలుగా

1000 కోట్ల ఫీజులు హుష్‌కాకి!

పోస్ట్‌మెట్రిక్‌ స్కాలర్‌షిప్‌ మొత్తాలు

రెండేళ్లుగా విడుదలచేయని వైనం

పీజీ విద్యార్థులకు మొండిచెయ్యి.. 450 కోట్లుపైగా రీయింబర్స్‌ బకాయి

కాలేజీలకు పైసా ఇవ్వని సర్కారు.. 550 కోట్లుదాకా మెయింటినెన్స్‌లు

పిల్లలకు ఇంతవరకు జమే కాలేదు.. ఆందోళనలో విద్యార్థులు, కాలేజీలు


(అమరావతి - ఆంధ్రజ్యోతి) 

పోస్ట్‌మెట్రిక్‌ స్కాలర్‌షి్‌పల విడుదల వ్యవహారం ఫార్స్‌గా మారింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ, దివ్యాంగ విద్యార్థులకు అందాల్సిన రూ. 1000 కోట్ల బకాయిలను 22 నెలలుగా రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్‌ పెట్టింది. పథకాల కోసమంటూ రూ.వేల కోట్లు అప్పులు తెస్తున్నారు. కానీ, వెనుకబడిన కుటుంబాలకు చెందిన లక్షలాది మంది విద్యార్థులు, కాలేజీలకు చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌, మెయింటినెన్స్‌ బకాయిల ఊసే ఎత్తడం లేదు. స్కాలర్‌షి్‌పలలో భాగాలైన ‘ట్యూషన్‌ ఫీజు రీయింబర్స్‌మెంట్‌’ (ఆర్‌టీఎఫ్‌), మెయింటినెన్స్‌ ఫీజు’ (ఎంటీఎఫ్‌) మొత్తాలను రాష్ట్ర ప్రభుత్వం బకాయి పడింది. 2018-19 విద్యా సంవత్సరంలో కొంత మొత్తం, 2019-20 విద్యా సంవత్సరంలో పూర్తిగా పీజీ కోర్సులకు ఆర్‌టీఎఫ్‌,  ఇంటర్‌, ఐటీఐ, పాలిటెక్నిక్‌, యూజీ, పీజీ, ప్రొఫెషనల్‌ కోర్సులు, పీహెచ్‌డీ విద్యార్థులకు అందాల్సిన మెయింటినెన్స్‌ ఫీజులను ఇప్పటివరకు చెల్లించలేదు. బకాయి పెట్టిన ఆయా ఫీజుల మొత్తం దాదాపు వెయ్యికోట్ల కోట్ల పైమాటే! ఇందులో పీజీ కోర్సులు ఎంఏ, ఎంకాం, ఎంఎస్సీ, ఎంటెక్‌, ఎంఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ, ఎంఎల్‌, ఎంఈడీ ప్రోగ్రామ్‌లు చదువుకునే విద్యార్థులకు సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.450 కోట్లు. ఎంటీఎఫ్‌ బకాయిలు దాదాపు రూ.550 కోట్లు. ఆర్‌టీఎఫ్‌ బకాయిలను ప్రభుత్వం సంబంధిత కాలేజీల ఖాతాల్లో జమ చేయాల్సి ఉండగా, ఎంటీఎఫ్‌ బకాయిలను నేరుగా విద్యార్థుల ఖాతాల్లో వేయాలి. కానీ, ఇన్నాళ్లలో ఒక పైసా కూడా సర్కారు జమ చేయలేదు.

 

ప్రైవేటు బాలేకపోతే బాధ్యత మీదేగా!

రాష్ట్రంలోని ప్రైవేట్‌ కాలేజీల్లో పీజీ కోర్సుల నిర్వహణ సరిగ్గాలేదని ప్రభుత్వం తన అంతర్గత సమావేశాల్లో చెప్పుకుంటోంది. యూనివర్సిటీల్లో మాత్రమే పీజీ కోర్సులు పక్కాగా నడుస్తున్నాయన్నది ఉన్నతాధికారుల భావన. వర్సిటీల్లో అసలు టీచింగ్‌ ఫ్యాకల్టీ గానీ, మౌలిక సదుపాయాలు గానీ ఉన్నాయా అనే ప్రశ్నలకు మాత్రం సమాధానం లేదు. ఒకవేళ ప్రైవేట్‌ కాలేజీల్లో పీజీ కోర్సులు ,పరీక్షలు అస్తవ్యస్థంగా మారాయనుకుంటే అందుకు బాధ్యత ఆయా వర్సిటీలు, ప్రభుత్వానిది కాదా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. పీజీ కోర్సులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇవ్వకూడదు అనుకుంటే ఆ విషయాన్ని ముందుగానే కాలేజీలకు తెలియపరచాలి. మరి ఎందుకు ఆ పని చేయలేదు అని అడుగుతున్నారు.


తీరా విద్యా సంవత్సరం పూర్తయిన తర్వాత ఈ సన్నాయి నొక్కులు ఎందుకో అర్థం కావడం లేదని ప్రైవేట్‌ విద్యా సంస్థల యాజమాన్యాలు విమర్శిస్తున్నాయి. సర్కారు దాగుడుమూతల కారణంగా పీజీ కోర్సుల విద్యార్థులకు బోధన చేసే టీచర్లకు జీతాలు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ వైఖరి కారణంగా అప్పుల ఊబిలో చిక్కుకున్నామని, భవిష్యత్తులో పీజీ కోర్సులను నిర్వహించలేమని తెగేసి చెబుతున్నారు. ఏవో కొన్ని ప్రైవేట్‌ కాలేజీలను దృష్టిలో ఉంచుకుని ఏకంగా అన్ని కాలేజీలకూ ఫీజు రీయింబర్స్‌ చేయకపోవడం సరి కాదని వాపోతున్నారు. 


