Abn logo
Jun 15 2021 @ 04:19AM

పోర్టు అమ్మకం ప్రజాద్రోహం

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర క్యాబినెట్‌ 2021 జూన్‌ 8న గంగవరం పోర్టులో రాష్ట్ర ప్రభుత్వ వాటా 10.4 శాతాన్ని అదానీ గ్రూపుకు రూ.645కోట్లకు అమ్మాలని నిర్ణయించింది. ఈ పోర్టును స్పెషల్‌ ఎకనామిక్‌ జోన్‌గా మార్చేందుకు కూడా అనుమతించింది. ఈ నిర్ణయం రాష్ట్ర ప్రయోజనాలకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తుంది. పోర్టులనేవి దేశపు ముఖద్వారాలు. పోర్టులు ఉన్న ప్రాంతాలు ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందుతాయి. పోర్టుల ద్వారా జరిగే నౌక రవాణా రోడ్డు రవాణా కంటే అనేక రెట్లు చౌకగా ఉంటుంది. ఈ అంశంలో సముద్రతీరం ఏమాత్రం లేని రాష్ట్రాలు వెనుకబడతాయి. మన దేశంలో మధ్యప్రదేశ్‌ అలాంటి రాష్ట్రమే. దీన్నే ఆర్థికవేత్తలు ల్యాండ్‌ లాక్‌ స్టేట్‌ అంటారు. తూర్పు తీరానికి విశాఖపట్నం అత్యంత కీలకమైన ముఖద్వారం. తూర్పు దేశాలతో సంబంధాలకు చాలా అనువైన సముద్రతీరం ఇది. దేశ రక్షణకు కూడా అంతే కీలకమైనది. తూర్పు తీర నావికా కమాండ్‌ విశాఖపట్నంలోనే వున్నది. దీని పక్కనే గంగవరం ఏర్పాటుకు రక్షణశాఖ ఆనాడు తీవ్ర అభ్యంతరం తెలిపింది. రక్షణ రంగం పక్కనే ఒక ప్రయివేటు పోర్టు వుండడం దేశ భద్రతకు ప్రమాదమని హెచ్చరించింది. 2008 నవంబరు 26న పాకిస్థాన్ ఉగ్రవాదులు బొంబాయి తీరంలోని తాజ్‌హోటల్‌లో చొరబడిన ఉదంతాన్ని మర్చిపోలేం. అయినా గంగవరం పోర్టును ప్రయివేటు కార్పొరేట్‌ యాజమాన్యమైన అదానీ గ్రూపుకు అప్పగించడం దేశ భద్రత విషయంలో తేలిగ్గా వ్యవహరించడమే. 


గత సంవత్సరం కృష్ణపట్నం పోర్టును అదానీ గ్రూపు పూర్తిగా కొనేసింది. గంగవరం పోర్టులోని డివిఎస్‌ రాజు కుటుంబం నుంచి 58.1శాతం వాటాలను రూ.3604కోట్లకు, వార్‌బర్గ్‌ పింకర్స్‌ అనే విదేశీ కంపెనీ నుంచి 31.5శాతం వాటాలను రూ.1954 కోట్లకు ఈ ఏడాది మార్చిలో అదానీ గ్రూపు బలవంతంగా కేంద్ర ప్రభుత్వం ఒత్తిడితో లాక్కొన్నది. ఇలా ముందు ప్రయివేటు పోర్టులను, తరువాత ప్రభుత్వరంగ పోర్టులన్నింటినీ బలవంతగా లాక్కొవడానికి కేంద్ర ప్రభుత్వం సంపూర్ణంగా సహకరిస్తున్నది. ఇందుకు అనుకూలంగా మేజర్‌ పోర్టు, మైనర్‌ పోర్టుల చట్టాలను మార్చి వేసింది. దేశంలోనే అత్యంత విలువైన అనేక కీలకభారీ పరిశ్రమలను కారుచౌకగా అదానీ, అంబానీలకు కట్టబెడుతున్నది. ఈ కోవలోనే ఎయిర్‌ పోర్టుల నిర్వహణలో అనుభవంలేని అదానీ గ్రూపుకు గత సంవత్సరంలో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఐదు ఎయిర్‌ పోర్టులను అప్పగించింది.


