పవన్‌ కల్యాణ్‌కు పాజిటివ్‌

ABN , First Publish Date - 2021-04-17T09:08:41+05:30 IST

సినీ నటుడు, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఆయన తన వ్యవసాయ క్షేత్రంలోనే చికిత్స పొందుతున్నారని,

పవన్‌ కల్యాణ్‌కు పాజిటివ్‌

వ్యవసాయ క్షేత్రంలో చికిత్స..

అవసరమైన సమయంలో ఆక్సిజన్‌

కేశినేని నాని, జావదేకర్‌, డిగ్గీ రాజాకూ కొవిడ్‌.. యెడ్డికి రెండోసారి

అపోలో వైద్యుల బృందం పర్యవేక్షణ


అమరావతి, ఏప్రిల్‌ 16 (ఆంధ్రజ్యోతి): సినీ నటుడు, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఆయన తన వ్యవసాయ క్షేత్రంలోనే చికిత్స పొందుతున్నారని, అపోలో వైద్యుల బృందం ఆయనను పర్యవేక్షిస్తోందని జనసేన పార్టీ కార్యాలయం శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొంది. పవన్‌కు అవసరమైనపుడు ఆక్సిజన్‌ అందిస్తున్నట్టు వెల్లడించింది. పవన్‌ ఈ నెల 3న తిరుపతిలో జరిగిన పాదయాత్ర, బహిరంగ సభలో పాల్గొన్నారు. హైదరాబాద్‌కు చేరుకున్న అనంతరం ఆయన వ్యక్తిగత సిబ్బందిలో కొందరికి పాజిటివ్‌ రావడంతో ఆయన కూడా కరోనా పరీక్ష చేయించుకున్నారు. నెగిటివ్‌ వచ్చింది. అయినా వైద్యుల సూచన మేరకు వ్యవసాయ క్షేత్రంలో క్వారంటైన్‌లోకి వెళ్లారు. ఆ తర్వాత కూడా జ్వరం, ఒళ్లు నొప్పులు ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి. రెండు రోజుల క్రితం మరోసారి కొవిడ్‌ పరీక్ష చేయగా పాజిటివ్‌ నిర్ధారణ అయింది.


దీంతో ఖమ్మం జిల్లాకు చెందిన ప్రముఖ వైరాలజీ నిపుణులు, కార్డియాలజిస్ట్‌ సుమన్‌ వెంటనే చికిత్స ప్రారంభించారు. ఆయనతో పాటు అపోలో హాస్పటల్స్‌ వైద్యుల బృందం కూడా పవన్‌కు ప్రత్యేక పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతానికి తన ఆరోగ్యం నిలకడగానే ఉందని, త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజలు, అభిమానులు ముందుకు వస్తానని ఆయన తెలిపారు. పవన్‌ కరోనా బారిన పడడంతో అన్నయ్య చిరంజీవి, వదిన సురేఖ, రామ్‌చరణ్‌, ఉపాసన ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీస్తూ అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు.

Updated Date - 2021-04-17T09:08:41+05:30 IST