ఎందుకివ్వరు?

రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 25 లక్షల మంది విద్యార్థుల ‘మెయింటినెన్స్‌ ఫీజు బకాయిలు విడుదల కాలేదు. పైగా ఫలానా కారణం వల్ల బకాయిలు ఇవ్వలేదని , నిర్దిష్ట కాల వ్యవధిలోగా విడుదల చేస్తామన్న ప్రకటన కూడా ప్రభుత్వం చేయడం లేదు. 2018-19 విద్యాసంవత్సరం ఐదు నెలల కాలానికి సంబంధించి దాదాపు రూ.500 కోట్ల మేర ఎంటీఎఫ్‌ బకాయిలు ఉన్నాయి. వేలాది మంది విద్యార్థులకు మరో రూ.50 కోట్లు మేర ఈ-పాస్‌ బకాయిలు కూడా పేరుకుపోయాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ, దివ్యాంగ విద్యార్థులకు సంబంధించిన పోస్ట్‌ మెట్రిక్‌ స్కాలర్‌షిప్‌ పథకంలో భాగంగా ఇంటర్‌, ఐటీఐ, పాలిటెక్నిక్‌, యూజీ, పీజీ, ప్రొఫెషనల్‌ కోర్సులు, పీహెచ్‌డీ కి సంబంధించి దీర్ఘకాలంగా పోస్ట్‌మెట్రిక్‌ స్కాలర్‌షి్‌పలు ఇస్తున్నారు. హాస్టళ్లలో ఉండే విద్యార్థులకు మెస్‌ చార్జీలు, మెయింటినెన్స్‌ కోసం నెలవారీగా చెల్లింపులు విడుదల చేయాల్సి ఉంది. 


అప్పుడిచ్చినప్పుడు..ఇప్పుడేమి?

2017-18 విద్యా సంవత్సరం వరకు ఎంటీఎఫ్‌ సక్రమంగానే విద్యార్థులకు అందింది. 2018 జూలై ఒకటో తేదీన చంద్రబాబు ప్రభుత్వం స్కాలర్‌షిప్‌ రేట్లను పెంచింది. హాస్టలర్స్‌కు, డే స్కాలర్స్‌కు వేర్వేరు రేట్లను నిర్ణయించారు. హాస్టళ్లలో ఉండి పీజీ-ప్రొఫెషనల్‌ కోర్సుల విద్యార్థులకు  నెలకు రూ.1400, డిగ్రీ లెవెల్‌ విద్యార్థులకు రూ.1400, ఇంటర్‌ లెవెల్‌ విద్యార్థులకు రూ.1000గా నిర్ణయించారు. డే స్కాలర్స్‌లో పీజీ-ప్రొఫెషనల్‌ కోర్సులు చదివే ఎస్సీ విద్యార్థులకు రూ.1000, బీసీ విద్యార్థులకు రూ.800, ఈబీసీ విద్యార్థులకు రూ.600 స్కాలర్‌షిప్‌ నిర్ణయించారు.


డిగ్రీ లెవెల్‌ కోర్సులు చదివే ఎస్సీ విద్యార్థులకు రూ.800, బీసీ విద్యార్థులకు రూ.600, ఈబీసీ విద్యార్థులకు రూ.500  ఖరారు చేశారు. అదే ఇంటర్‌ లెవెల్‌ కోర్సు చదివే ఎస్సీ విద్యార్థులకు రూ.600, బీసీ విద్యార్థులకు రూ.500, ఈబీసీ విద్యార్థులకు రూ.400 స్కాలర్‌షిప్‌ నిర్ణయించారు. అయితే 2018-19 విద్యా సంవత్సరంలో చంద్రబాబు ప్రభుత్వం సాధారణ ఎన్నికల కారణంగా ఐదు నెలల కాలానికి ఈ ఎంటీఎఫ్‌ విడుదల చేయలేదు. ఏ పార్టీ ప్రభుత్వం అయినా సరే విద్యార్థులకు మెయింటినెన్స్‌ విడుదల చేయాల్సి ఉంటుంది. కానీ 2019 మే లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కానీ ఇంత వరకు దాని ఊసే ఎత్తడం లేదన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.


కాగా, 2019-20 విద్యా సంవత్సరంలో జూన్‌ నుంచి ఇంటర్‌ తరగతులు ప్రారంభమయ్యాయి. 2019నవంబరు 30న అమ్మ ఒడి పథకానికి సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. అమ్మఒడి పథకాన్ని ఇంటర్‌ విద్యార్థులకు కూడా వర్తింపజేస్తున్నామని చెప్పి, ఇంటర్‌ విద్యార్థులకు ఇవ్వాల్సిన ట్యూషన్‌ ఫీజును ఎత్తేసింది. వాస్తవానికి ఒక కుటుంబంలో ఒకటి నుంచి ఇంటర్‌ వరకు చదువుకునే విద్యార్థులు ఎంతమంది ఉన్నా సరే తల్లికే అమ్మ ఒడి అందుతుంది. ఈ నిర్ణయం వల్ల వేలాది మంది ఇంటర్‌ విద్యార్థులు ట్యూషన్‌ ఫీజుకు దూరమయ్యారు. 

Updated Date - 2021-04-15T09:10:18+05:30 IST