గంగవరం పోర్టులోని 10.4శాతం రాష్ట్ర ప్రభుత్వ వాటాలను కేంద్ర ప్రభుత్వ ఒత్తిడికి లొంగి రాష్ట్ర ప్రభుత్వం అదానీ గ్రూపుకు అమ్మాలని నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వానికి గంగవరం పోర్టు యాజమాన్యంతో ఉన్న ఒప్పందం ప్రకారం 30ఏళ్ల తరువాత ప్రయివేటు పోర్టు యాజమాన్యం లీజు రద్దయి గంగవరం పోర్టు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం యాజమాన్యంలోకి రావాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం తన వాటాలను పూర్తిగా అమ్మడంతో పాటు భవిష్యత్‌ లీజు హక్కులను కూడా పూర్తిగా వదులుకుంటున్నది. గంగవరం పోర్టు అత్యంత విలువైనది. 2008లో పోర్టు నిర్మాణం పూర్తయిన దగ్గర నుంచి ఎగుమతి, దిగుమతుల్లో అత్యధిక లాభాలను గడించింది. బహుళ ప్రయోజనాలు కల్గిన గంగవరం పోర్టు అత్యధిక లోతు 21 మీటర్లు ఉన్నందున రెండు లక్షల టన్నుల సామర్థ్యం కలిగిన పనామా ఓడలు ఇక్కడకు రాగలుగుతున్నాయి. బొగ్గు, ఇనుప ఖనిజం, ఎరువులు, సున్నపురాయి, బాక్సైట్‌, ముడి పంచదార, అల్యూమినా వంటి విలువైన సరుకుల ఎగుమతి, దిగుమతులు జరుగుతున్నాయి. అత్యంత విలువైన గంగవరం పోర్టు వాటాలను కొనసాగించడం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రజలకు దీర్ఘకాలిక ప్రయోజనాలు ఒనగూరుతాయి.


బంగారుబాతు లాంటి గంగవరం పోర్టును తెగనమ్మడం వల్ల రాష్ట్రం తన హక్కులను కోల్పోతుంది. ఈక్విటీ వాటాలు అమ్మడం వల్ల లాభాల రూపంలో వచ్చే డివిడెండ్లను కోల్పోతుంది. ముఖ్యంగా ఎస్‌ఇజెడ్‌ పోర్టుగా మార్చడం వల్ల ప్రధానంగా పన్నుల రూపంలో వచ్చే ఆదాయం రాష్ట్రానికి వుండదు. పోర్టు యాజమాన్యానికే ఆ రాయితీలు లభిస్తాయి. చివరకు విశాఖ మహా నగర కార్పొరేషన్‌కు చెల్లించే పన్నులు కూడా ఎగ్గొట్టడానికే అదానీ గ్రూపు దీనికి ఎస్‌ఇజెడ్‌ పోర్టుగా మార్చుకుంటోంది. దీనికి ఒప్పుకోవటమంటే రాష్ట్ర ఆదాయాన్ని కొల్లగొట్టడానికి స్వయంగా రాష్ట్ర ప్రభుత్వమే అదానీ గ్రూపుకు అవకాశం అందించినట్టు. గంగవరం పోర్టులో రాష్ట్ర ప్రభుత్వ వాటా 10.4 శాతమే అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రశ్నించే అధికారం వున్నది. కీలక రంగమైన పోర్టులో ఏం జరుగుతుందో రాష్ట్రానికి తెలుస్తుంది. కానీ పూర్తి వాటాలు అమ్మడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం అన్ని హక్కులనూ కోల్పోతుంది. రాష్ట్ర క్యాబినెట్‌ ఈ నిర్ణయంతో రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టుపెట్టిందనే చెప్పాలి. భారతదేశంలోనే సముద్రతీరంలోవున్న ఏకైక భారీ స్టీల్‌ప్లాంట్‌ మన విశాఖ స్టీల్‌ప్లాంట్‌ మాత్రమే. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ నిర్మాణానికి ముందు దేశంలో నిర్మించబడిన బొకారో, భిలాయ్‌, దుర్గాపూర్‌, రూర్కెలా స్టీల్‌ప్లాంట్‌లన్నీ సముద్రతీరానికి సుమారు 500కి.మీ. పైగా దూరంలో వున్నాయి. దీనివల్ల స్టీల్‌ లాంటి భారీ ఖనిజాల రవాణా ఎగుమతి, దిగుమతులకు వ్యయం ఎక్కువవుతోంది. సముద్రం తీరంలోనే ఐదవ భారీ స్టీల్‌ కర్మాగారం నిర్మించాలని 1966లో అంతర్జాతీయ సంస్థ అయిన ఆంగ్లో అమెరికన్‌ కన్సార్టియం సిఫార్సు చేసింది. అందువల్లనే విశాఖ స్టీల్‌ప్లాంటును సముద్రతీరంలో నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.


