Portugal: పోర్చుగల్‌లో విషాద ఘటన.. భారతీయ గర్భిణి మృతి.. ఆ దేశ ఆరోగ్య మంత్రి రాజీనామా

ABN , First Publish Date - 2022-09-02T12:51:40+05:30 IST

భారత్‌లో ప్రసవాలకు, కుటుంబ నియంత్రణ ఆపరేషన్లకు వెళ్లిన గర్భిణులు, బాలింతలు మృత్యువాత పడితే.. ప్రభుత్వాలు తీవ్రంగా తీసుకున్న దాఖలాలు అరుదు! ఇలాంటి ఘటనలు జరిగిన నాలుగైదు రోజుల తర్వాత తీరిగ్గా స్పందిస్తారు. ప్రతిపక్షాలు, మంత్రులు పరామర్శలకు వెళతారు. సంబంధిత వైద్యులను సస్పెండ్‌ చేసి, విచారణకు ఆదేశించామంటూ చేతులు దులుపుకొంటారు!

Portugal: పోర్చుగల్‌లో విషాద ఘటన.. భారతీయ గర్భిణి మృతి.. ఆ దేశ ఆరోగ్య మంత్రి రాజీనామా
మంత్రి మార్టా టెమిడో

ఓ ఆస్పత్రి నుంచి మరో ఆస్పత్రికి తరలింపు 

గర్భిణికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు

అత్యవసరంగా సిజేరియన్‌శిశువు సురక్షితం, తల్లి మృతి

లిస్బన్‌, సెప్టెంబరు 1: భారత్‌లో ప్రసవాలకు, కుటుంబ నియంత్రణ ఆపరేషన్లకు వెళ్లిన గర్భిణులు, బాలింతలు మృత్యువాత పడితే.. ప్రభుత్వాలు తీవ్రంగా తీసుకున్న దాఖలాలు అరుదు! ఇలాంటి ఘటనలు జరిగిన నాలుగైదు రోజుల తర్వాత తీరిగ్గా స్పందిస్తారు. ప్రతిపక్షాలు, మంత్రులు పరామర్శలకు వెళతారు. సంబంధిత వైద్యులను సస్పెండ్‌ చేసి, విచారణకు ఆదేశించామంటూ చేతులు దులుపుకొంటారు! అలాంటిది ఇతర దేశానికి చెందిన గర్భిణి ఇక్కడ మరణిస్తే.. పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. కానీ, పోర్చుగల్‌లో పరిస్థితులు ఇందుకు పూర్తి విరుద్ధం. భారత్‌కు చెందిన పర్యాటకురాలు, గర్భిణి (34)కి వైద్యం అందడంలో జాప్యం జరగడం, కార్డియాక్‌ అరె్‌స్టతో మరణించడంతో తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. ప్రతిపక్షాలు, వైద్య సిబ్బంది ఆరోపణల నేపథ్యంలో ఏకంగా ఆ దేశ ఆరోగ్య మంత్రి మార్టా టెమిడో రాజీనామా చేశారు. 2018 నుంచి ఆరోగ్య మంత్రిగా ఉన్న ఆమెకు కొవిడ్‌ సమయంలో అత్యద్భుతంగా పనిచేశారన్న పేరు కూడా ఉంది. భారత్‌కు చెందిన గర్భిణి మరణంతో ఆమె రాజీనామా చేయడమే కాదు.. ఘటనపై పోర్చుగల్‌ ప్రభుత్వం విచారణకు కూడా ఆదేశించింది. 


అసలేం జరిగిందంటే..

పోర్చుగల్‌ పర్యటనకు వెళ్లిన భారతీయ మహిళకు నొప్పులు రావడంతో రాజధాని లిస్బన్‌లోని అతిపెద్ద ఆస్పత్రి అయిన డీ శాంటా మారియాలో చేర్చారు. అక్కడ ప్రసూతి విభాగంలో పడకలు ఖాళీలు లేకపోవడంతో సావో ఫ్రాన్సిస్కో జేవియర్‌ ఆస్పత్రికి తరలించారు. మార్గ మధ్యంలో ఆమెకు శ్వాస తీసుకోవడంలో సమస్యలు తలెత్తాయి. ఆమెకు అత్యవసరంగా సిజేరియన్‌ శస్త్రచికిత్స చేశారు. 722 గ్రాముల బరువుతో పుట్టడంతో శిశువును ఐసీయూలో ఉంచారు. తల్లికి గుండెపోటు రావడంతో ఐసీయూలో చేర్చామని, చికిత్స పొందుతూ శనివారం మరణించారని జేవియర్‌ ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఈ ఘటనపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. ప్రసూతి ఆస్పత్రుల్లో సిబ్బంది కొరత ఉండడంతో తాత్కాలికంగా కొన్ని ఆస్పత్రుల్లో ఆ విభాగాలను మూసివేసి, గర్భిణులను ఇతర ఆస్పత్రులకు తరలిస్తున్నారని విపక్షాలు మండిపడ్డాయి. ఈ క్రమంలో ఆరోగ్య మంత్రి టెమిడో రాజీనామా చేసినట్లు మంగళవారం ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. ప్రస్తుత సంక్షోభాన్ని పరిష్కరించే మార్గాలు లేకపోవడం వల్లే ఆరోగ్య మంత్రి టెమిడో రాజీనామా చేశారని పోర్చుగీస్‌ వైద్యుల అసోసియేషన్‌ ఛైర్మన్‌ మిగుయేల్‌ గుమారెస్‌ చెప్పారు.   పోర్చుగల్‌లో ఇలా గర్భిణులను ఆస్పత్రుల మధ్య తిప్పడం, సకాలంలో వైద్యం అందకపోవడం వంటి కారణాల వల్ల ఇటీవల ఇద్దరు శిశువులు కూడా మరణించినట్లు స్థానిక మీడియా పేర్కొంది. 


మృతురాలి కుటుంబంతో మాట్లాడాం

పోర్చుగల్‌లో భారత మహిళ మృతి దురదృష్టకరమని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి అరిందమ్‌ బాగ్చి తెలిపారు. మృతురాలి కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నామని వెల్లడించారు. 

Updated Date - 2022-09-02T12:51:40+05:30 IST