కానీ వాజ్‌పేయ్‌ నాయకత్వంలోని బిజెపి ప్రభుత్వం 2003లో కేంద్రప్రభుత్వ ఆధీనంలోని విశాఖ స్టీల్‌ప్లాంట్‌ భూములు 1800 ఎకరాలు ప్రయివేటు యాజమాన్యానికి కట్టబెట్టింది. దీనివల్ల విశాఖ స్టీలు ఎగుమతి దిగుమతుల్లో సంవత్సరానికి సుమారు రూ.200 కోట్లు నష్టపోతున్నది. ఇప్పుడు అదానీ గ్రూపు యాజమాన్యం రవాణా టారిఫ్‌ను తన ఇష్టమొచ్చినట్లు రాబోయే కాలంలో నిర్ణయిస్తుంది. దీనివల్ల అదానీ గ్రూపుకు అత్యంత లాభాలు, విశాఖ స్టీల్‌ప్లాంటుకు మరింత నష్టాలు పెరుగుతాయి. ఈ నష్టాల పేరుతో విశాఖ స్టీల్‌ప్లాంటు వేగంగా ప్రయివేటీకరించడానికి కేంద్ర ప్రభుత్వం పావులు కదుపుతోంది. విశాఖ స్టీల్‌ప్లాంటుకు సముద్రతీరం అంత్యంత అనుకూలమైన అంశం. దీన్ని బిజెపి ప్రభుత్వం వమ్ము చేసింది. విశాఖ స్టీల్‌ప్లాంటును ప్రయివేటుకు అప్పగించాలని ఆనాడే ద్రోహానికి ఒడిగట్టింది. విశాఖ స్టీల్‌ప్లాంటును ప్రయివేటీకరించాలని పార్లమెంటులో చర్చకు పెట్టింది. ఆనాడు స్టీలు మంత్రిత్వశాఖ, నౌకాయాన మంత్రిత్వశాఖలు ప్రయివేటు యాజమాన్యాలకు అప్పగించడాన్ని వ్యతిరేకించాయి. మేజర్‌ పోర్టు చట్టం, పార్లమెంట్‌ స్టాండింగ్‌ కమిటీ నిర్ణయం ప్రకారం పోర్టుల మధ్య దూరం కనీసం 200కి.మీ. ఉండాలి. విశాఖ పోర్టు నుంచి 20కి.మీ. దూరం లేకుండా అన్ని చట్టాలను తుంగలోతొక్కి వాజ్‌పేయ్‌ ప్రభుత్వం గంగవరం పోర్టును ప్రయివేటుకు అనుమతించింది. ప్రధాని వాజ్‌పేయ్‌ ఆనాడే గంగవరం పోర్టును ప్రయివేటుకు అప్పగించి తప్పుడు నిర్ణయం చేశారు. బలవంతంగా విశాఖ స్టీల్‌ప్లాంటు భూములను ప్రయివేటు కంపెనీకి కట్టబెట్టారు. చిన్న ప్రయివేటును మింగే పెద్ద తిమింగలం ముందుకొచ్చింది. రానున్న కాలంలో అదానీ పోర్టు గ్రూపు వల్ల కృష్ణపట్నం పోర్టు వల్ల చెన్నై పోర్టుకు గంగవరం పోర్టు వల్ల విశాఖ పోర్టుకు తీవ్రనష్టం కలుగుతుంది. ప్రభుత్వరంగాన్ని దెబ్బకొట్టడానికి కేంద్ర బిజెపి ప్రభుత్వం అదానీ గ్రూపుకు పూర్తి అండదండలు అందిస్తోంది. ఇది దేశ ప్రయోజనాలకు తీరని హాని కలిగిస్తుంది. 

సిహెచ్‌ నర్సింగరావు

వ్యాసకర్త సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు


ప్రత్యేకంమరిన్ని...